-
-
Home » Prathyekam » whole india celebrating ISRO Chandrayaan-3 mission Vikram lander soft landing on moon psnr
-
Chandrayaan-3 Soft Landing: సాఫ్ట్ ల్యాండింగ్ గ్రాండ్ సక్సెస్...
ABN , First Publish Date - 2023-08-23T16:00:07+05:30 IST
జాబిల్లి దక్షిణ ధృవంపై తొలి అడుగు వేసి చరిత్ర సృష్టించాలనుకుంటున్న చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 mision) ల్యాండర్ విక్రమ్ (Lander Vikram) సంసిద్ధంగా ఉన్న వేళ యావత్ భారతావని ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తోంది. అద్భుత ఘట్టంతో చరిత్ర సృష్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శాస్త్రవేత్తలు టెన్షన్ టెన్షన్‌గా వేచిచూస్తున్నారు...
Live News & Update
-
2023-08-23T18:05:00+05:30
చందమామపై భారత్ చెరగని ముద్రవేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తుండగా.. కోట్లాది భారతీయుల ప్రార్థనలు ఫలించగా.. రెండు రోజులక్రితం రష్యా లూనా-25 మిషన్ కుప్పకూలిన చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 మిషన్ ‘ల్యాండర్ విక్రమ్’ విజయవంతంగా సాఫ్ట్‌గా (Soft landing) లాండయ్యింది. రాళ్లు, గుంతలు లేని ప్రదేశంలో సురక్షితంగా ల్యాండయ్యింది. ఈ అత్యద్భుత ఖగోళ ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతోపాటు విదేశీయులు కూడా ఎంతో ఆసక్తిగా తిలకించారు.
చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3(Chandrayaan-3) వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టింది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్(Vikram Lander) మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ముద్దాడింది. దీంతో అమెరికా, సోవియెట్ యూనియన్ (రష్యా), చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇటివల చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌కు ప్రయత్నించిన రష్యా లూనా-25 ఈ నెల 19న జాబిల్లిపై క్రాష్ ల్యాండ్ అయిన నేపథ్యంలో చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే.
ఇస్రోలో శాస్త్రవేత్తల సంబరాలు..
చందమామపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమవ్వడంతో బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలు ఉప్పొంగిపోయారు. వర్చువల్‌గా బెంగళూరు కేంద్రంలోని శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ ఉత్సాహపరిచారు. ల్యాండింగ్ విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్టులపై ప్రశంజల జల్లు కురిపించారు.
-
2023-08-23T18:00:00+05:30
ఉత్కంఠ భరితంగా ల్యాండింగ్ ప్రక్రియ. ఒక్కో దశను దాటుకుంటూ ఉపరితలంపై దిగేందుకు సిద్ధమైన ల్యాండర్ విక్రమ్.
-
2023-08-23T17:47:00+05:30
ప్రారంభమైన ల్యాండింగ్ ప్రక్రియ. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రపంచం.
-
2023-08-23T17:40:00+05:30
అంతా సవ్యం...
విక్రమ్ పనితీరును శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అక్కడి నుంచి వస్తున్న సిగ్నల్స్‌ను విశ్లేషిస్తున్నారు. ల్యాండర్ కెమెరా నుంచి కంట్రోల్ రూమ్‌కి ఫొటోలు వస్తున్నాయి. అంతా సవ్యంగానే పనిచేస్తున్న ల్యాండర్. బెంగళూరు కేంద్రంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్‌తో మాజీ చైర్మన్‌లు కూడా కొలువుదీరారు. అందరూ ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఈ ఘట్టాన్ని వీక్షిస్తున్నారు.
-
2023-08-23T17:30:00+05:30
ప్లాన్-బీ లేదు..
చంద్రయాన్-3 మిషన్ అంతా సజావుగానే సాగుతోందని, గతంలో భావించినట్టుగా ప్లాన్-బీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వర్గాలు చెప్పాయి. ల్యాండింగ్ ప్రక్రియ ముందుగా నిర్ణయించినట్లుగానే జరుగుతోందని తెలిపాయి. సానుకూల సంకేతాలు అందుతున్నాయని పేర్కొన్నాయి. నిజానికి బుధవారం పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ప్లాన్-బీ కింద విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగే ప్రక్రియను ఈ నెల 27కు వాయిదా వేయాలని భావించిన సంగతి తెలిసిందే.
