Netflix Rana Naidu: ‘రానా నాయుడు’ తెలుగు వెర్షన్‌ను లేపేసిన నెట్‌ఫ్లిక్స్.. చూడాలంటే ఇప్పుడెలా అంటే..
ABN , First Publish Date - 2023-03-30T13:36:05+05:30 IST
విక్టరీ వెంకటేష్ (Hero Venkatesh), దగ్గుబాటి రానా (Daggubati Rana) ప్రధాన పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్ (Rana Naidu Web Series) తెలుగు వెర్షన్‌పై..
విక్టరీ వెంకటేష్ (Hero Venkatesh), దగ్గుబాటి రానా (Daggubati Rana) ప్రధాన పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్ (Rana Naidu Web Series) తెలుగు వెర్షన్‌పై (Rana Naidu Telugu) ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ (Netflix Rana Naidu) కీలక నిర్ణయం తీసుకుంది. ‘రానా నాయుడు’ తెలుగు వెర్షన్‌ను (Rana Naidu Telugu Version) తమ ఓటీటీ నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix Removes Rana Naidu) తొలగించింది. ఈ నిర్ణయం ‘రానా నాయుడు’ టీంను షాక్‌కు గురిచేసింది. తెలుగు వెర్షన్‌లో శ్రుతిమించిన బూతులున్నాయంటూ ‘రానా నాయుడు’ కంటెంట్‌పై ఈ వెబ్ సిరీస్ విడుదలైన మొదటి రోజు నుంచే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ‘రానా నాయుడు’ చూడాలనుకునేవారికి ‘హిందీ’ వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్ అందుబాటులో ఉంచింది.
సినీ దర్శకులకు స్వేచ్ఛనిచ్చింది సృజనాత్మకంగా సినిమాలు తెరకెక్కించడం కోసమే కానీ అశ్లీలాన్ని వ్యాపింపచేయడం కోసం కాదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (I&B Minister Anurag Thakur) ట్వీట్ చేసి, వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే నెట్‌ఫ్లిక్స్ నుంచి ‘రానా నాయుడు’ తెలుగు వెర్షన్‌ను తొలగించడం ప్రేక్షకులు గమనించాల్సిన విషయం. ఓటీటీల్లో బూతు కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేయడం, చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో నెట్‌ఫ్లిక్స్ ముందుగానే మేల్కొని ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్‌ను తొలగించి ఉండొచ్చని ఈ పరిణామాలు గమనించిన వారు అభిప్రాయపడుతున్నారు.
హీరో వెంకటేష్ పేరు వినగానే.. ‘సూర్య వంశం’, ‘సంక్రాంతి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి కుటుంబ కథాచిత్రాలు.. ‘రాజా’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి హాస్యభరిత చిత్రాలే గుర్తొస్తాయి. తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్‌కు అంతగా దగ్గరైన వెంకటేష్ నోటి నుంచి ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో బూతులు వినాల్సి రావడాన్ని కాదుకాదు అశ్లీలం నిండిన బండబూతులు వినాల్సి రావడాన్ని మెజార్టీ వెంకీ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. డబ్బుల కోసం ఇంతకు దిగజారాలా అని వెంకటేష్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విరుచుకుపడ్డారు.
‘రానా నాయుడు’ కంటెంట్‌లో వాడిన బూతులపై కొందరు సినీ ప్రముఖులు కూడా బాహాటంగానే పెదవి విరిచారు. హిందీ వెబ్ సిరీస్‌గా తెరకెక్కించిన ‘రానా నాయుడు’ను తెలుగులో డబ్బింగ్ చెప్పి నెట్‌ఫ్లిక్స్ వేదికగానే విడుదల చేశారు. ‘రానా నాయుడు’ తెలుగు వెర్షన్‌ను చూసినవాళ్లలో ఎక్కువ మంది ‘ఏం మాట్లాడుతున్నావ్ రా.. నరాలు కట్ అయిపోయాయి’ లాంటి పోసాని రియాక్షన్‌ను వ్యక్తం చేయడంతో ‘రానా నాయుడు’ తెలుగు వెర్షన్‌పై నెట్టింట విపరీతమైన నెగిటివిటీ కనిపించింది. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో ఒక పోస్టర్ గురించి వెంకీ పిల్లాడితో మాట్లాడే మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వెబ్ సిరీస్‌లో ఏ రేంజ్‌లో అశ్లీలం, బూతులు ఉన్నాయో ఆ ఒక్క సీన్ చూసిన వారికి ఇట్టే తెలిసిపోయింది.
‘రానా నాయుడు’ రివ్యూ కోసం క్లిక్ చేయండి..
మొత్తంగా చూసుకుంటే.. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌ను నెటిఫ్లిక్స్ తొలగించడం.. ఓటీటీలో ఎంత బూతు కంటెంట్‌ను అయినా విడుదల చేయొచ్చని భావించే కొందరు దర్శకులకు చెంపపెట్టు లాంటి పరిణామం అని చెప్పక తప్పదు.