USA: మరో మహిళ భర్తతో ఆన్‌లైన్‌లో పరిచయం..అతడిపై మోజు పెంచుకుని ఎంత దారుణానికి తెగించిందంటే..

ABN , First Publish Date - 2023-06-10T21:36:41+05:30 IST

టెన్ని్సీకి రాష్ట్రానికి చెందిన ఓ మహిళ దారుణానికి పాల్పడింది. మరో మహిళ భర్తపై మోజు పడ్డ ఆమె అతడి భార్యను అంతమొందించేందుకు ఏకంగా మర్డర్‌కు ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చింది.

USA: మరో మహిళ భర్తతో ఆన్‌లైన్‌లో పరిచయం..అతడిపై మోజు పెంచుకుని ఎంత దారుణానికి తెగించిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: టెన్ని్సీకి రాష్ట్రానికి (Tennessee) చెందిన ఓ మహిళ దారుణానికి పాల్పడింది. మరో మహిళ భర్తపై మోజు పడ్డ ఆమె అతడి భార్యను అంతమొందించేందుకు ఏకంగా మర్డర్‌కు ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చింది. అయితే, విదేశీ నిఘా సంస్థల సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు ఆమె ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఇటీవలే ఆమెపై హత్యా నేర అభియోగం దాఖలు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే, మెలోడీ సాసర్(47) అనే మహిళకు ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటికే అతడికి ఎంగేజ్‌మెంట్ అయ్యింది. ఆ తరువాత వివాహం కూడా జరిగింది. ఇవన్నీ తెలిశాక మెలోడీ ఆ వ్యక్తి భార్యను అంతం చేసి అతడిని సొంతం చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఆమె డార్క్‌ వెబ్‌ను ఆశ్రయించింది. తను మనసు పడ్డ వాడి భార్యను హత్య చేసే పనిని ఒక కిరాయి హంతకుడికి అప్పగించింది. ఇందుకోసం బిట్ కాయిన్లలో డబ్బు చెల్లించింది. అయితే, ఎంతకీ ఈ హత్య జరగకపోవడంతో ఆమె మళ్లి కిరాయి హంతకుడితో మాట్లాడి మరికొంత డబ్బు ముట్టచెప్పింది. మరోవైపు, డార్క్ వెబ్ కార్యకలాపాలపై నిఘా పెట్టే ఓ విదేశీ నిఘా సంస్థకు ఈ సమాచారం అందడంతో వారు అమెరికా పోలీసులకు ఈ సమాచారాన్ని బట్వాడా చేశారు.

ఈ నేపథ్యంలో వ్యక్తి భార్యను సంప్రదించిన పోలీసులు ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్న విషయాన్ని వెల్లడించారు. ఆమెకు ఎవరిపైన అయినా అనుమానాలు ఉన్నాయా అని ప్రశ్నించగా మెలోడీ పేరు ప్రస్తావించింది. తమ పెళ్లి విషయం తెలిసిన మెలొడీ ఒకసారి తమ ఇంటికి వచ్చి తమను తిట్టిందని, మీరు నరకంలో పడి ఛస్తారంటూ శాపనార్థాలు పెట్టిందని చెప్పింది. దీంతో, పోలీసులు మెలొడీపై నిఘా పెట్టి ఆధారాలతో సహా ఆమెను గత నెలలో అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆమెపై హత్యాయత్నం అభియోగం మోపారు. ఈ కేసులో మెలోడీ దోషిగా తేలితే రెండున్నర లక్షల డాలర్ల జరిమానాతో పాటూ పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Updated Date - 2023-06-10T21:36:45+05:30 IST