-
2023-08-23T17:14:00+05:30
ఇస్రో లైవ్ ప్రసారం మొదలు
చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియకు సంబంధించిన ఇస్రో ప్రత్యక్ష ప్రసారం మొదలైంది. ఇస్రో వెబ్‌సైట్, ఫేస్‌బుక్ పేజ్, యూట్యూబ్ చానెల్‌తోపాటు డీడీ నేషనల్ చానెల్‌లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.
-
2023-08-23T17:10:00+05:30
పాక్ మహిళ సీమా హైదర్ ఊహించని నిర్ణయం..
పబ్జీలో పరిచయమైన భారతీయ యువకుడిని పెళ్లి చేసుకునేందుకు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. చంద్రయాన్-3 మిషన్ ల్యాండర్ విక్రమ్ చందమామపై ల్యాండవ్వబోతున్న నేపథ్యంలో ఆమె ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ మిషన్ విజయవంతంగా చందమామపై ల్యాండయ్యే వరకు ఏమీ తినను, తాగనని తెలిపింది. ఇక పాక్ నుంచి వచ్చిన మహిళకే ఈ విధంగా ఉంటే భారతీయులు ఇంకెంత భక్తిశ్రద్ధలతో ఈ ప్రయోగం కోసం ఎదురుచూస్తున్నారో ఇట్టే చెప్పేయవచ్చు.
-
2023-08-23T16:45:00+05:30
అంతా సవ్యంగా ఉంది...
ప్రయోగానికి కొన్ని గంటల ముందు ఇస్రో కీలక ప్రకటన చేసింది. బుధవారం మధ్యాహ్నం 12.52 గంటలకు ఒక ట్వీట్ చేసింది. చంద్రయాన్-3 మిషన్‌లో ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ALS)ను ప్రారంభించడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ నిర్ణీత ప్రదేశం వద్దకు రావడం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఇది బుధవారం సాయంత్రం 5.44 గంటలకు ఆ ప్రదేశానికి చేరుకుంటుందని తెలిపింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ ఏఎల్ఎస్ కమాండ్‌ను స్వీకరించిన మీదట వేగాన్ని సర్దుబాటు చేయగలిగేవిధంగా ఇంజిన్లను పని చేయిస్తాయని, తద్వారా ల్యాండర్ సక్రమంగా దిగడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపింది. ఈ సందర్భంగా ఇస్రో షేర్ చేసిన రెండు ఫొటోలు ఆసక్తికరంగా ఉన్నాయి. ల్యాండింగ్ కోసం శాస్త్రవేత్తలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్టు ఆ ఫొటోల ద్వారా స్పష్టమవుతోంది.
-
2023-08-23T16:25:00+05:30
మరో గంటన్నర లోపే చంద్రుడిపైకి విక్రమ్..
సమయం ఆసన్నమవుతోంది. ప్రస్తుతం జాబిల్లి చుట్టూ పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మిషన్ ల్యాండర్ విక్రమ్.. మరో రెండు గంటలలోపే చంద్రుడిపై ఉపరితలంపై అడుగుపెట్టబోతోంది. అయితే చంద్రుడిపై ల్యాండింగ్ అంత సాధారణ విషయం కాదు. అభివృద్ధి చెందిన దేశాలు చేపట్టిన పలు మూన్ మిషన్లు కూడా ఈ చివరి దశను అధిగమించలేకపోయాయి. సాఫ్ట్ ల్యాండింగ్‌లో ఎందుకివన్నీ విఫలమయ్యాయి? ఇంతకీ సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఏమిటి? అంటే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే.
