ParaTrooping: సైనికుడి ప్రాణం తీసిన పారాచూట్.. పాపం మన తెలుగోడు.. అసలేమిటీ పారాట్రూపింగ్..?
ABN , First Publish Date - 2023-04-07T21:22:25+05:30 IST
అసలేమిటీ పారాట్రూపింగ్..?
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నావికాదళాధికారి చంద్రక గోవింద్ ఇటీవల అనూహ్య పరిస్థితుల్లో దుర్మరణం చెందారు. పారాట్రూపింగ్ శిక్షణ కార్యక్రమంలో విమానం నుంచి కిందకు దూకిన ఆయన పారాషూట్ తెరుచుకోలేదు. దీంతో.. ఆయన అమాంతం పై నుంచి నేలపై పడి మృతి చెందాడు. బుధవారం (ఏప్రిల్ 5, 2023) పశ్చిమబెంగాల్‌లోని పానాఘర్‌లో ఈ ఘటన జరిగింది. గోవింద్ మరణం ఆయన స్వగ్రామంలో విషాదం నింపింది. అసలు ఇంతకీ పారాట్రూపింగ్ అంటే ఏంటి? పారాషూట్ తెరుచుకోకుండా ఉండటం సాధ్యమేనా? ఈ ఘటనకు సంబంధించి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనలో అనేక మందికి కలిగే ఉంటాయి.
పారాట్రూపింగ్‌కు సంబంధించి భారత సైన్యంలో పారాషూట్ రెజిమెంట్ ఉంది. ఎటువంటి రవాణా సౌకర్యం లేని ప్రాంతాలకు సునాయసంగా చేరుకుని మిషన్లు పూర్తి చేయడం ఈ రెజిమెంట్ సైనికుల విధి. సుశిక్షితులైన సైనికులు యుద్ధ విమానాల్లోంచి పారాషూట్ సాయంతో కిందికి దూకి తమకు నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంటారు. ఇదే పారాట్రూపింగ్. ఇక పారాషూట్ రెజిమెంట్‌కు ఎంపిక కావాలంటే శారీరక, మానసిక సామర్థ్యాలు అత్యున్నత స్థాయిలో ఉండాలి. 28 ఏళ్ల లోపు సైనికులు, 30 ఏళ్ల లోపున్న ఆఫీసర్లు ఈ రెజిమెంట్‌లో చేరేందుకు అర్హులు.
పారాట్రూపింగ్‌లో తొలుత సైనికులకు 90 రోజుల పాటు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో అభ్యర్థుల శారీరక, మానసిక సామర్థ్యాలను పరీక్షిస్తారు. ప్రాథమిక స్థాయి శిక్షణ పూర్తి చేసుకున్న సైనికులకు ఆగ్రాలోని పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్‌లో బేసిక్ పారాషూట్ డిసెంట్ కోర్సు కింద శిక్షణ ఇస్తారు. తొలుత తాళ్ల సాయంతో హెలికాఫ్టర్ల నుంచి కిందకు దిగడంలో ట్రెయినింగ్ ఇస్తారు. దీంతో పాటూ విమానాలు గాల్లో ఉండగా పారాషూట్ ధరించి కిందకు దూకడంపై శిక్షణ ఇస్తారు.
రకరకాల వాతావరణ పరిస్థితుల్లో, విభిన్న రకాల విమానాల్లో పారాట్రూపర్లను ట్రెయిన్ చేస్తారు. ఈ రెజిమెంట్‌కు ఎంపికైన వారు పారాట్రూపింగ్‌లో పూర్తి స్థాయిలో నైపుణ్యం పొంది ఉంటారు. ఇక పారాషూట్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు సైన్యానికి చేసిన సేవలను గుర్తుచేసుకోవాల్సి వస్తే.. 1947 నాటి భారత్-పాక్ యుద్ధం, 1962 నాటి భారత్-చైనా యుద్ధం, 1999లో సంభవించిన కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు.
అయితే.. పారాట్రూపింగ్‌లో సాధారణ పౌరులకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలో అనేక సంస్థలు ఉన్నాయి. అయితే.. ఇందు కోసం పూర్తిస్థాయి శిక్షణ పొంది, వివిధ రకాల అనుమతులు పొందాల్సి ఉంటుంది.