నువ్వు నాకిష్టం లేదు.. నీ ముఖం కూడా చూపించకు.. పెళ్లయిన మర్నాడే భార్యకు తేల్చిచెప్పిన భర్త.. తండ్రికి ఫోన్ చేస్తే..
ABN , First Publish Date - 2023-01-05T15:38:26+05:30 IST
సరిగా మాట్లాడడు, తన గురించి పట్టించుకోడు. కొత్త కదా మెల్లిగా అలవాటవుతుందేమో అనుకుంది. కానీ...
కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళింది ఆ అమ్మాయి. తన భర్త ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపించిందామెకు. సరిగా మాట్లాడడు, తన గురించి పట్టించుకోడు. కొత్త కదా మెల్లిగా అలవాటవుతుందేమో అనుకుంది. కానీ మరుసటిరోజే నీ ముఖం నాకు చూపించిద్దని ఆమె ముఖం మీదే చెప్పాడు అతడు. ఆ మాటలు విని ఆమె విస్తుపోయింది. తన పెళ్ళి వెనుక జరిగిన మోసం గురించి తెలిసి షాక్ కు గురయింది. ఈమెకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ రాష్ట్రంలో పలి అనే గ్రామానికి చెందిన హనుమాన్ దేవాసి అనే వ్యక్తితో మమతకు వివాహం జరిగింది. పెళ్ళయిన మరుసటిరోజే ఆమె భర్త 'నువ్వంటే నాకిష్టం లేదు, నీ ముఖం చూపించకు' అన్నాడు. 'అలాంటపుడు నన్ను ఎందుకు పెళ్ళి చేసుకున్నావు?' అని మమత అడగగా 'అట్టా-సత్తా అనే సంప్రదాయం ప్రకారం నా చెల్లెలు కోసం నిన్ను పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. నేను మరొకరిని ప్రేమిస్తున్నాను నాకు నువ్వంటే ఇష్టం లేదు' అని చెప్పాడు అతను.
ఏమిటి అట్టా-సత్తా..
రాజస్థాన్ రాష్ట్రంలో కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో అట్టా-సత్తా ఒకటి. ఇందులో రెండు కుటుంబాలలో పెళ్ళి వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నప్పుడు ఆడపిల్లలను ఎదుటి కుటుంబంలోకి కోడలుగా పంపడం ద్వారా వారి పెళ్ళితో పాటు మగపిల్లల పెళ్ళి కూడా చేస్తారు. అయితే ఇందులో మగపిల్లల అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తారు తప్ప ఆడపిల్ల అభిప్రాయానికి విలువ ఉండదు. మమత కూడా అదే విధంగా ఆ ఇంటి కోడలయ్యింది.
పెళ్ళయిన కొన్నాళ్ళకు ఆమె భర్త ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. నా కంటికి కనిపించకు కనిపించావంటే చంపేస్తాను వెళ్ళిపో ఇక్కడి నుండి అని బెదిరించాడు. మమత తన తండ్రికి ఫోన్ చేసి విషయమంతా చెప్పగా 'నువ్వు ఇక్కడికి రావద్దు అక్కడే ఉండు, నీ భర్త నిన్ను చంపితే నీ శవాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాం' అని ఎంతో దారుణంగా సమాధానం ఇచ్చాడు. భర్త కొన్ని సార్లు చావగొట్టి ఇంట్లోంచి బయటకు గెంటేస్తే అతని మీద పోలీసు కేసు పెట్టాలనే ఆలోచన వచ్చినా తన అన్న భార్య జీవితం ఏమైపోతుందో అనే కారణంతో ఆ ఆలోచన విరమించుకుంది. అటు భర్త ఇంటిలో సంతోషంగా ఉండలేక ఇటు తల్లిదండ్రుల అండ లేక దుర్భర జీవితం గడుపుతున్న మమత తనను ఎవరైనా ఆదుకుంటారని ఎదురుచూస్తోంది.