Gold Jewellery: అసలు బంగారం నుంచి చిలకలపూడి బంగారం వరకూ..!
ABN , First Publish Date - 2023-03-24T15:19:18+05:30 IST
రంగుల ప్రపంచమైన సినీ ప్రపంచంలో నగల విషయానికి వస్తే,
గుణశేఖర్ దర్శకుడిగా నిర్మిస్తున్న.. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నటించిన నటీనటుల కాస్ట్యూమ్స్, ఆభరణాల విషయంలో చిత్ర బృందం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ సినిమా కోసం నిజమైన బంగారు ఆభరణాలు, వజ్రాలూ వాడారనే వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ నగల విలువ సుమారు రూ.14 కోట్లు. ప్రముఖ డిజైనర్ నీతూ లుల్లా ఆధ్వర్యంలో ఏడు నెలలు శ్రమించి ఆ ఆభరణాలు తయారు చేశారట. ఇందుకోసం 15 కేజీల బంగారాన్ని వాడారు. దాంతో సమంతకు 14 రకాల ఆభరణాలు తయారు చేశారు. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు.. ఒకప్పుడు పాత తెలుగు సినిమాల్లో కొనసాగిందే..
నగలంటే ఇష్టపడని ఆడవారుంటారా? నగలు ఆడవారి గౌరవాన్ని, ఆర్థిక స్థితిని పెంచుతాయనేది అంతా నమ్ముతారు. అయితే ఈ నగలు కొత్త డిజైన్స్, కొత్త కలక్షన్ అంటూ కొత్త వెరైటీలు పుట్టుకొస్తునే ఉంటాయి. 'ఫలానా హీరోయిన్ ఈ నగలు వేసుకుందంటే', 'ఆ సీరియల్ నటి ఈ జూకాలు తగిలించిందని' వాటిని ఆర్డర్స్ ఇచ్చి మరీ చేయించుకునేవారూ ఉన్నారు. అయితే ఇది బయటి ప్రపంచపు ఆడవారి తీరు. మరి రంగుల ప్రపంచమైన సినీ ప్రపంచంలో నగల విషయానికి వస్తే, ఒకప్పుడు నటించానికి తమ సొంత నగలనే సెట్స్‌కి తెచ్చుకుని వాటినే ధరించేవారట హీరోయిన్స్. అందులోనూ ప్రముఖంగా సావిత్రి, భానుమతి, జమున, వాణిశ్రీ లాంటి అగ్ర తారలంతా సినిమాల్లో తమ సొంత నగలనే వేసుకునేవారట.
అంతే కాదు వాణిశ్రీ అప్పట్లో ఆమె ఏ నగలు వేసుకుంటే మార్కెట్ లోకి ఆ నగలు ఆమె పేరుతో వచ్చేసేవి. జనాలు పిచ్చిగా ఆమె కట్టిన చీర, నగల సెట్స్ కొనుక్కుని వేసుకునేవారు. ఇక సావిత్రి అయితే బంగారమంటే ఆమెకున్న మోజుతో తెగ నగలు కొనేదట. తన బీరువా నిండా బంగారు గాజులైతే జడ రిబ్బన్‌కు దండలా గుర్చి, వేలాడదీసేదట. ఇక మన భానుమతి అయితే తన బంగారు నగలనే ధరించేది తన సినిమాల్లో. అలాగే జమున కూడా అదే రీతిలో తన నగలనే వేసుకునేది. తర్వాతి రోజుల్లో ఈ సాంప్రదాయం మారిపోయి చిలకలపూడి బంగారు నగలు వచ్చి చేరాయి. వాటి హవా నడిచింది. బంగారు నగలు వేయించి నటించే కాలం పోయాకా చిలకలపూడి గిల్ట్ నగలు ఆ స్థానాన్ని భర్తీ చేసాయి.
ఇది కూడా చదవండి: హీరోకి ఉన్న ఆ అలవాటు మాన్పించిన హీరోయిన్...
అయితే నిన్నటి మొన్నటి వరకూ అవే కొనసాగినా, ఇప్పుడు మాత్రం ఒన్ గ్రామ్ జ్యువెలరీ అని వాటినే ఎక్కువ వాడుతున్నారు. బాహుబలి, శ్రీరామరాజ్యం లాంటి సినిమాల్లో ఎక్కువగా ఇత్తడి, తదితర లోహాలు మాత్రమే వాడారు. అయితే ప్రముఖ జ్యువెలరీ షాప్స్ కూడా హీరోయిన్స్ తో ఫోటో షూట్స్ నిర్వహించడం కూడా ఇప్పటి కాలంలో ఎక్కువగా జరుగుతుంది. ఆ మధ్య వచ్చిన దేవదాస్ హిందీ సినిమాలో ఐశ్వర్యారాయ్, మాధురీ ధీక్షిత్ ఇద్దరూ పోటా పోటీగా భారీ నగల సెట్స్ వేసుకుని మరీ పాటలో డాన్స్ చేసారన్న వార్త హల్ ఛల్ చేసింది. అయితే నగలను భారీగా ధరించడం అనేది అనాది నుంచే వస్తుంది.
ఇక తెలుగు చిత్రసీమలో దర్శకుడిగా గుణశేఖర్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. సినిమాపై ఆయనకున్న శ్రద్ధ, ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సహజత్వం కోసం ఎక్కువ శ్రమిస్తుంటారు. అందుకోసం ఎంత ఖర్చైనా వెనుకంజ వేయరు. ‘శాకుంతలం’ కోసం కూడా అదే చేశారు. సమంత ప్రధాన పాత్రధారిగా రూపొందిన చిత్రమిది. గుణశేఖర్ దర్శకుడు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఙాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నటీనటుల కాస్ట్యూమ్స్, ఆభరణాల విషయంలో చిత్ర బృందం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంది. ఈ సినిమా కోసం నిజమైన బంగారు ఆభరణాలు, వజ్రాలూ వాడారు. వాటి విలువ సుమారు రూ.14 కోట్లు. ప్రముఖ డిజైనర్ నీతూ లుల్లా ఆధ్వర్యంలో ఏడు నెలలు శ్రమించి ఆ ఆభరణాలు తయారు చేశారు. ఇందుకోసం 15 కేజీల బంగారాన్ని వాడారు. దాంతో సమంతకు 14 రకాల ఆభరణాలు తయారు చేశారు. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు, దేవ్ మోహన్, గౌతమి ప్రధాన పాత్రలు పోషించారు.