Book Review: అడుగడుగునా ఆసక్తితో సాగే కథనం.. రామగ్రామ నుంచి రావణలంక దాకా..!
ABN , First Publish Date - 2023-02-16T10:34:04+05:30 IST
మనసులోని భావాన్ని అక్షరాలుగా చూసుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు..
ఎక్కడో పొలం తవ్వుతుండగా బంగారు నాణాలు బయటపడ్డాయని ఒక వార్త వస్తే దానిని ఆసక్తిగా చదివేస్తూ ఉంటాం. బంగారు విగ్రహాలు, కంచు, రాగి ఇత్తడి ఇలా చాలా అరుదైన సంపద భూమిలో ఉండటం గురించి, అందరికీ ఆసక్తే. కొన్నేళ్ళ క్రితం తిరువనంతపురం, అనంతపద్మనాభ స్వామికి చెందిన అనంత సంపద నేల మాళిగలో లభించిందని తెలిసి యావత్ ప్రపంచమే ఉలిక్కి పడింది.
ఒక రాజ్యం మరో రాజ్యం మీద దండెత్తి వస్తుందని తెలిసి ఈరాజు తన ఖజానాలోని ధనమంతా నేల మాళిగలో దాచి ఉంచేవాడు. కాలంతో పాటు చరిత్రలో కలిసిపోయిన నేల మాళిగ గుప్త నిధిగా ఎప్పుడో, ఎక్కడో బయటపడుతుంది. ఇలాంటి నిధికోసం ఎందరో తవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఈ సంపదను పాతబడిన కోటల్లోనూ, దేవాలయాల్లోనూ దాచి ఉంచేవారని అటుగా తవ్వకాలు జరిపేవారున్నారు. మొత్తానికి కష్టపడి చమటోర్చి సంపాదించే ధనం కన్నా అయాచితంగా వచ్చిపడే సంపదకు మనిషి ఎప్పుడూ ఆశపడుతూనే ఉంటాడు. ఇది మానవ నైజం. మనిషిలోని ఈ ఆత్రమే, ఈయావే గుప్తనిధుల వేటకు పురిగొల్పుతుంది. అలా బయలుదేరిన కొందరి సాహసయాత్రను రచయిత సీతారామరాజు ఇందుకూరి 'రామగ్రామ నుంచి రావణలంక దాకా' నవల్లో ఆసక్తిగా అక్షరాల్లో బంధించాడు. ఈ సాహసయాత్ర ఆధ్యంతం ఆసక్తిగా, అత్యంత ఉత్సుకతతో సాగుతుంది. కథను నడిపిన తీరు, కథలోని పాత్రల మధ్య నిధిని చేజిక్కించుకోవాలనే ఆరాటం చాలా సహజంగా ఉంటాయి. రచయితగా సీతారామరాజు కలానికి ఉన్న పదును తేల్చిన రచన ఇది. ఈ పుస్తకంలో కొన్ని మాటలు..
నవలలోని కొన్ని వాక్యాలు..
"ఈ కొలనులో నిత్యం ఊట వస్తుంది. దేవుడి కంటే మతం అంటకట్టచ్చుగానీ., తాగే నీటికి మతం లేదు కదా"...
"ఇప్పుడంటే పండపూట మాత్రమే గుడికెళ్ళడం, దేవుణ్ణి గుర్తుచేసుకోవడం ఫ్యాషన్ అయింది కానీ, ఒకప్పుడు గుడికి వెళ్ళడం రోజులో ముఖ్యమైన పని.. కాలం మారింది మనుషుల ఆలోచనలు, అవసరాలూ మారుతున్నాయి. కష్టం వస్తేనే దేవుడైనా, మరో మనిషైనా గుర్తొచ్చేది. లేదంటే ఏక్ నిరంజన్ అంటూ బ్రతికేయడానికి అలవాటు పడిపోతున్నారు జనం".
1. రచన మీద ఆసక్తి కలగడానికి వెనుకున్న బలమైన కారణాలు ఏమిటి? కుటుంబంలో ఎవరైనా సాహిత్యాన్ని ప్రోత్సాహించారా?
మొదట్నుంచి పుస్తకాలు చదవడం బాగా అలవాటు, బహుశా దాని వల్ల అనుకుంటాను, రాయడం అలవాటైంది. మనసులోని భావాన్ని అక్షరాలుగా చూసుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు, అదే మళ్ళీ రాయలనేలా పురిగొల్పుతుంది. ఆ ఇష్టమే ఇప్పుడు పుస్తకం వేసేంతగా నన్ను ప్రోత్సహించింది.
2. మీ మొదటి రచన ఏది? ఎప్పుడు రాసారు?
తుఫాను, ఆయన మాటలు అని ఒక షార్ట్ స్టోరీ రాశాను, అయితే పబ్లిష్ అవ్వలేదు.
3. ఫిక్షన్ వైపు రావడం ఎలా జరిగింది? 'రామ గ్రామ నుంచి రావణలంక దాకా' రాయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన సందర్భం?
నా రచన అడ్వంచర్ కామెడీలా రాద్దామనే ఆలోచన వచ్చినపుడు చిన్న కథగా మొదలు పెట్టాను. క్రమంగా అది ఇదిగో ఈ రచనలా మెదిలింది.
4. 'రామ గ్రామ నుంచి రావణలంక దాకా' పూర్తిగా నిధి వేటకు సంబంధించి కథాంశం, ఇది రాసేప్పుడు ఏమైనా పరిశోధన చేశారా? అంటే రిఫరెన్స్ ఏదైనా తీసుకున్నారా?
రిఫ్రెన్సులు ఏమీలేవు, పరిశోధన ఐతే చాలా ఉంది, ఇందులోని పాత్రలు తిరిగే ప్రదేశాలు, అక్కడి పరిస్థితులు కథకు లింక్ అయ్యేలా ఇలా చాలా సరుకు పోగేసుకున్నాకా, అదో పూర్తి రచనగా రూపుదిద్దుకుంది. అజు పబ్ల్సికేషన్స్ వాళ్ళు చాలా బాగా ప్రోత్సహించి ఈ పుస్తకం పబ్లిష్ చేశారు. అజు పబ్లికేషన్స్ మల్లి గారు స్వతహాగా రచయిత, నా పుస్తకాన్ని ఆయన సొంత పుస్తకంలా దగ్గర ఉండి డిజైన్ చేయించారు. దీనికిగాను అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి.
5. తెలుగు సాహిత్యంలో మీకు నచ్చిన రచయితలు ఎవరు?
వంశీ, శ్రీ తిరుమల రామచంద్ర గారి రచనలు చాలా ఇష్టం. అవి తెలుగు సాహిత్యం మీద ఇష్టాన్ని పెంచాయి.
6. మీ వృత్తి, అభిరుచులు, వ్యాపకాలు, గురించి చెప్పండి?
చేసేది Construction బిజినెస్, రాయడం, చదవడం ఇష్టం , ట్రావెల్ చెయ్యడం ఇష్టం.