Suitcase Killer: ఈ ఫొటోలోని యువతి ఇంత అమాయకంగా కనిపిస్తోంది కానీ.. ఈమె చేసిన దారుణమేంటో తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం..!
ABN , First Publish Date - 2023-06-18T19:03:50+05:30 IST
కన్న తల్లిని హత్య చేసేందుకు ప్రియుడికి సహకరించిన ఓ అమెరికా యువతి ఇటీవలే ఇండోనేషియా జైలు నుంచి విడుదలై అమెరికాలో కాలు పెట్టింది. అక్కడ కూడా ఆమె జైల్లో మగ్గిపోనుంది.
ఇంటర్నెట్ డెస్క్: పై ఫొటోలోని యువతిని చూశారుగా? అమాయకంగా కనిపిస్తున్న ఆమె ఎవ్వరూ ఊహించని దూరాగతానికి పాల్పడింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కడతేర్చింది. ఇండోనేషియాలో ఏకంగా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన ఆమె సత్ప్రవర్తన కారణంగా ఇటీవలే విడుదలై తన స్వదేశం అమెరికాకు చేరుకుంది. అయితే, అక్కడ ఆమె మరో 28 ఏళ్లు పాటూ జైల్లోనే మగ్గిపోనుంది. సుమారు ఎనిమిదేళ్ల క్రితం అమెరికాలో కలకలం రేపిన ఆ యువతి మళ్లీ ఇన్నాళ్లకు అగ్రరాజ్యంలో చర్చనీయాంశమైంది. సూట్‌కేస్ కిల్లర్‌గా(Suitcase Killer) పేరుతెచ్చుకున్న ఈ యువతి ఉదంతం తెలిస్తే ఎవ్వరైనా నివ్వెరపోవాల్సిందే!
అది 2015. అప్పటికి మ్యాక్ ఒక టీనేజర్. శ్వేతజాతీయురాలైన ఆమె నల్లజాతీయుడైన టామీ షేఫర్‌తో ప్రేమలో పడింది. ఇది ఆమె తల్లి వీసీ మ్యాక్‌కు నచ్చలేదు. ధనవంతురాలైన వీసీ అదే ఏడాది మలేషియాలో హాలిడే ట్రిప్‌కోసం వెళ్లింది. అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో దిగింది. అయితే, ఇదే క్రమంలో ఇండోనేషియా వెళ్లిన మ్యాక్ ఆమె బాయ్‌ఫ్రెండ్ వీసీతో మరోసారి గొడవపడ్డారు. ఈ క్రమంలోనే టామీ ఆమెను గాజుబౌల్‌తో కొట్టి చంపేశాడు. తల్లి హత్యలో మ్యాక్ కూడా సహకరించింది. ఇద్దరూ కలిసి వీసీ మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి ఓ అద్దుకారు డిక్కీలో పెట్టారు. ఆ తరువాత మృతదేహాన్ని కారులోనే వదిలేసి పారిపోయారు. ఆ తరువాత వారు ఇండోనేషియా పోలీసులకు చిక్కారు. పోలీసులు అరెస్ట్ చేసే సమయానికి మ్యాక్ గర్భవతి.
ఇదిలా ఉంటే వీసీ తాను హత్య చేసినట్టు మ్యాక్ బాయ్‌ఫ్రెండ్ టామీ అంగీకరించాడు. ఆమె జాత్యాహకార పూర్తి దూషణలకు దిగడంతో కోపం అణుచుకోలేక చంపేసినట్టు పేర్కొన్నాడు. అయితే, వీసీని అడ్డుతొలగించుకోవాలంటూ అంతకుమునే టామీ స్నేహితుడు ఆ యువ ప్రేమికులకు సలహా ఇచ్చాడు. ఈ విషయం కూడా పోలీసులకు తెలియడంతో వారు అతడి స్నేహితుడికి కూడా అరెస్ట్ చేశారు. కోర్టు ఎనిమిదేళ్ల కారాగార శిక్ష విధించింది. ఇక టామీకి 18 ఏళ్ల శిక్ష పడింది.
ఇదిలా ఉంటే అమెరికాలోనూ వీరిద్దరిపై కేసు నమోదైంది. ఓకే నేరానికి నిందితుడికి రెండు సార్లు శిక్షించకూడదన్న నిబంధన మ్యాక్ విషయంలో వర్తించదని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. మరో దేశంలో మరో నేరంపై మ్యాక్ శిక్ష అనుభవించిందని స్పష్టం చేసింది. అమెరికాలో ఆమెపై హత్యకు కుట్ర పన్నడంతో సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఫలితంగా మ్యాక్ మరోసారి జైలుపాలు కానున్నారు. ఇక ఆమె బాయ్‌ఫ్రెండ్ మాత్రం ఇండోనేషియాలోనే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.