Jandhyala Birth Anniversary: కాలేజ్‌కు అందరూ సైకిళ్లపై వెళితే జంధ్యాల మాత్రం..

ABN , First Publish Date - 2023-01-14T19:40:19+05:30 IST

జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి క్లుప్తంగా చేస్తే జంధ్యాల. మొదటి పొడుగాటి పేరు బారసాలనాడు బియ్యంలో..

Jandhyala Birth Anniversary: కాలేజ్‌కు అందరూ సైకిళ్లపై వెళితే జంధ్యాల మాత్రం..

(జనవరి 14 జంధ్యాల జయంతి)

జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి క్లుప్తంగా చేస్తే జంధ్యాల.

మొదటి పొడుగాటి పేరు బారసాలనాడు బియ్యంలో రాసి పెట్టింది. రెండోది, కాస్త పొట్టిపేరు, స్కూలు, కాలేజీ రికార్డుల్లో రాసుకున్నది. ముచ్చటగా మూడోది ‘జంధ్యాల’ అనే ‘కలం పేరు’ చిరస్థాయిగా వెండి తెరపై స్థిరపడిపోయిన పేరు. తెలుగు హాస్యానికే వన్నె తెచ్చిన పేరు. అందుకే, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకుని అలా వుండిపోయింది.

ఈ భూమ్మీద పడ్డ ప్రతి బిడ్డా ఏడుస్తూనే కళ్ళు తెరుస్తుంది. 1951లో నరసాపురంలో జంధ్యాల పుట్టినప్పుడు బొడ్డు కోసిన మంత్రసాని జాగ్రత్తగా గమనించి వుంటే, ఏడుస్తున్న ఆ పిల్లాడి పెదవుల నడుమ సన్నటి నవ్వుతెర కనిపించి వుండేదేమో.

జంధ్యాల నాన్నగారు జంధ్యాల నారాయణమూర్తి బెజవాడలో పేరుమోసిన వ్యాపారి. అనేక జిల్లాలకు బుష్ రేడియో డీలరు. ఆ రోజుల్లో రేడియోలకి మంచి గిరాకి. అంచేత నారాయణ మూర్తిగారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోయింది. పుటకల నాటికే జంధ్యాల బంగారు పిచిక. బీసెంటు రోడ్డులో ఏడంతస్తుల భవనం.

(ఏడంటే ఏడు అనికాదు, పెద్ద భవనం అని కవి హృదయం. నిజంగానే చాలా పెద్ద ఇల్లు. ఎదురుగా వున్న మోడరన్ కేఫ్ కంటే ఎత్తుగా వుండాలని నారాయణమూర్తిగారు ముచ్చట పడి కట్టించుకున్నారని ఆ రోజులనాటి ముచ్చట) అది కట్టుకున్నాక వాళ్ళ నివాసం, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి దగ్గర నుంచి బీసెంటు రోడ్డుకి మారింది.

మాచవరం ఎస్సారార్ కాలేజీలో మేము, అంటే జంధ్యాల, నేను ఒకే బెంచిలో కూర్చుని బీకాం చదువుతున్నట్టు నటిస్తున్నరోజుల్లో, కాలేజీ ప్రిన్సిపాల్ తో సహా అయ్యవార్లందరూ సైకిళ్ళమీద కాలేజీకి వస్తుండేవారు. మన జేవీడీఎస్ శాస్త్రి మాత్రం, అంబాసిడర్ కారులో వెనక సీట్లో కూర్చుని దర్జాగా వచ్చేవాడు. డ్రైవరు డోరు తెరిచి నిలబడితే కారు దిగి కాలేజీలో కాలు పెట్టే జంధ్యాలకు ‘కారున్న కుర్రకారు’ అని పేరు పెట్టింది కూడా నేనే.

చదువులోనే కాకుండా శాస్త్రి, ఇతర విషయాల్లో కూడా ముందుండేవాడు. కాలేజీ కల్చరల్ అసోసియేషన్ కు ఆయనే మకుటంలేని కార్యదర్శి. కవితలు, గేయాలు గిలికే అలవాటున్న నాకు కూడా ఆ మకుటంమీద కన్నుపడింది. వెనకాముందూ చూసుకోకుండా ఏకంగా ఆయనపైనే పోటీ చేశాను. అయితే ఆయన మకుటం గట్టిది, నేను కొట్టిన దెబ్బ ఓటిది అని ఇట్టే తేలిపోయింది. ఓడిపోతే పోయాను కానీ, ఆయనతో నా స్నేహం గట్టిపడింది. ఆయన మిత్ర బృందంలో నాకూ స్థానం దొరికింది. ఇక ఆ మూడేళ్ళూ కలిసే తిరిగాము చదువయినా, సంధ్యయినా!

తెలుగు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన నాగయ్య ఒక తరానికి తెలుసు. నాగేశ్వరరావు మరో తరానికి తెలుసు. నాగార్జున ఇంకో తరానికి తెలుసు. ఒక తరానికి తెలిసిన వాళ్ళు మరో తరానికి అట్టే తెలియకపోవడంలో విడ్డూరం ఏమీ లేదు. అన్ని తరాలను నవ్వుల్తో రంజింప చేసిన జంధ్యాల నిజంగా అమరుడు.

Bandaru-Srinivas.jpg

భండారు శ్రీనివాసరావు

సీనియర్ పాత్రికేయులు

Updated Date - 2023-01-14T19:40:52+05:30 IST