అమ్మాయిలు ఫోన్‌ను వాడటంపై నిషేధం.. ఎన్నెన్నో ఘోరాలు జరిగిపోతున్నాయంటూ ఓ ఎమ్మెల్యే సాక్షిగా తీర్మానం..!
ABN , First Publish Date - 2023-02-21T12:46:29+05:30 IST
మహిళా లోకం కోపానికి కారణమవుతున్న ఈ అంశం
ఇప్పటి కాలంలో మొబైల్ చిన్న పిల్లల చేతుల్లో కూడా ఉంటోంది. అయితే అమ్మాయిలు మొబైల్ వాడటం వల్ల ఘోరాలు జరిగిపోతున్నాయని అంటున్నారు. అందుకే అమ్మాయిలు మొబైల్ వాడటం పై నిషేధం విధిస్తున్నామని ఓ ఎమ్మెల్యే సాక్షిగా తీర్మానించారు. మహిళా లోకం కోపానికి కారణమవుతున్న ఈ అంశం గురించి పూర్తిగా తెలుసుకుంటే...
గుజరాత్ లో ఠాకూర్ కమ్యూనిటీ ఒక సబ్ క్యాస్ట్ గా ఉంది. ఈ వర్గం వారి జీవితంలో మెరుగుదల కోసం అనేక విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో భాగంగా అమ్మాయిలు మొబైల్ వాడకూడదనే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల అక్కడి అమ్మాయిలు చాలా కోపంగా ఉన్నారు. అమ్మాయిలు నేటి సమాజంలో లింగ అసమానతలను తొలగించుకుంటూ ఇప్పుడిప్పుడే స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు. అలాంటిది ఠాకూర్ కమ్యూనిటీ ఇలాంటి ఉత్తర్వులు జారిచేయడంతో మహిళలు మండిపడుతున్నారు.
అక్కడి ఠాకూర్ కమ్యూనిటీ మాత్రం అమ్మాయిలు మొబైల్ ఫోన్ వాడటం వల్ల అబ్బాయిలతో పరిచయాలు పెరగడం, కులాంతర వివాహాలు చేసుకోవడం, ప్రేమ సంబంధాలు ఏర్పడటం మొదలైనవి జరుగుతున్నాయని, ముఖ్యంగా మైనర్ బాలికలు వీటికి బలి అయిపోతున్నారని చెప్పారు. వీటిని నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
కేవలం అమ్మాయిల విషయంలోనే కాకుండా ఇతర విషయాలలో కూడా వీరు కొన్ని నిర్ణయాలు చెప్పారు. ఎక్కడైనా పెళ్లి లేదా నిశ్చితార్థం జరిగితే దానికి కేవలం 11 మంది మాత్రమే హాజరు కావాలని నిర్ణయించారు. దీని వల్ల కుటుంబాలకు పెళ్లి ఖర్చు తగ్గుతుందని చెప్పుకొచ్చారు. అలాగే పెళ్లిళ్లలో డీజే సౌండ్ సిస్టం పెట్టకూడదని నిబంధనలు పెట్టారు. ఇవి మాత్రమే కాకుండా తమ కమ్యూనిటీ వారు ఏ గ్రామంలో అయినా ఎక్కువ ఉండి, వారిలో పెళ్లి కావాల్సిన యువత ఉంటే వారికి సామూహిక వివాహాలు జరిపించాలన్నారు. పెళ్లి అయినం తరువాత ఎవరైనా విడిపోవాలని చూస్తే ఆ కుటుంబానికి జరిమానా విధిస్తామని చెప్పారు. వీటి ద్వారా వచ్చే డబ్బుతో పేద విద్యార్థులకు చదువు చెప్పించడం, ఆడపిల్లలు చదువు కోసం నగరాలకు వెళ్లాల్సి వస్తే వారి ప్రయాణ సౌకర్యం కోసం ఉపయోగిస్తామని అన్నారు.
వీరు తీసుకున్న నిర్ణయాలు కాస్త కఠినంగానే ఉన్నా అవి సమాజ హితమైనవేనని కొందరు అంటున్నారు. కానీ అమ్మాయిలు మొబైల్ ఫోన్ వాడరాదనే నిర్ణయం మాత్రం మహిళల ఆగ్రహానికి గురవుతోంది.