Google Pay: పండగ చేసుకున్న గూగుల్ పే యూజర్లు.. యాప్‌లో లోపంతో రూ.80 వేల క్యాష్‌బ్యాక్..!
ABN , First Publish Date - 2023-04-10T20:21:30+05:30 IST
పండగ చేసుకున్న గూగుల్ పే యూజర్లు.. యాప్‌లో లోపంతో రూ.80 వేల క్యాష్‌బ్యాక్..!
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ పే, ఫోన్ పే మార్కెట్లోకి వచ్చిన కొత్తల్లో తెగ క్యాష్ బ్యాక్స్ ఆఫర్ చేస్తుండేవి. అదో మార్కెటింగ్ స్ట్రాటజీ. మనలో చాలా మందికి ఈ విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ క్యాష్ బ్యాక్స్ కోసమే కొందరు ఆ యాప్స్‌లో చెల్లింపులు, కొనుగోళ్లు చేస్తుండేవారు. అయితే ఇదంతా గతం. ఈ యాప్స్ పాపులారిటీ పెరిగాకా క్యాష్ బ్యాక్స్ ఆఫర్లు కాస్తంత తగ్గాయి. ఇలాంటి టైంలో అమెరికాలోని(USA) గూగుల్ పే(Google pay) వినియోగదారులకు ఓ ఊహించని సర్‌ప్రైజ్ వచ్చింది. గూగుల్‌లో చెల్లింపులు చేసిన చాలా మందికి 100 నుంచి 1000 డాలర్లకు వరకూ క్యాష్ బ్యాక్స్(Cashbacks) రావడంతో ఈ వార్త సంచలనంగా మారింది. ముఖ్యంగా ఫిక్సెల్ ఫోన్(Pixel Phone) యూజర్లకు ఈ ఆఫర్ల వర్షం కురిసింది.
సోషల్ మీడియాలో అనేక మంది యూజర్లు తమకొచ్చిన ఆఫర్స్ గురించి తెలియజేశారు. తాను 16 ట్రాన్సాక్షన్స్ జరపగా 10 లావాదేవీల్లో డబ్బులు వెనక్కు వచ్చాయని అతడు చెప్పాడు. తమకు 100 డాలర్లు క్యాష్ బ్యాక్ వచ్చినట్టు కొందరు ఉబ్బితబ్బిబ్బైపోయారు. మరో వ్యక్తి తనకు 240 డాలర్లు వెనక్కు వచ్చినట్టు తెలిపాడు. ఇక ఓ వ్యక్తి అయితే ఏకంగా 1072 డాలర్ల క్యాష్ బ్యాక్ వచ్చినట్టు తెలిపాడు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది రూ.80 వేలకు పైనే!
ఈ వార్త వైరల్ కావడంతో అనేక మంది గూగుల్ పేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా నిరాశే ఎదురైంది. యాప్‌లో పొరపాటును అప్పటికే గుర్తించిన గూగుల్ దాన్ని సరిదిద్దుకుంది. అయితే.. ఇలా క్యాష్ బ్యాక్‌కు ఇచ్చిన వారి నుంచి గూగుల్ డబ్బులు వెనక్కి తీసుకున్నట్టు కొందరు చెప్పడం ఈ మొత్తం ఉదంతంలో కొసమెరుపు. అయితే..కొందరు తమ వ్యాలెట్ లోంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న వారిని గూగుల్ టచ్ చేయలేదట. అమెరికాలో గూగుల్ ఈ చెల్లింపులను వ్యాలెట్ రూపంలో అందిస్తోంది.