Asia Cup : ఇక ‘ఆసియా’ సమరం

ABN , First Publish Date - 2023-08-30T04:06:39+05:30 IST

వన్డే వరల్డ్‌క్‌పనకు ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు.. ఈ మెగా టోర్నీకి ముందే భారత ఉపఖండ అభిమానులను అలరించేందుకు మరో మినీ పోరు సిద్ధమవుతోంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఆసియాకప్‌నకు బుధవారం తెర లేవనుంది. షెడ్యూల్‌ ప్రకారం,..

Asia Cup : ఇక ‘ఆసియా’  సమరం

ఆరు జట్ల పోరు నేటినుంచే

ఆధిపత్యం కోసం భారత్‌ ఆరాటం

పాక్‌ X నేపాల్‌ మ్యాచ్‌తో టోర్నీ ఆరంభం

మ. 3 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

ముల్తాన్‌: వన్డే వరల్డ్‌క్‌పనకు ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు.. ఈ మెగా టోర్నీకి ముందే భారత ఉపఖండ అభిమానులను అలరించేందుకు మరో మినీ పోరు సిద్ధమవుతోంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఆసియాకప్‌నకు బుధవారం తెర లేవనుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ టోర్నీ పాక్‌లో జరగాల్సి ఉండగా.. భారత్‌ అభ్యంతరం మేరకు శ్రీలంక కూడా ఆతిథ్యమిస్తోంది. దీంతో టీమిండియా తమ మ్యాచ్‌లన్నింటినీ లంకలోనే ఆడనుంది. అంతేకాకుండా తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాక్‌ను ఎదుర్కోబోతుండడం కూడా సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఇక నేటి ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాక్‌ జట్టు పసికూన నేపాల్‌తో తలపడనుంది. నేపాల్‌కిదే తొలి ఆసియాకప్‌ కావడం విశేషం. టోర్నీలో మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 3 గంటల నుంచే జరుగనున్నాయి. అయితే కీలక ఆటగాళ్ల గాయాలతో లంక తమ జట్టును టోర్నీ ఆరంభానికి ఒక రోజు (మంగళవారం) ముందే ప్రకటించాల్సి వచ్చింది. సెప్టెంబరు 17న కొలంబోలో ఫైనల్‌ జరుగుతుంది. టైటిల్‌ ఫేవరెట్లుగా భారత్‌తో పాటు పాక్‌, శ్రీలంక కూడా బరిలోకి దిగుతున్నాయి. ఓవరాల్‌గా 16వ ఆసియాకప్‌ ఇది. ఇందులో రెండుసార్లు (2016, 2022) టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. గతేడాది శ్రీలంక జట్టు విజేతగా నిలిచింది.

ఇదీ ఫార్మాట్‌..

రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్దతిలో జరిగే ఆసియాక్‌పలో మొత్తం ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. మొత్తంగా 13 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో నాలుగింటికి మాత్రమే పాక్‌ ఆతిథ్యమివ్వనుంది. ముల్తాన్‌, లాహోర్‌, పల్లెకెలె, కొలంబో వేదికలు. గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ ఉండగా.. గ్రూప్‌ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌ జట్లున్నాయి. ఈ గ్రూపుల్లో టాప్‌-2గా నిలిచిన జట్లు సూపర్‌ 4కు అర్హత సాధిస్తాయి. అక్కడ ప్రతీ టీమ్‌ ఇతర మూడు జట్లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో టాప్‌-2 జట్లు ఫైనల్లో తలపడతాయి.’

ఆధిపత్యం భారత్‌దే..

1984లో ఆరంభమైన ఆసియాక్‌పలో భారత జట్టు ఏకంగా ఏడుసార్లు విజేతగా నిలిచింది. ఇందులో ఆరు వన్డే, ఒకటి టీ20 ఫార్మాట్‌ టైటిళ్లున్నాయి. శ్రీలంక ఆరు, పాక్‌ రెండుసార్లు నెగ్గాయి. తాజాగా భారత్‌ 2018 తర్వాత మరోసారి చాంపియన్‌ కావాలనుకుంటోంది. ఎందుకంటే వరల్డ్‌క్‌పనకు సన్నాహకంగా ఈ టోర్నీ జరుగుతుండడంతో ఇందులో టైటిల్‌ నెగ్గితే.. అంతులేని ఆత్మవిశ్వాసంతో మెగా ఈవెంట్‌కు బయలుదేరవచ్చు.

