Karnataka Bride: పాపం ఈ పెళ్లి కూతురు.. పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన అమ్మాయి ఐసీయూలో చేరాల్సొచ్చింది..!
ABN , First Publish Date - 2023-03-04T12:53:53+05:30 IST
ఈరోజుల్లో మేకప్ అనేది సర్వసాధారణంగా మారింది. ఒకప్పుడు సంపన్న కుటుంబాలకు చెందిన మహిళలకు మాత్రమే పరిమితమైన అలంకరణ ఇవాళరేపు మెజార్టీ అమ్మాయిలంతా..
ఈరోజుల్లో మేకప్ అనేది సర్వసాధారణంగా మారింది. ఒకప్పుడు సంపన్న కుటుంబాలకు చెందిన మహిళలకు మాత్రమే పరిమితమైన అలంకరణ ఇవాళరేపు మెజార్టీ అమ్మాయిలంతా మేకప్ చేసుకోనిదే బయటకు అడుగుపెట్టనంత వరకూ పరిస్థితి వచ్చింది. ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న బ్యూటీపార్లర్లే ఇందుకు నిదర్శనం. ఇక ఇంట్లో శుభకార్యం ఏదైనా ఉందంటే.. బ్యూటీషియన్స్‌కు భారీ మొత్తంలో చెల్లించి మరీ యువతులు అందంగా కనిపించేందుకు ఆరాటపడుతుంటారు. వధువు మేకప్ కోసం బ్యూటీషియన్స్ ప్రత్యేకంగా ఉంటారు. కానీ.. కొన్నికొన్ని సార్లు ఈ మేకప్ వికటించి అందమైన ముఖం కాస్తా అందవిహీనంగా మారిన ఘటనలూ అడపాదడపా జరిగాయి.
అలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలోని (Karnataka) హసన్ జిల్లాలో (Hassan District) వెలుగుచూసింది. మేకప్ వికటించడంతో వధువు ఆసుపత్రి పాలై, పెళ్లి వాయిదా పడిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. హసన్ జిల్లాలోని జాజూరు గ్రామానికి చెందిన ఒక యువతికి పెళ్లి సంబంధం కుదిరింది. నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకలో మరింత అందంగా కనిపించాలని అర్సికెరె పట్టణంలోని (Arsikere Town) గంగశ్రీ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ స్పాలో పది రోజుల క్రితం మేకప్ చేయించుకుంది. ఆ మేకప్ చేసిన సందర్భంలో ముఖంపై ఏం వాడారో తెలియదు గానీ రోజురోజుకూ ఆమె ముఖం అంద విహీనంగా తయారవుతూ వచ్చింది.
ఆ బ్యూటీషియన్‌ను ఇదేంటని అడగ్గా.. కొత్త రకం మేకప్‌ను ఆమె ముఖంపై అప్లై చేశానని, ఆమె చర్మానికి సరిపడకపోవడంతో అలర్జిక్ రియాక్షన్ (Alergic Reaction) కారణంగా ఇలా జరిగిందని చెప్పింది. చివరకు ఆ వధువు ఐసీయూలో (Bride In ICU) చేరి చికిత్స పొందుతున్న వరకూ పరిస్థితి రావడం శోచనీయం. శుక్రవారం నాడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ బ్యూటీపార్లర్ యజమాని అయిన గంగపై వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సులు చేయకుండానే నేరుగా ముఖాలపై ప్రయోగాలు చేయడం వల్ల జరిగే అనర్థాలకు ఈ ఘటన సాక్ష్యంగా నిలిచింది. మేకప్ చేయించుకోవాలనుకునే యువతులు కూడా ప్రొఫెషనల్స్ వద్దకు మాత్రమే వెళ్లడం మేలని నిరూపించిన ఘటన ఇది.