Earthquakes: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో శుక్రవారం ఉదయం భూకంపాలు..
ABN , First Publish Date - 2023-02-10T13:00:44+05:30 IST
తీవ్ర భూప్రకోపం టర్కీ, సిరియాలపై మాత్రమే ప్రభావం చూపింది. ఇక తక్కువ తీవ్రతతో ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక మూలన భూకంపాలు నమోదవ్వడం కొత్తమే కాదు. అదేవిధంగా శుక్రవారం ఉదయం కూడా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తక్కువ తీవ్రత భూకంపాలు రికార్డయ్యాయి...
అంకారా: ప్రకృతి ప్రకోపం తీవ్ర భూకంపం (Earthquake) తాకిడికి తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై నమోదైన 7.8 తీవ్రత ప్రభావంతో ఇరుదేశాల్లో వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. జనాలు పిట్టల్లా రాలిపోయారు. శుక్రవారం ఉదయానికి (ఫిబ్రవరి 10) మృతుల సంఖ్య 21 వేలు దాటింది. ఇంకా భారీగా పెరగొచ్చనే అంచానలున్నాయి. రెస్యూ ఆపరేషన్లలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు బయటపడుతుండడంతో సామూహిక దహనాలు చేస్తున్నారు. ఏ శిథిలాన్ని తొలగించినా శవాలే కనిపిస్తున్నాయి. ఇక ఎంతోమంది క్షతగాత్రులు ఆసుపత్రుల పాలయ్యారు. అయినవారిని పోగొట్టుకొని రోడ్లపైనే రోధిస్తున్నవారిని చూస్తే గుండెలు తరుక్కుపోయే లెక్కలేనన్ని దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. మరోపక్క తింటానికి ఆహారం లేక ఎంతోమంది అలమటిస్తున్నారు. ఇంతటి విషాదానికి 7.8 తీవ్రత గల భూకంపమే కారణమైంది.
అయితే ఈ తీవ్ర భూప్రకోపం టర్కీ, సిరియాలపై మాత్రమే ప్రభావం చూపింది. ఇక తక్కువ తీవ్రతతో ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక మూలన భూకంపాలు నమోదవ్వడం కొత్తమే కాదు. అదేవిధంగా శుక్రవారం ఉదయం కూడా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తక్కువ తీవ్రత భూకంపాలు రికార్డయ్యాయి. ఈ భూప్రకంపనలను (tremors) యూఎస్‌జీఎస్ (United States Geological Survey) గుర్తించింది. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన డేటాను షేర్ చేసింది. టర్కీ దక్షిణప్రాంతంలోని యెసిల్‌యుర్ట్‌లో 15 కిలోమీటర్ల లోతులో 4.8 తీవ్రతగల భూకంపం నమోదయ్యింది. అలాస్కాలోని నాలెహులో 2.7 తీవ్రత, న్యూమెక్సికోలోని వైట్స్ సిటీలో 2.5 తీవ్రత, సెవెరో-కురిల్స్‌లో 4.4 తీవ్రత, టెక్సస్‌లోని హెర్మ్‌ల్హ్‌లో 2.8 తీవ్రత భూప్రకంపనలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లోని జుర్మ్ ప్రాంతంలో 4.2 తీవ్రత, ఫిలిప్పైన్స్‌లోని క్లావేరియాలో 4.9 తీవ్రత భూకంపాలు నమోదయ్యినట్టు యూఎస్‌జీఎస్ వెల్లడించింది. మరోవైపు స్వల్పస్థాయి భూప్రకంపనలు భారత్‌లోనూ కొత్తమీ కాదు. అప్పుడప్పుడు తక్కువ తీవ్రత భూకంపాలు నమోదవుతూనే ఉన్నాయి. ఈ మేరకు మీడియాలో వార్తలు కూడా వస్తున్న విషయం తెలిసిందే.
తుర్కియేలో 1,117 సార్లు భూప్రకంపనలు.
కాగా గత సోమవారం 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా.. ఇప్పటి వరకు 1,117 సార్లు భూమి కంపించిందని తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ భారీ భూకంపం కారణంగా తుర్కియే భౌగోళికంగా ఆరు మీటర్ల మేర పక్కకు కదిలినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వరుస ప్రకంపనలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సహాయక సిబ్బంది ఇప్పటికే వేలాది మృతదేహాలను వెలికితీయగా.. వేల సంఖ్యలో క్షతగాత్రులను కాపాడారు. తుర్కియే అధ్యక్షుడు ఎడోర్గాన్ గురువారం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను పరిశీలించారు. అలాగే సిరియాలో 3,317 మంది మృతిచెందగా.. 5వేల మందికి పైగా గాయాలయ్యాయి. ఆయా దేశాల్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో తాత్కాలిక పునరావాస కేంద్రాల్లోని బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ఆహారం, తాగునీటి కోసం అగచాట్లు పడుతుండగా.. గడ్డ కట్టే చలిని తట్టుకునేందుకు దుస్తులు, అందుబాటులోని బెంచీలు, కుర్చీలతో చలిమంట కాచుకుంటున్నారు. శిథిలాల కింద చిక్కుకుని గాయాలతో ప్రాణాలు కోల్పోయే వారికంటే చలి కారణంగానే ఎక్కువ మంది చనిపోతున్నారని పలువురు వాపోతున్నారు. కాగా ఐక్యరాజ్యసమితికి చెందిన వైద్య చికిత్స కిట్లతో కూడిన వాహనాలు గురువారం తుర్కియే నుంచి సిరియాకు చేరుకున్నాయి.