Gold: బంగారం కొనాలనుకుంటున్నారా..? ఈ శనివారం నుంచి కొత్త రూల్.. ఇకపై గోల్డ్ కొనాలంటే..!
ABN , First Publish Date - 2023-03-29T15:24:31+05:30 IST
మీరు ఈ మధ్య బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ శనివారం (ఏప్రిల్ 1) నుంచి బంగారం కొనుగోలు విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి.
మీరు ఈ మధ్య బంగారం (Gold) కొనాలనుకుంటున్నారా? ఈ శనివారం (ఏప్రిల్ 1) నుంచి బంగారం కొనుగోలు విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. శనివారం నుంచి రెండు గ్రాములకు మంచి బంగారం కొనాలన్నా, అమ్మాలన్నా హాల్ మార్కింగ్ (Hallmarking) తప్పనిసరి అంటూ కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. హాల్‌మార్క్ లేని బంగారు అమ్మకాలు, కొనుగోళ్లు ఏప్రిల్ 1 నుంచి నిషేధం. బంగారం కొనుగోళ్లలో మోసపోతున్న వినియోగదారులను ఈ నూతన హాల్‌మార్కింగ్ విధానం రక్షిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. హాల్‌మార్కింగ్ విధానంతో బంగారం అమ్మకాలను, కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం ట్రాక్ చేయగలదు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) చట్టం ప్రకారం 2000 నుంచి మనదేశంలో బంగారానికి, వెండికి హాల్‌మార్కింగ్ చేసే విధానం మొదలైంది. బంగారం స్వచ్ఛత, నాణ్యతలను నిర్ధారించేదే హాల్‌మార్క్. ఇప్పటివరకు నాలుగు అంకెల, ఆరు అంకెల హాల్‌మార్కింగ్ విధానం నడుస్తోంది. ఇకపై అక్షరాలు, అంకెలు కలిసి ఉండే (ఆల్ఫా న్యూమరిక్) సిక్స్ డిజిట్ హాల్‌మార్కింగ్ అమల్లోకి రాబోతోంది. దీనినే హాల్‌మార్క్ యునీక్ ఐడెంటిఫికేషన్ (HUID) అంటారు. భారత ప్రభుత్వం సర్టిఫై చేసిన హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఈ హాల్ మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేస్తాయి. ఈ కేంద్రాలు బంగారం స్వచ్ఛతను, నాణ్యతను తనిఖీ చేస్తాయి.
Viral Video: లక్ష రూపాయలు మీకిస్తే.. 24 గంటల్లోనే ఖర్చు పెట్టమంటే నువ్వేం చేస్తావ్..?.. ఈ యువతి చెప్పింది విని నెట్టింట ఫన్నీ సెటైర్లు..!
ఈ హాల్ మార్కింగ్‌లో బంగారు దుకాణానికి చెందిన నంబరు, హాల్‌మార్కింగ్ పరీక్షా కేంద్రానికి చెందిన నంబరు కలిపి లేజర్ ప్రింటింగ్ ద్వారా బంగారంపైన యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్ వేస్తారు. అలాగే బీఐఎస్ ముద్ర, బంగారం స్వచ్ఛత, నాణ్యత వివరాలను కూడా ముద్రిస్తారు. బంగారం బరువు, నాణ్యత వంటి విషయాల్లో మోసాలకు హాల్‌మార్కింగ్ అడ్డుకట్ట వేస్తుంది. బంగారం స్వచ్ఛతను, నాణ్యతను హాల్‌మార్కింగ్ నిర్ధారిస్తుంది కాబట్టి వినియోగదారుకు భరోసా కలుగుతుంది. హాల్‌మార్కింగ్‌ను వెరిఫై చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం BIS Care appని తీసుకొచ్చింది. దుకాణాల్లో బంగారాన్ని కొనే ముందు, దాని మీద ముద్రించిన యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను అందులో ఎంటర్ చేసి, అది నిజమైన హాల్‌మార్కేనా, కాదా అనేది నిర్ధారించుకోవచ్చు.