సడన్‌గా ఇంట్లోంచి అదృశ్యమైపోయిన తల్లి.. వేరే దేశంలో జైల్లో బంధీగా.. నాలుగేళ్ల తర్వాత అసలు నిజం ఆ కొడుక్కు తెలిసి..

ABN , First Publish Date - 2023-01-20T12:27:49+05:30 IST

ఇల్లంతా వెతికాడు, ఊరంతా వెతికాడు, మిస్సింగ్ కేసు నమోదు చేసాడు. ఎక్కడా ఆమె గురించి వివరాలు తెలియలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి

సడన్‌గా ఇంట్లోంచి అదృశ్యమైపోయిన తల్లి.. వేరే దేశంలో జైల్లో బంధీగా.. నాలుగేళ్ల తర్వాత అసలు నిజం ఆ కొడుక్కు తెలిసి..

'అమ్మా అన్నం పెట్టు' అని పిలిచాడు ఆ కుర్రాడు. తల్లి పలకలేదు. లోపల పనిలో ఉందనుకున్నాడు కానీ ఎంతకూ ఎలాంటి అలికిడీ లేదు. ఇల్లంతా వెతికాడు, ఊరంతా వెతికాడు, మిస్సింగ్ కేసు నమోదు చేసాడు. ఎక్కడా ఆమె గురించి వివరాలు తెలియలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి ఇక తల్లి గురించి ఆశ వదిలేసుకున్నాడు. కానీ ఊహించని విధంగా, ఊహించని చోట తల్లిని కలుసుకున్నాడు అతడు. తల్లీకొడుకుల మధ్య ప్రేమను చాటిచెప్పే ఈ సంఘటనకు సంబందించి వివరాల్లోకి వెళితే..

నేపాల్ కు చెందిన ఫిరోజ్ లాహిరి అనే 26 సంవత్సరాల వ్యక్తి తల్లి 2018 సంవత్సరంలో కనిపించకుండా పోయింది. ఉన్నట్టుండి అదృశ్యమైన తల్లి కోసం వెతకని చోటంటూ లేదు. చివరికి తల్లి ఆచూకీ ఏమాత్రం దొరక్కపోయేసరికి ఆమె మీద ఆశ వదిలేసుకున్నాడు ఫిరోజ్. అయితే తాజాగా అతనికి ఎవరో ఫోన్ చేసి 'మీ అమ్మ అస్సాం జైలులో ఉంది' అని చెప్పారు. నేపాల్ దేశానికి చెందిన ఆమె అస్సాం జైలులో ఉండటమేంటని అనిపించినా వెంటనే రాయబారులతో మాట్లాడి పరిస్థితి వివరించి ఆమెను బయటకు తీసుకురావడానికి సహాయం చేయమని కోరాడు. ఈ క్రమంలో వారు భారత రాయబారులతో చర్చలు జరిపారు.

ఫిరోజ్ తల్లి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిందనే కారణంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆమెకు రెండు సంవత్సరాలు శిక్ష విధించగా అది 2020 సంవత్సరానికి పూర్తయిపోయింది. అప్పటినుండి ఆమెను ట్రాన్సిట్ క్యాంప్ లో ఉంచినట్టు వారు తెలిపారు. ఫిరోజ్ కు చిన్నతనంలోనే తండ్రి చనిపోగా తల్లి కుటుంబాన్ని పోషించింది. ఒకరోజు ప్రమాదవశాత్తు ఆమె తలకు గాయమైంది. అప్పటి నుండి ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని ఫిరోజ్ తెలిపాడు. ఆ కారణం వల్లే ఆమె దేశ సరిహద్దు దాటి వెళ్ళి ఉంటుందని అతను చెప్పాడు. ప్రస్తుతం ఫిరోజ్ తల్లి ఆరోగ్యంగానే ఉందట.

'మా అమ్మతో నేరుగా మాట్లాడాను, ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగా కనిపించింది. ఆమెను మాతో తీసుకెళ్ళిపోవచ్చని అధికారులు కూడా తెలిపారు' అని ఫిరోజ్ చాలా సంతోషం వ్యక్తం చేసాడు. ఇంతగా ప్రేమించే కొడుకు దొరకడం ఆమె అదృష్టమని అంటున్నారు నెటిజన్లు.

Updated Date - 2023-01-20T12:28:03+05:30 IST