సప్తసముద్రాలు దాటొచ్చిన ప్రేమ.. వీరి ప్రేమ కథ తెలిసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2023-01-16T10:50:41+05:30 IST

సప్తసముద్రాల అవతల రాజకుమారిని చూసిన రాజకుమారుడి పరిస్థితి..

సప్తసముద్రాలు దాటొచ్చిన ప్రేమ.. వీరి ప్రేమ కథ తెలిసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

అనగనగా ఓ రాజకుమారుడు, ప్రపంచం మొత్తం తిరుగుతూ సప్తసముద్రాలు దాటి ప్రయాణిస్తాడు. అక్కడ అతనికి ఒక రాజకుమారి కనిపిస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు రాజకుమారుడు. ఇది జానపద కథల్లో సాధారణంగా వినిపించే ఓ కథ. ఇప్పుడు ఈ రాజకుమారి కథ ఎందుకూ అంటే.. ఏడు సముద్రాల అవతలి నుండి తన రాజకుమారిని తెచ్చుకున్నాడొక భారతీయ రాజకుమారుడు. అతను ఎవరు? వీరి కథ ఏంటి? వివరాల్లోకి వెళితే..

love-story1.gif

భవేష్ గైక్వాడ్ చత్తీస్ ఘర్ రాష్ట్రం రాజ్ నంద్గావ్ జిల్లాకు చెందినవాడు. ఇతని పాఠశాల విద్య అంతా స్థానిక పాఠశాలల్లోనే జరిగింది. ఆ తరువాత చదువు కోసం ఖతార్ వెళ్ళాడు. అక్కడ కూడా తన చదువు సమర్థవంతంగా పూర్తి చేసిన తరువాత మరింత పై చదువులు చదవాలనే ఉద్దేశంతో అతను టర్కీ దేశానికి వెళ్ళాడు. అక్కడ ఫిలిఫ్పీన్ లో అతను ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు ఉద్యోగం కూడా చేసేవాడు. అలా ఉద్యోగం చేస్తున్నచోట అతనికి జెజల్ అనే యువతి పరిచయం అయింది. వారిద్దరి మద్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం చాలాకాలం గడిచిన తరువాత ప్రేమకు దారితీసింది. వీరిద్దరి ప్రేమ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5ఏళ్ళు ఎలాంటి సమస్యలు లేకుండా సాగింది. ఇక పెళ్ళితో ప్రేమకు ముగింపు ఇవ్వాలని, ఇద్దరూ ఒకటై కొత్త జీవితం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

love-story2.gif

భవేష్ కుటుంబసభ్యులకు తన ప్రేమ విషయం చెప్పగానే వారు మొదట ఆశ్చర్యపోయినా ఒప్పుకున్నారు. వారు మాత్రమే కాదు జెజల్ కుటుంబం కూడా ఏ అభ్యంతరం చెప్పకపోవడంతో భవేష్ ఫిలిప్పీన్ కు వెళ్ళి జెజల్ ను వెంటబెట్టుకొచ్చాడు. వీరిద్దరి వివాహం జనవరి 14వ తేదీన భారతీయ సాంప్రదాయంలో ఎంతో వేడుకగా జరిగింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని అవన్నీ తనకెంతో నచ్చాయని ఫిలిప్పీన్ ముద్దుగుమ్మ జెజల్ తెలిపింది. దేశాలు వేరయినా, భాషలు వేరయినా ప్రేమకు అవన్నీ వర్తించవని ఈ జంట మరోసారి నిరూపించింది. విదేశీ అమ్మాయితో జరుగుతున్న పెళ్ళి చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. జెజల్ అచ్చమైన భారతీయ చీరకట్టు, బొట్టులో అందరినీ ఆకర్షించింది. సప్తసముద్రాలు దాటొచ్చి పెళ్ళి పీటలు ఎక్కిన ఈప్రేమ జంట గురించి తెలుసుకున్న నెటిజన్లు వీరి పెళ్ళి ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్నారు. వీరిమధ్య ప్రేమ కలకాలం అలాగే ఉండాలని కోరుకుంటున్నారు.

Updated Date - 2023-01-16T10:50:49+05:30 IST