Bride: 7 అడుగులు వేశాక వరుడి ప్రవర్తనపై డౌట్.. నాకీ పెళ్లి వద్దంటూ బాంబు పేల్చిన వధువు.. అసలేం జరిగిందంటే..!
ABN , First Publish Date - 2023-11-25T21:05:29+05:30 IST
వరుడు తాగొచ్చాడని గుర్తించిన ఓ యువతి అతడితో కలిసి ఏడడుగులు వేశాక పెళ్లిని రద్దు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి వ్యక్తి జీవితంలో వివాహమనేది అత్యంత ముఖ్యమైన ఘట్టం. పెళ్లి తరువాత జీవితం పూర్తిగా మారిపోతుంది. అందుకే నేటి యువత తమ జీవిత భాగస్వామి విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు. అవతలి వ్యక్తి తమకు సరిపోడని భావిస్తే పెళ్లిమండపంలోనే వివాహాన్ని రద్దు చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య తరచూ వెలుగు చూస్తున్నాయి. అలాంటి షాకింగ్ ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) హత్రస్ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది.
జిల్లాలోని నగ్లానవల్ గ్రామంలో ఇటీవల ఓ పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. వరుడితో కలిసి ఏడు అడుగులు వేశాక యువతి పెళ్లి రద్దు చేసుకుంది. వాస్తవానికి వధూవరులు ఇద్దరూ ఒకరికొకరు నచ్చారు. దీంతో, వారి కుటుంబాలు పెద్ద ఎత్తున పెళ్లి ఏర్పాట్లు చేశాయి. పెళ్లి రోజున బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వధూవరులు ఏడడుగులు వేశారు. పెళ్లి క్రతువు అంతా పూర్తయ్యింది(Bride ends marriage after taking 7 pheras).
అయితే, ఏడడుగులు వేశాక యువతికి వరుడిపై అనుమానం మొదలైంది. అతడిని నిశితంగా గమనించాక వరుడు తాగొచ్చాడని నిర్ధారించుకుంది. అంతే, ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో వధువు తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్టు అప్పటికప్పుడు ప్రకటించింది. వరుడితో జీవితం పంచుకునేదే లేదని తేల్చి చెప్పింది.
క్షణకాలంలో ఆమె తీసుకున్న నిర్ణయానికి అక్కడున్న వారందరూ షాకైపోయారు. ఆ తరువాత రాజీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇరు వర్గాలు చాలా సేపు చర్చించుకున్నాయి. కాసేపు గొడవపడ్డాయి. వరుడి తరపు వారు వధువుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె మాత్రం బెట్టు సడలించలేదు. అతడితో పెళ్లి రద్దైపోయిందని తెగేసి చెప్పింది. ఇక చేసేదేం లేకపోవడంతో ఆ రెండు కుటుంబాలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.