భార్య తల నరికి హీరోలా ఫోజులు.. ఆ మానవ మృగానికి కేవలం 8 ఏళ్లే జైలు శిక్ష.. ఇంత చిన్న శిక్ష ఏంటని ఆరా తీస్తే..
ABN , First Publish Date - 2023-01-19T16:13:50+05:30 IST
నరరూప రాక్షసుడికి ఉరి శిక్ష ఖాయం అని అంతా అనుకుంటారు కానీ
భార్యను చంపాడు.. ఆమె తలను నరికి నడి వీధుల్లోకి వచ్చాడు. ఓ చేత్తో ఆమె తలను పట్టుకుని వీధుల్లో వీర విహారం చేశాడు.. హీరోలా ఫోజులిచ్చాడు.. అలాంటి నరరూప రాక్షసుడికి ఉరి శిక్ష ఖాయం అని అంతా అనుకుంటారు కదా.. కానీ అతడికి కోర్టు మాత్రం కేవలం ఎనిమిదేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించింది. అదేంటని అంతా విస్మయం వ్యక్తం చేస్తోంటే అలాంటి తీర్పు ఇవ్వడం వెనుక అసలు కారణమేంటో కూడా కోర్టు ప్రతినిధులు బయటపెట్టారు. ఇరాన్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇరాన్ దేశానికి చెందిన మోనా అనే మహిళకు 12 సంవత్సరాల వయసులో సజ్జద్ హైదరీ అనే వ్యక్తితో పెళ్ళైంది. ఆమెకు 14సంవత్సరాల వయసుకే ఇద్దరు పిల్లలు పుట్టారు. సజ్జద్ హైదరీ ప్రతిరోజూ మోనాను కొట్టి హింసిస్తూ ఉండేవాడు. ఈ కారణంగా మోనా 'నేను అతని హింసలు భరించలేను నాకు విడాకులు ఇప్పించండి' అని కోరింది. అయితే ఆమె మాటలు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన మోనా ఇరాన్ నుండి టర్కీ పారిపోయింది. ఆమె అంతదూరం పారిపోయినా ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వదిలెయ్యలేదు. 'నువ్వు అడిగినట్టే నీకు విడాకులు ఇప్పిస్తాం నువ్వు వచ్చెయ్యి' అని ఆమె మీద ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే విడాకులు వస్తాయనే ఆశతో మోనా 2020 ఫిబ్రవరిలో తిరిగి వచ్చేసింది. ఆమె వచ్చేసిన మూడు నెలలకు 2020 మే నెలలో ఆమె భర్త సజ్జద్ హైదరీ ఆమె తలనరికి చంపేశాడు. అతను అలా చంపేటప్పుడు మోనా సోదరుడు కూడా అతనికి సహకరించాడట. అప్పటినుండి వీరిద్దరూ పోలీసులకు చిక్కకుండా రహస్య ప్రదేశాల్లో తలదాచుకున్నారు.
శిక్ష సంగతేంటంటే..
సోమవారం పోలీసులు మోనా సోదరుడు, భర్త దాక్కున్న ఇంటిమీద దాడిచేసి వారిద్దరినీ అరెస్ట్ చేసారు. సాధరణంగా ఇరాన్ లో ఇలాంటి నేరాలు చేసినప్పుడు కోర్టు నేరుగా ఉరి తీయమని తీర్పు ఇస్తుంది. కానీ అలా కాకుండా బాదితుల కుటుంబం నేరస్తుడిని క్షమిస్తే మాత్రం శిక్ష తగ్గిస్తుంది. మోనా సోదరుడు కూడా నేరస్తుడిగా ఉండటంతో మోనా కుటుంబ సభ్యులు నేరస్తులను క్షమించారు. ఈ కారణంగా నిందితులకు 8సంవత్సరాల శిక్ష మాత్రమే విధించారు. గత సంవత్సరంలో ఈ హత్య జరగగా జనవరి 18న కోర్టు శిక్ష విధించడంతో ఈ హత్య గురించి విషయాలు తెరమీదకు వచ్చాయి. ఈ విషయం విన్న నెటిజన్లు సరైన శిక్ష పడాలంటే ఇలాంటి క్షమాబిక్షలు తొలగించాలి అని అంటున్నారు.