Celestis: ఆ ముగ్గురు అమెరికన్ అధ్యక్షుల జుట్టును అంతరిక్షంలోకి పంపనున్నారు, కారణం ఏంటంటే?
ABN , Publish Date - Dec 14 , 2023 | 10:07 PM
జాన్ ఎఫ్ కెనెడీ, ఐసెన్ హావర్, జార్జి వాషింగ్టన్.. దివంతగ మాజీ అమెరికా అధ్యక్షులైన ఈ ముగ్గురి జుట్టు శాంపిళ్లను అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: జాన్ ఎఫ్ కెనెడీ, ఐసెన్ హావర్, జార్జి వాషింగ్టన్.. దివంగత మాజీ అమెరికా అధ్యక్షులైన ఈ ముగ్గురి జుట్టు శాంపిళ్లను అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి (Hair samples of 3 former presidents to be sent into space). అమెరికాకు సేవ చేసిన ముగ్గురు నేతలకు నివాళిగా వారి జుట్టును అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. యూనైటెడ్ లాంచ్ అలయన్స్ (United launch alliance) అనే సంస్థకు చెందిన వల్కన్ రాకెట్ (Vulcan rocket) ద్వారా ఈ జుట్టు శాంపిళ్లను అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు. ఈ నెలాఖరున చేపట్టే ఈ ప్రయోగానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తున్న సంస్థ పేరు సెలెస్టిస్ (Celestis).
తాజాగా మిషన్ గురించి సెలెస్టిస్ సంస్థ ప్రెసిడెంగ్ కోల్బీ యంగ్‌బ్లడ్ గతంలో పలు వివరాలు వెల్లడించారు. అంతరిక్షంలోని ఈ శాంపిళ్లను భవిష్యత్తు తరాలు చూసి అమెరికా అధ్యక్షుల గురించి తెలుసుకుంటాయని వ్యాఖ్యానించారు. వారి స్మృతులను అజరామరం, చిరస్మరణీయం చేసేందుకు ఈ మిషన్ చేపట్టామని వెల్లడించారు. మాజీ అధ్యక్షుల శాంపిల్స్‌తో పాటూ స్టార్ ట్రెక్ టీవీ సిరీస్ సృష్టికర్త జీన్ రాడెన్‌బరీ, ఆయన భార్య మాజెల్ అస్తికలు, వారి కుమారుడి డీఎన్‌ఏ శాంపిల్ కూడా పంపిస్తారు. స్టార్ ట్రెక్ సృష్టికర్తకు నివాళిగా తమ ప్రయోగానికి సెలెస్టిస్ ఎంటర్‌ప్రైజ్ ఫ్లైట్ అని కూడా నామకరణం చేసింది. కాగా. స్టార్ ట్రెక్ సృష్టికర్త భార్యకు, 1997లో తానిచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఆ దంపతుల అస్తికలు అంతరిక్షంలోకి పంపిస్తున్నట్టు కూడా సంస్థ సీఈఓ పేర్కొన్నారు. వీరితో పాటూ సెలెస్టిస్ ఈ మిషన్‌లో భాగంగా మొత్తం 150 ఫ్లైట్ క్యాప్సూల్స్ అంతరిక్షంలోకి లాంచ్ చేయనుంది.
గత కొన్నేళ్లుగా సెలెస్టిస్ మరణించిన వారి డీఎన్ఏ అస్థికలను అంతరిక్షంలోకి పంపిస్తోంది. మృతులకు ఇచ్చే ఘనమైన నివాళి ఇదేనని సంస్థ చెబుతోంది. ఇలా శాంపిళ్లను అంతరిక్షంలోకి పంపించేందుకు సెలెస్టిస్ కనీస మొత్తంగా 3000 డాలర్లు చార్జ్ చేస్తోంది.