Zomato: జొమాటోలో ఆర్డర్ ఇచ్చిన ఓ యువతికి షాకింగ్ అనుభవం.. డెలివరీ బాయ్ ఇచ్చిన బిల్లు రిసిప్టును చూసి..!

ABN , First Publish Date - 2023-08-08T17:38:45+05:30 IST

అరవై రూపాయలు పెట్టి జొమాటోలో ఫుడ్ ఆర్డరిచ్చిన ఓ యువతి ఇందుకు అంతే మొత్తం ప్యాకేజీ చార్జీ కింద విధించడాన్ని తప్పుబట్టింది. తనకెదురైన అనుభవాన్ని నెట్టింట్లో పంచుకోవడంతో జొమాటో కూడా స్పందించింది. ప్యాకేజింగ్ చార్జీలను ఫుడ్ డెలివరీ చేసే రెస్టారెంట్లే విధిస్తాయని, తమకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది.

Zomato: జొమాటోలో ఆర్డర్ ఇచ్చిన ఓ యువతికి షాకింగ్ అనుభవం.. డెలివరీ బాయ్ ఇచ్చిన బిల్లు రిసిప్టును చూసి..!

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై తరచూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిమాండ్ అధికంగా ఉన్న సమయాల్లో సర్ చార్జుల బాదుడు, డెలివరీ ఎజెంట్లు కస్టమర్ల ఫుడ్‌ను దారిలోనే తినేయటాలు..తదితర ఫిర్యాదులు నెట్టింట వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఓ యువతికి ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. తన అనుభాన్ని ఆమె నెట్టింట్లో పంచుకుంటే భారీగా స్పందన వచ్చింది. తాము ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని కొందరు ఆశ్చర్యపోయారు.


సదరు యువతి జొమాటోలో(Zomato) ఫుడ్ ఆర్డరిచ్చింది. తనకు నచ్చిన థేప్లాలను ఒక్కోటి రూ.60 చొప్పున మూడు ప్లేట్లు ఆర్డరిచ్చింది. కానీ, డెలివరీ బాయ్ ఫుడ్‌తో పాటూ ఇచ్చిన బిల్లు చూసి ఆమెకు దిమ్మతిరిగినంత పనైంది. కారణం.. రెస్టారెంట్ వారు విధించిన కంటెయినర్ చార్జీలు. ఫుడ్ ప్యాకింగ్ కోసం వారు యువతి నుంచి ఏకంగా రూ.60 వసూలు చేశారు. తను ఆర్డరిచ్చిన ఫుడ్‌ ఖరీదుతో సమానంగా ప్యాకింగ్ చార్జీ ఉండటంతో యువతికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది(Packaging charge equal to food price). దీంతో, తన అనుభవాన్ని వివరిస్తూ జొమాటో బిల్లు ఫొటోను నెట్టింట్లో పెట్టింది(Woman loges protest on social media).


‘‘ఫుడ్‌ ఖరీదుతో సమానంగా కంటెయినర్ చార్జీల పేరిట ప్యాకింగ్ డబ్బులు వసూలు చేశారు. నమ్మలేకపోతున్నా’’ అంటూ యువతి జొమాటోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇది నెట్టింట్లో వైరల్‌ కావడంతో అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు యువతికి మద్దతు ఇవ్వగా మరికొందరు ఆమెనే తప్పుబట్టారు. ఆర్డర్ పెట్టే ముందే అన్ని సరిచూసుకోవాలని, ఫుడ్‌పై విధించిన చార్జీలన్నీ యాప్‌లో స్పష్టంగా కనిపిస్తాయని చెప్పారు. మరికొందరు జొమాటోపై విమర్శలు గుప్పించడంతో సంస్థ కూడా స్పందించింది. ఫుడ్ ప్యాకేజింగ్ చార్జీలు రెస్టారెంట్లే విధిస్తాయని, వాటి తాలూకు సొమ్ము రెస్టారెంట్లకే చేరుతుందని జొమాటో స్పష్టం చేసింది. తమకు ఇందులో ఏమీ రాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సంవాదం నెట్టింట పెద్ద చర్చకే దారి తీసింది.

Updated Date - 2023-08-08T17:44:17+05:30 IST