Most Expensive Coffee: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. తయారు చేసేది ఈ పిల్లి విసర్జించిన మలంతోనా..!
ABN , First Publish Date - 2023-09-07T21:58:36+05:30 IST
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీని సివెట్ పిల్లుల మలం నుంచి సేకరించిన కాఫీ గింజలతో తయారు చేస్తారు. సివెట్ కడుపులో జీర్ణమయ్యాక మాత్రమే ఈ కాఫీ గింజలు అద్భుతమైన రుచిని సంతరించుకుంటాయి. దీంతో, ఈ కాఫీ క్రేజ్ విపరీతంగా పెరిగి ధర అకాశాన్నంటింది. ఇండోనేషియాలో ఈ కాఫీని తయారు చేస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: కొందరికి పొద్దున్నే కాఫీ కడుపులో పడనిదే గానీ మంచం దిగలేరు. అలాంటి వారు మంచి కాఫీ కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడరు. కానీ, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. పిల్లి విసర్జించిన గింజలతో తయారవుతుందంటే నమ్మగలమా! అసలు అలాంటి కాఫీని తాగగలమా? అసలు ఆ ఊహే భరించలేమేమో! కానీ ఆ కాఫీ కోసం ఉవ్విళ్లూరే వారు బోలెడంత మంది ఉన్నారు. అందుకే అత్యంత ఖరీదైన కాఫీగా(Worlds most expensive Coffee) అది రికార్డు సొంతం చేసుకుంది. ఇంతకీ అదేం కాఫీ అంటారా? అదే కోపి లువాల్(Kopi luwak) లేదా సివెట్ క్యాట్ కాఫీ(Civet Cat Coffee).
సివెట్ అనేది పిల్లి జాతికి చెందిన ఓ క్షీరదం. దీన్ని తెలుగులో పునుగు పిల్లి అని అంటారు. ఇక ఇండోనేషియా(Indonesia), సుమత్రా, జావా, బాలిలో కోపి లువాక్ అనే ఓ తరహా కాఫీ చెర్రీలను పెంచుతారు. అయితే, ఇవి చాలా చేదుగా ఉండే చెర్రీలు. వీటిని యథాతథంగా కాఫీకి వినియోగించడం అసాథ్యం.
ఇక్కడే సీన్‌లోకి పునుగు పిల్లి ఎంట్రీ ఇస్తుంది. పునుపు పిల్లికి ఈ చెర్రీలంటే మహా ఇష్టం. వీటిని అది తెగ లాగించేస్తుంది. ఆ తరువాత అది విసర్జించే కాఫీ గింజలు అద్భుతమైన రుచి సంతరించుకుంటాయి. పునుగు పిల్లి జీర్ణాశయంలోని ఎంజైములే దీనికి కారణం. ఈ ఎంజైములు కాఫీ గింజల్లోకి చొచ్చుకెళ్లి వాటి రసాయనిక స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తాయి. గింజలను జీర్ణం చేసే క్రమంలో వాటికి కొత్త రుచిని తీసుకొస్తాయి.
ఇక పిల్లి విసర్జించిన గింజలను కాఫీ తయారీదారులు సేకరించి శుభ్రపరిచి వాటితో కాఫీ తయారు చేస్తారు. అయితే, ఈ కాఫీ తయారీకి పునుగు పిల్లులు కీలకం కావడంతో సరఫరా కంటే డిమాండ్ పెరిగిపోయింది. ఫలితంగా ధర ఆకాశాన్ని అంటింది. కాఫీ తయారీదారులు కొందరు తమ స్వలాభం కోసం పునుగు పిల్లుల్ని బంధిస్తుండటంపై జంతుప్రేమికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.