Viral: ప్రసవించిన మగ గోరిల్లా.. జూ అధికారులు షాక్.. ఆ తరువాత..
ABN , First Publish Date - 2023-07-23T19:26:01+05:30 IST
మగ గోరిల్లా ప్రసవించిందని భావించిన ఓ అమెరికా జూ అధికారులు ఆశ్చర్యపోయారు. కాస్తంత జాగ్రత్తగా పరిశీలించడంతో అతడి ఆడ గోరిల్లా అని తెలుసుకుని స్థిమితపడ్డారు. ఇంతకాలం తాము మగ గోరిల్లాగా భావిస్తున్నది వాస్తవానికి ఆడ గోరిల్లా అని తాజా ప్రకటించారు. ఏడెనిమిదేళ్లు వచ్చే వరకూ ఆడ, మగ గోరిల్లాలు చూడటానికి ఒకేలా ఉంటాయని చెప్పుకొచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: హఠాత్తుగా ఓ రోజు ఆ జూలోని మగ గోరిల్లా చేతిలో ఓ పిల్ల గోరిల్లా కనిపించింది. దీంతో, అక్కడి సిబ్బంది ఒకింత షాకయ్యారు. ఆ తరువాత.. మగ గోరిల్లానే పిల్ల గోరిల్లాను కనిందని తెలిసి మరింత షాకైపోయారు('Male' Gorilla gives birth). మరి ఇది ప్రకృతి విరుద్ధం కదా? అందుకే కాస్తంత సంభాళించుకుని జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు విషయం బోధపడింది. అమెరికాలోని ఓహాయో(Ohio) రాష్ట్రంలోగల కొలంబస్ జూ అండ్ ఎక్వేరియంలో(Columbus Zoo and Aquarium) ఈ ఘటన వెలుగు చూసింది.
ఆడ గోరిల్లాను మగదానిగా భావించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అసలు ఆడ గోరిల్లాను మగదని వారు ఎలా భ్రమపడ్డారు? నిత్యం జంతువుల బాగోగులు చూసుకునే సిబ్బంది పొరబడటమేమిటీ అని ఆశ్చర్యపోతున్నారు కదూ? ఈ ప్రశ్నలకు కూడా అధికారులే సమాధానం చెప్పారు. వాస్తవానికి ఏడెనిమిది ఏళ్లు వచ్చే వరకూ మగ, ఆడ గోరిల్లాలు ఒకేలా ఉంటాయట. వాటి ఆకారం దాదాపుగా ఒకేలా ఉంటుందట. ఇక లైంగిక అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందవని, దీంతో మగ, ఆడ గోరిల్లాను కచ్చితంగా గుర్తించడం కష్టమని వివరించారు. అవి బాగా పెద్దవయ్యాకే ఆడ జంతువు ఏదో మగ జంతువు ఏదో స్పష్టంగా చెప్పగలమని తెలిపారు.
అయితే, జూలో ఓ చిట్టి గోరిల్లా ఎంట్రీ చాలా కీలక పరిణామమని జూ అధికారులు చెప్పారు. అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న జాతుల్లో గొరిల్లా కూడా ఒకటని, వాటి నివాస ప్రాంతాలు నానాటికీ తరిగిపోతున్నాయని వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓ బుజ్జి గోరిల్లా జన్మించడం ఆ జాతి మనుగడకు ఎంతో కీలకమని తెలిపారు.