Viral: కాఫీ తాగుతుండగా మహిళపై పడ్డ ఉల్క..! ఆ తరువాత..
ABN , First Publish Date - 2023-07-16T20:39:59+05:30 IST
స్నేహితురాలితో కలిసి కాఫీతాగుతున్న మహిళపై ఓ ఉల్క పడింది. ఫ్రాన్స్‌లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆకాశంలో అప్పుడప్పుడూ ఉల్కలు రాలి పడుతుంటాయి. సాధారణంగా అవి గాల్లోనే మండిపోయి అంతర్థానమవుతాయి. అవి నేలను తాకడమే బహు అరుదు. కానీ ఏకంగా ఓ మహిళపై ఉల్క పడటం ప్రస్తుతం సంచలనంగా మారింది(Meteorite hits french woman on terrace ). అదీ ఆమె టెర్రెస్‌పై తన స్నేహితురాలితో కలిసి కాఫీ తాగుతుండగా పడింది.
ఫ్రాన్స్‌లోని ఆల్సేస్ ప్రాంతంలో జూలై 6న ఈ ఘటన జరిగింది. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె స్థానిక మీడియాకు వివరించింది. ‘‘నేను అప్పుడు నా ఫ్రెండ్‌తో కలిసి టెర్రస్‌పై కూర్చుని కాఫీ తాగుతున్నా. ఇంతలో ‘జూమ్’ అన్న శబ్దం ఏదో వినిపించింది. ఆ మరుక్షణమే నాకు ఛాతిలో విద్యుదాఘాతం తగిలినట్టు అనిపించింది. నన్ను గబ్బిలమో మరొకటో ఢీకొట్టి ఉంటుందని మొదట అనుకున్నా. కాస్త తెరిపారా చూస్తే నేలపై చిన్న రాయిలా ఒకటి కనిపించింది. అదేదో సిమెంట్ రాయిలా కనిపించినా ఆ రంగులో మాత్రం లేదు’’ అని చెప్పుకొచ్చింది. తొలుత అది టెర్రస్ ఫ్లోర్‌పై పల్టీ కొట్టి తన ఛాతికి తగిలిందని వివరించింది.
మహిళ ఆ రాయిని సమీపంలోని జియాలజిస్టుకు చూపించగా అది ఉల్కేనని ఆయన తేల్చి చెప్పారు. ఫ్రాన్స్ లాంటి ప్రాంతాల్లో ఉల్కలు దొరకడం చాలా అరుదని, ఇక ఓ మనిషిపై అవి పడటం అత్యంత అరుదైన విషయమని చెప్పుకొచ్చారు. కొన్ని భూమ్మీద పడ్డ అక్కడి వాతావరణం కారణంగా అవి నేలలో త్వరితంగా కలిసిపోతాయని వివరించారు.
కాగా, మనుషులపై ఉల్కలు రాలడం చాలా అరుదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 21వ శతాబ్దంలో కేవలం అయిదు సార్లు మాత్రమే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 1954ల్లో తొలిసారిగా అలబామా రాష్ట్రానికి(అమెరికా) చెందిన ఓ మహిళపై ఉల్క పడింది. ఇంటి టాపును ఛిద్రం చేస్తూ ఆ ఉల్క మహిళపై పడింది. దీంతో, మహిళకు ఓమోస్తరు గాయాలయ్యాయి. కొన్ని చోట్ల శరీరం కమిలిపోయింది.