పాక్‌తో వేట

షురూఆసియాకప్‌ టైటిల్‌ వేటను రోహిత్‌ సేన శనివారం నుంచి ఆరంభించనుంది. తమ తొలి మ్యాచ్‌లోనే చిరకాల శత్రువు పాకిస్థాన్‌తో ఢీకొనబోతుండడంతో సహజంగానే క్రికెట్‌ ప్రేమికులంతా ఈ మ్యాచ్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇరు జట్లలోనూ స్టార్‌ ఆటగాళ్లకు కొదువలేదు.ప్రస్తుతం పాక్‌ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ జట్టు. అయితే అంతా సవ్యంగా సాగితే భారత్‌-పాక్‌ టీమ్స్‌ మూడుసార్లు ఎదురుపడే అవకాశం లేకపోలేదు. ఒకటి గ్రూప్‌ దశలో కాగా మరోటి సూపర్‌-4 దశలో. ఒకవేళ అంచనాలకు తగ్గట్టు రెండు జట్లు ఫైనల్‌కు చేరితే ఉత్కంఠ తారస్థాయికి చేరినట్టే. అటు బ్రాడ్‌కాస్టర్స్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ పది సెకన్ల టైమ్‌ స్లాట్‌కు రూ.30 లక్షల వరకు చార్జ్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలావుండగా తొలి మ్యాచ్‌లోనే పాక్‌తో పోరు కాబట్టి ఒత్తిడిని అధిమించాలంటే భారత్‌ బౌలర్లు మెరుగ్గా రాణించాల్సిందే.

ఇతర జట్ల అవకాశాలు

పాకిస్థాన్‌ జట్టు అఫ్ఘానిస్థాన్‌పై 3-0తో వన్డే సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేయడంతో పాటు నెంబర్‌వన్‌గా బరిలోకి దిగుతోంది. బాబర్‌ ఆజమ్‌ నేతృత్వంలో జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. భారత్‌కు ఈ టోర్నీలో గట్టి సవాల్‌ ఎదురయ్యేది ఈ జట్టు నుంచే. ఇక బంగ్లాదేశ్‌ జట్టు ఐర్లాండ్‌పై 2-0తో గెలిచినా, స్వదేశంలో అఫ్ఘాన్‌ చేతిలో 1-2తో ఓడింది. తమీమ్‌ ఇక్బాల్‌, ఎబాదోత్‌ హొస్సేన్‌ గాయాలతో తప్పుకొన్నారు. ఇక అద్భుత స్పిన్నర్లతో కూడిన అఫ్ఘాన్‌ తనదైన రోజున ఏ జట్టుకైనా షాక్‌ ఇవ్వగలదు. శ్రీలంక మాత్రం నలుగురు ప్రధాన బౌలర్లు హసరంగ, చమీర, మధుశంక, లాహిరు లేకుండానే టోర్నీలో ఆడుతోంది. దీంతో యువ ఆటగాళ్లతో కూడిన లంక జట్టు టైటిల్‌ను కాపాడుకుంటుందో లేదో చూడాల్సిందే.

గ్రూప్‌ దశకు రాహుల్‌ దూరం

ఓపెనర్‌, వికెట్‌కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ గ్రూప్‌ దశలో పాక్‌, నేపాల్‌లతో మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తెలిపాడు. అయితే స్టార్‌ పేసర్‌ బుమ్రా, శ్రేయాస్‌ అయ్యర్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులోకి రావడం కొండంత బలంగా మారింది. మరో పేసర్‌ ప్రసిద్ధ్‌ క్రిష్ణ కూడా సత్తా నిరూపించుకున్నాడు. అలాగే తెలుగు క్రికెటర్‌ తిలక్‌ వర్మ అవకాశం దక్కితే పరుగులు వరద పారించాలనుకుంటున్నాడు.

schedule.jpg

Updated Date - 2023-08-30T04:07:39+05:30 IST