Share News

Viral: తల ఆరబెట్టుకునేందుకు హెయిర్ డ్రైయ్యర్ వాడిన యువతికి అదనంగా రూ.78 వేల బిల్లు.. తప్పు ఎక్కడ జరిగిందంటే..

ABN , Publish Date - Dec 18 , 2023 | 07:48 PM

హోటల్‌లో పొరపాటున ఫైర్ అలారమ్ మోగడానికి కారణమైన మహిళ చివరకు రూ.78 వేల అదనంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. హెయిర్ డ్రయ్యర్ వాడిన సందర్భంలో ప్రమాదవశాత్తూ ఫైర్ అలారమ్ మోగడంతో ఈ పరిస్థితి ఎదురైంది.

Viral: తల ఆరబెట్టుకునేందుకు హెయిర్ డ్రైయ్యర్ వాడిన యువతికి అదనంగా రూ.78 వేల బిల్లు.. తప్పు ఎక్కడ జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: హోటల్‌లో హెయిర్ డ్రైయ్యర్ వాడిన యువతి చివరకు అదనంగా రూ.78 వేల బిల్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియాలో (Australia) ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఇటీవల పెర్త్‌కు చెందిన ఓ యువతి ఓ మ్యూజిక్ కాన్సర్ట్‌కు హాజరయ్యేందుకు వెళ్లింది. అక్కడ ఓ హోటల్‌లో దిగింది. మరుసటి రోజు స్నానం చేశాక ఆమె తలారపెట్టుకునేందుకు తన గదిలోని హెయిర్ డ్రయ్యర్‌ను వాడింది.


ఈ క్రమంలోనే ఆమె పొరపాటున గదిలో ఫైర్ అలారమ్ మోగేలా చేసింది. తప్పు ఎక్కడ జరిగిందో ఆమె అర్థం చేసుకునేలోపే అగ్నిమాపక సిబ్బంది ఆమె గది వద్దకు వచ్చేశారు. దీంతో, ఆమె షాకైపోయింది. ప్రమాదం ఏమీ లేకపోవడంతో వారు తిరిగెళ్లిపోయారు. మరో రెండు రోజుల తరువాత మహిళ హోటల్ ఖాళీ చేసే వెళ్లిపోయే సమయంలో హోటల్ సిబ్బంది ఆమె ఊహించిన దానికంటే సుమారు రూ.78 వేలు ఎక్కువగా బిల్లేశారు. ఎందుకలా అని అడిగితే.. అగ్నిమాపక సిబ్బందిని పిలిపించినందుకు ఈ మొత్తం వసూలు చేశామని చెప్పారు (Woman charged $1,400 after using hair dryer at Australia hotel) .

హోటల్ వారి సమాధానంతో ఆమె దిమ్మెరపోయింది. ఇది చాలదన్నట్టు ఫైర్ డిపార్ట్‌మెంట్ చార్జీల కంటే కొంత మొత్తాన్ని అదనంగా కూడా హోటల్ సిబ్బంది వసూలు చేశారు. దీంతో ఆమె మరింత షాకైంది. ఏదైనా విందుకు హాజరైనప్పుడు కూడా ఇలాగే జరిగితే ఫుడ్ కాలిపోయిందంటూ బిల్లేస్తారా అంటూ మండిపడింది. అదనంగా వసూలు చేసిన చార్జీని తిరిగివ్వాలని ఆమె పలుమార్లు సిబ్బందికి ఫిర్యాదు చేసింది. తొలుత నిరాకరించిన వారు ఆ తరువాత మహిళ పలుమార్లు ఈమెయిల్ చేయడంతో అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగిచ్చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 07:51 PM