SS Rajamouli: ‘దేవుడ్ని కలిశాను’.. పర్వతం ఆకాశాన్ని చేరిందంటూ..
ABN , First Publish Date - 2023-01-14T11:39:54+05:30 IST
ఎంత పెద్ద స్టార్స్ అయినా, వారికి ఎంతమంది అభిమానులు ఉన్నా.. వారికి కూడా కచ్చితంగా ఎవరో ఒకరు ఫేవరెట్ ఉంటారు. వారిని కలిసినప్పుడు ఈ స్టార్స్ కూడా చాలా ఎగ్జాయిట్ అవుతూ ఉంటారు.
ఎంత పెద్ద స్టార్స్ అయినా, వారికి ఎంతమంది అభిమానులు ఉన్నా.. వారికి కూడా కచ్చితంగా ఎవరో ఒకరు ఫేవరెట్ ఉంటారు. వారిని కలిసినప్పుడు ఈ స్టార్స్ కూడా చాలా ఎగ్జాయిట్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) అలాంటి ఫ్యాన్ మూమెంట్‌నే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా దర్శకుడు తాజాగా పాన్ వరల్డ్ దర్శకుడు స్టీవెన్ స్పిల్‌బర్గ్ (Steven Spielberg)ని కలిశారు.
ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల (Golden Globe) ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా జక్కన్న, కీరవాణి (Keeravani), రామచరణ్, ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తాజాగా కీరవాణి, రాజమౌళి కలిసి ‘ఇండియానా జోన్స్’, ‘జురాసిక్ పార్క్’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన స్పీల్ బర్గ్‌ని కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి ఆయనతో కాసేపు ముచ్చటించారు. తన అభిమాన దర్శకుడిని కలిసినందుకు రాజమౌళి చాలా ఎగ్జయిట్ అయ్యారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదిక చెబుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
స్పీల్‌బర్గ్‌తో ఉన్న ఫోటోని ట్విట్టర్‌లో రాజమౌళి షేర్ చేశారు. ఆ పోస్ట్‌కి ‘ఇప్పుడే దేవుడ్ని కలిశా’ అని రాసుకొచ్చారు. అందులో ఓ పిక్‌లో స్పిల్‌బర్గ్‌ని చూసిన ఆనందంలో రాజమౌళి తన రెండు చేతులను చెంపలకి పెట్టుకుని ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే ఆయన ఎంత సంతోషంగా ఉన్నారో అర్థమవుతోంది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు ఈ పోస్ట్‌పై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘కష్టపడి పని చేస్తే కలలు నిజమౌతాయని నిరూపించారు సర్’ అని సిద్ధార్థ్ మల్హోత్రా రాసుకొచ్చారు. అలాగే ‘ముగ్గురు దేవుళ్లు ఓ చోట కలిశారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఓ పర్వతం ఆకాశాన్ని తాకితే ఇలాగే ఉంటుంది’ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
కీరవాణి సైతం స్పిల్‌బర్గ్‌ని కలవడం గురించి ఓ ట్వీట్ చేశారు. అందులో.. ‘ఆయన నాటు నాటు పాట నచ్చిందని చెప్పడం.. నమ్మలేకపోయా’ అని ఓ ట్వీట్‌లో రాసుకొచ్చారు. అలాగే ‘సినిమాల దేవుడ్ని కలిసే అవకాశం రావడం, ఆయన సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పడం అదృష్టంగా భావిస్తున్నా’ అని మరో ట్వీట్‌లో రాసుకొచ్చారు.