ల్యాండింగ్ దశను ‘భయానక 20 నిమిషాలు (20 మినిట్స్ ఆఫ్ టెర్రర్)’గా అభివర్ణిస్తారు. ఎందుకంటే అది నిజంగానే అత్యంత క్లిష్టమైన దశ. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్టే చంద్రుడికి కూడా ఆకర్షణ శక్తి (భూమితో పోలిస్తే చాలా తక్కువగా) ఉంటుంది. ప్రస్తుతం చంద్ర కక్ష్యలో తిరుగుతున్న విక్రమ్ ల్యాండర్.. మామూలుగా జాబిలి ఉపరితలంపై దిగే ప్రయత్నం చేస్తే ఆ ఆకర్షణ శక్తికి వేగంగా వెళ్లి కూలిపోతుంది. అలా కూలిపోకుండా ల్యాండర్ నెమ్మదిగా వెళ్లి అక్కడ దిగితే దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. ల్యాండర్ అలా నెమ్మదిగా దిగడానికి దాదాపు 19 నిమిషాల సమయం పడుతుంది.
-
2023-08-23T16:11:00+05:30
ఇస్రో వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం
చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఇస్రో నిర్ణయించింది. బుధవారం సాయంత్రం 5:20గంటల నుంచి ఇస్రో వెబ్‌సైట్, ఫేస్‌బుక్ పేజ్, యూట్యూబ్ చానెల్‌తోపాటు డీడీ నేషనల్ చానెల్‌లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కాబట్టి ఈ అద్భుత ఖగోళ ఘట్టాన్ని వీక్షించాలనుకునేవాళ్లు ఎక్కడి నుంచైనా తిలకించే సౌలభ్యాన్ని ఇస్రో కల్పించింది.
-
2023-08-23T16:00:00+05:30
జాబిల్లి దక్షిణ ధృవంపై తొలి అడుగు వేసి చరిత్ర సృష్టించాలనుకుంటున్న చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 mision) ల్యాండర్ విక్రమ్ (Lander Vikram) సంసిద్ధంగా ఉన్న వేళ యావత్ భారతావని ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తోంది. అద్భుత ఘట్టంతో చరిత్ర సృష్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శాస్త్రవేత్తలు టెన్షన్ టెన్షన్‌గా వేచిచూస్తున్నారు. సాయంత్రం 6.04 గంటలకు ఆవిష్కృతమవ్వబోయే సాఫ్ట్ ల్యాండింగ్ దిగ్విజయంగా జరగాలని దేశవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా స్కూల్, కాలేజీ పిల్లలకు ప్రత్యేకంగా ఈ ఘట్టాన్ని చూపించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. ఒక్క భారత్ మాత్రమే కాకుండా ప్రపంచదేశాలు ఈ ఘట్టాన్ని తిలకించేందుకు ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా రెండు రోజులక్రితమే దక్షిణ ధృవంపై రష్యాకు చెందిన లూనా-25 మిషన్ కుప్పకూలిన నేపథ్యంలో విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
అనుకూలించకపోతే 27కి వాయిదా!
ల్యాండర్ మాడ్యూల్ పారామీటర్ల పనితీరు ‘అసాధారణం’గా ఉందని తేలితే ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27కు వాయిదా వేసే అవకాశం ఉంది. ఈ మేరకు మంగళవారమే ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్(Nilesh Desai) చెప్పారు. ‘‘చంద్రుడి ఉపరితలంపై 30కి.మీ. ఎత్తు నుంచి సెకనుకు 1.68 కిలోమీటర్ల వేగంతో ల్యాండర్ దిగేందుకు ప్రయత్నిస్తుంది. వేగాన్ని నియంత్రించలేకపోతే క్రాష్ ల్యాండింగ్ అయ్యే అవకాశాలుంటాయి. ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి 2 గంటల ముందు కమాండ్లను అప్‌లోడ్ చేస్తాం. టెలిమెట్రీ సిగ్నల్స్‌ను విశ్లేషించి చంద్రుడి స్థితిగతులను పరిశీలిస్తాం. ఆ సమయంలో ల్యాండర్ మాడ్యూల్ పారామీటర్ల పనితీరుకు సంబంధించిన ఏదైనా అసాధారణంగా కనిపిస్తే ల్యాండింగ్‌ను 27కు వాయిదా వేస్తాం’’ అని ఆయన వివరించారు. ఒకవేళ ఈ మిషన్ తేదీ మారితే ప్రధాన ల్యాండింగ్ ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో మరో స్థలాన్ని ఎంపిక చేసినట్లు దేశాయ్ పేర్కొన విషయం తెలిసిందే.