Viral: అందాల పోటీలో గెలిచిన యువతి..సినిమాల్లో ట్రై చేసే బదులు లారీలు నడుపుకుంటూ..అసలేం జరిగిందో తెలిస్తే..
ABN , Publish Date - Dec 26 , 2023 | 05:04 PM
అందాల పోటీల్లో గెలిచిన యువతి..సినిమాల్లో ట్రై చేసే బదులు లారీలు నడుపుకుంటూ..అసలేం జరిగిందో తెలిస్తే..
ఇంటర్నెట్ డెస్క్: కాస్తోకూస్తో అందం ఉన్న వాళ్లెవరైనా సినిమాల్లో ట్రై చేయాలనుకుంటారు. కానీ అందాల పోటీల్లో మెరిసిన ఓ యువతి, మోడలింగ్‌లో రాణిస్తూ కూడా వాటన్నిటినీ కాదనుకుని లారీ డ్రైవర్‌గా మారింది. అంతేకాదు.. తన లాగా ఇతర యువతులు కూడా ఈ రంగంలో నిలదొక్కుకోవాలని పిలుపునిస్తోంది. ఎవరీ యువతి అంటారా? ఈమె పేరు మిల్లీ ఎవరాట్ (Milly Everatt). ఉండేది ఇంగ్లండ్‌లో..!
మంచి రూపం ఉన్న ఎవరాట్ తొలుత ఇతర యువతుల్లాగే అందాల పోటీల వైపు మళ్లింది. 2017 నుంచి ఈ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించిన ఆమె మరుసటి ఏడాదే మిస్ లింకన్‌షైర్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత, మిస్ ఇంగ్లండ్ పోటీలో ఆరో స్థానం దక్కించుకుంది (Miss England Finalist). బ్రిటన్‌లోనే అతిపెద్ద అందాల పోటీ ఇది. అయితే, మిస్ ఇంగ్లండ్ పోటీల్లో మంచి గుర్తింపు తరువాత ఆమె సహజంగానే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అక్కడా ఆమె మంచి విజయం సొంతం చేసుకుంది. కానీ ఆ తరువాతే ఎవరాట్ జీవితం ఊహించని మలుపు తిరిగింది.
చిన్నప్పటి నుంచీ తండ్రి వ్యాపార కార్యకలాపాలు చూస్తూ పెరిగిన ఎవరాట్ చివరకు లారీ డ్రైవర్ (Lorry Driver) వృత్తిని ఎంచుకుంది. 23 ఏళ్ల వయసులోనే ఆమె క్లాస్-1, క్లాస్-2 హెవీ రవాణా వాహనాల లైసెన్సు కూడా సాధించింది. 44 టన్నుల లారీలను కూడా సునాయసంగా నడిపించగల నైపుణ్యం ఇప్పుడామె సొంతం. అయితే, కొవిడ్ సమయంలో దేశంలో డ్రైవర్ల కొరత ఉన్నట్టు వార్తా కథనాల్లో తెలుసుకున్న ఆమె గతేడాదే ఈ లైసెన్సులకు దరఖాస్తు చేసుకుని కొత్త రంగంలో కాలుపెట్టింది.
‘‘పురుషాధిపత్యం ఉన్న ఈ రంగంలో ఓ మహిళగా ఏదో నిరూపించుకోవాలని నాకు లేదు. అయితే, ఈ రంగంలో మహిళలకూ అవకాశం ఉందని నన్ను చూసి ఎవరైనా అనుకుంటే నాకు సంతోషమే. ఇది మా నాన్న వ్యాపారం కాబట్టి నా పని తేలిక అని చాలా మంది అనుకుంటారు కానీ సొంత వ్యాపారంలోనే ఒక్కోసారి అందరికంటే ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. ఈ పనిలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. డ్రైవ్ చేసుకుంటూ దేశమంతా పర్యటించడం, మంచి జీతం, అన్నిటికీ మించిన స్వేచ్ఛ నాకు బాగా నచ్చాయి’’ అని ఆమె చెప్పుకొచ్చింది.