YEAR ENDER: 2023లో నిఘంటువుల్లో చేరిన కొత్త ఆంగ్ల పదాలు ఇవే..!!
ABN , Publish Date - Dec 22 , 2023 | 03:23 PM
2023లో ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీకి 650 కొత్త ఆంగ్ల పదాలు జోడించారు.
మనసులోని భావాన్ని వ్యక్తపరిచేందుకు మన సాధనం భాష.. మాటల ద్వారానే చాలా విషయాలను చెబుతూ ఉంటాం. భాష కాలానికి తగినట్టుగా మారుతూ వస్తుంది. అది ఏ భాష అయినా అందులో మార్పులనేవి కాలానికి తగినట్టుగా జరుగుతూనే ఉంటాయి. యాసతో కూడిన భాష ఒకవిధంగా మనుషులు ఎక్కడి వారు, ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది తెలియజేస్తే, తెలుగు, తమిళం, ఇంగ్లీష్ ఇలా ఇతర భాషలలో మాట్లాడగలగడం ఇంకాస్త గొప్ప కళ. ఇతర భాషలలోనూ మార్పులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి రోజుల్లో మారుతున్న సాంకేతికతకు తగినట్టుగా మనల్ని మనం మలుచుకునే విధానంలో ఇతర భాషలను నేర్చుకుని అందులో అనర్గళంగా మాట్లాడగలగడం అనేది కెరియర్ పరంగా సపోర్ట్ గా నిలుస్తుంది.
ఇంగ్లీష్ భాషలో 2023కు కొన్ని పదాలు వచ్చి చేరాయి. ఏదైనా పదానికి అర్థం కావాలంటే డిక్షనరీ సాయంతో సరైన పదాన్ని వెతుకుతాం. 2023లో ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీకి 650 కొత్త ఆంగ్ల పదాలు జోడించారు. యాస పదాల నుండి వృత్తిపరమైన శీర్షికలు, క్రీడా విన్యాసాల వరకు, మన చుట్టూ ఉన్న ప్రపంచం అభివృద్ధి చెందుతున్నప్పుడు, దానిని వివరించే మార్గాలు, దానిలోని అనుభవాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీని వెనుక చాలా మంది కృషి దాగి ఉంటుంది.
ఓ కొత్త పదం వెలుగులోకి వచ్చిందంటే దాని వెనుక ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఎందరో ఉంటారు. వీరు ప్రపంచంలో పర్యటిస్తూ, రిమోట్‌గా పనిచేస్తారు. వీరి ద్వారానే చాలా పదాలు వెలుగుచూస్తూ ఉంటాయి. ఈ విధంగానే ఇంగ్లీషులో అనేక కొత్త పదాలు ఇతర భాషల నుండి ప్రేరణ పొందాయనడంలో ఆశ్చర్యం లేదు.
సంవత్సరంలో కొత్త పదాలు
ఆంగ్ల పదాల కోసం వార్షిక పోటీ జరుగుతుంది? జనాదరణ, సాంస్కృతిక ప్రాముఖ్యత, పదం కోసం శోధనల సంఖ్య వంటి అంశాల ఆధారంగా నిఘంటువులు ఆ సంవత్సరపు పదాన్ని ప్రకటిస్తాయి. డిక్షనరీని బట్టి సంవత్సరం పదం మారుతుంది. 2023లో, అత్యంత జనాదరణ పొందిన రెండు పదాలు ఇవే..
ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు: గోబ్లిన్ మోడ్
గోబ్లిన్ అనేది యూరోపియన్ జానపద కథల నుండి వచ్చిన కల్పిత జీవి, ఇది కొంటెగా, గజిబిజిగా ఉంటుంది. కాబట్టి సోమరితనం, స్వయం తృప్తి కలిగిన వ్యక్తిని గురించి చెప్పాల్సి వస్తే 'గోబ్లిన్ మోడ్' అని చెబుతారు. మొట్టమొదట 2019లో యాస పదం ఎక్కువగా ఉపయోగించారు, అయితే కరోనా లాక్‌డౌన్ సమయంలో చాలా కాలం పాటు ఇంటి లోపల ఉండి, గోబ్లిన్ లాగా ఉండడాన్ని బట్టి గ్లోబిన్ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఉదాహరణకు: I'm in goblin mode, so I can't come to meet you.
కేంబ్రిడ్జ్ నిఘంటువు: హోమర్
'హోమర్' అనేది 'హోమ్ రన్'కి సంక్షిప్తంగా ఉంటుంది, అంటే ఒక ఆటగాడు బేస్ బాల్‌లో బంతిని కొట్టడం, ఆ బంతిని తిరిగి తీసుకునే ముందు అన్ని బేస్‌ల చుట్టూ పరిగెత్తడం, పాయింట్ స్కోర్ చేయడం. 2023లో కేంబ్రిడ్జ్ డిక్షనరీలో అత్యధికంగా శోధించబడిన పదాలలో 'హోమర్' ఒకటి, ఇది Wordle గేమ్‌లో గెలిచిన పదం. ఒక్క రోజులోనే ‘హోమర్’ పదాన్ని 65,000 సార్లు సెర్చ్ చేసారట.