Viral: 191 ఏళ్లొచ్చినా బతికున్న జీవికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు.. ఇదేంటో తెలుసా?
ABN , First Publish Date - 2023-12-11T16:05:39+05:30 IST
191 ఏళ్లొచ్చినా ఇంకా బతికున్న ఓ జీవికి ఇటీవలే పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. దీని ఉదంతం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
ఇంటర్న్ డెస్క్: మనిషికి 60 ఏళ్లు దాటితే సంపూర్ణ ఆయుర్దాయం అని అంటారు. ఏనుగులకు కూడా దాదాపుగా మనిషికి ఉన్నంత ఆయుర్దాయమే ఉంటుంది. కొన్ని జంతువులు 100 ఏళ్లకు పైబడి కూడా జీవిస్తాయి. ప్రస్తుతం మనం అలాంటి జంతువు గురించే చెప్పుకోబోతున్నాం. మనం చెప్పుకోబోయే తాబేలు 1832లో పుట్టింది. బ్రిటీష్ ఓవర్సీస్ టెరిటరీలోని సెయింట్ హెలీనా (St. Helena) ద్వీపంలోని గవర్నర్ నివాసం పరిసరాల్లో ప్రస్తుతం నివసిస్తోంది. ఇటీవలే ఈ తాబేలుకు (Jonathan, the tortoise) 191 సంవత్సరాలు నిండటంతో అక్కడ పెద్ద వేడుకే చేశారు.
జానథన్ విశేషాలు ఇవీ..
జానథన్ అనే పేరుగల ఈ తాబేలు ప్రస్తుతం191 ఏళ్లకు చేరుకుంది. అత్యధిక వయసున్న జంతువుగా 2021లో గిన్నిస్ రికార్డు (Guiness Record) కూడా సాధించింది. కంటి చూపు మందగించడం, చెవుడు మినహా తాబేలు ఆరోగ్యంగానే ఉందని అక్కడి పశువుల డాక్టర్ ఒకరు తెలిపారు. రకరకాల పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని దానికి తాము చేతితో తినిపిస్తున్నట్టు ఆ డాక్టర్ పేర్కొన్నారు.
చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ఈ తాబేలు ఇప్పటివరకూ 8 మంది బ్రిటీష్ సామ్రాజ్యాధినేతలు, 40 మంది అమెరికా అధ్యక్షుల పాలనను చూసింది. క్యాబేజీ, దోసకాయలు, కారెట్లు, యాపిల్స్ అంటే ఇష్టపడే జానథన్, ఉదయం సాయం వేళల్లో సూర్యకాంతిని తెగ ఎంజాయ్ చేస్తుంటుందని అక్కడి వారు చెబుతారు.
వాస్తవానికి ఈ తాబేలు ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. 1882లో దీన్ని సీషెల్స్ ద్వీపం నుంచి సెయింట్ హెలీనా ద్వీపానికి తరలించారు. అప్పట్లో దీని వయసు 50గా పశువైద్యులు నిర్ణయించారు. దీంతో తాబేలు పుట్టిన సంవత్సరం 1832గా స్థిరపడింది. కాగా, ఇటీవలి జానథన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.