WPL RCB vs UP : బెంగళూరు నవ్వింది!
ABN , First Publish Date - 2023-03-16T03:59:50+05:30 IST
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. తొలుత బౌలర్లు అదరగొట్టగా..ఆపై ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కనికా
మంధాన సేనకు తొలి విజయం
ఐదు వికెట్లతో యూపీ పరాజయం
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. తొలుత బౌలర్లు అదరగొట్టగా..ఆపై ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కనికా అహూజా (30 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 46) మెరుపులు మెరిపించడంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది. ఈ తొలి విజయంతో స్మృతి మంధాన సేన లీగ్‌లో పాయింట్ల (2) ఖాతా తెరిచింది. మొదట యూపీ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. గ్రేస్ హ్యారిస్ (32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), దీప్తీశర్మ (19 బంతుల్లో 4 ఫోర్లతో 22), కిరణ్ నవగిరె (22) మాత్రమే రాణించారు. ఎలిస్ పెర్రీ మూడు, సోఫీ డివైన్, శోభనా ఆశ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యాన్ని బెంగళూరు 18ఓవర్లలో 136/5తో ఛేదించింది. రిచా ఘోష్ (32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36 నాటౌట్) సత్తా చాటింది.
‘టాప్’ ఫ్లాపైనా..: లక్ష్యం మోస్తరే..కానీ టర్నింగ్ వికెట్‌పై ఏదైనా సాధ్యమే. అయినా గ్రేస్ హ్యారిస్ వేసిన తొలి ఓవర్లో సోఫీ 4,6,4తో దుమ్మురేపి ఆఖరి బంతికి నిష్క్రమించింది. రెండో ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధాన (0)ను దీప్తీశర్మ క్లీన్‌బౌల్డ్ చేసింది. ఏడో ఓవర్లో ఎలిస్ పెర్రీ (10)ని దేవిక అవుట్ చేయగా.. ధనాధన్ బ్యాటింగ్ చేస్తున్న హీథర్ నైట్‌కు దీప్తి చెక్ పెట్టింది. ఫలితంగా 60/4తో ఆర్‌సీబీ ఇబ్బందుల్లో పడింది. కానీ కనిక కళాత్మక షాట్లతో అలరించడంతోపాటు కీపర్ రిచా ఘోష్ జతగా ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించి బెంగళూరును విజయానికి చేరువ చేసింది. ఎకిల్‌స్టన్ బౌలింగ్‌లో కనిక బౌల్డయినా..రిచా భారీషాట్లతో మ్యాచ్‌ను ముగించింది.
గ్రేస్, దీప్తి పోరాటం: టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేపట్టిన యూపీ వారియర్స్ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్ల దెబ్బకు కుదేలయ్యారు. షాట్లు కొట్టే క్రమంలో సులువైన క్యాచులిచ్చి వెనుదిరిగారు. ఆల్‌రౌండర్లు గ్రేస్ హ్యారిస్, దీప్తీశర్మ పోరాడడంతోపాటు కిరణ్ నవ్‌గిరె ఆదుకోబట్టికానీ లేదంటే యూపీ స్కోరు సెంచరీ కూడా దాటకపోయేది. పేసర్ సోఫీ డివైన్ తొలి ఓవర్లో దేవిక వైద్య (0), అలీసా హీలీ (1) వికెట్లు తీసి వారియర్స్‌కు షాకిచ్చింది. ఆపై మరో పేసర్ మేఘన్ షూట్, స్పిన్నర్ ఆశ విజృంభించడంతో తొమ్మిదో ఓవర్లో 31/5తో యూపీ దయనీయస్థితిలో పడింది. ఈ దశలో.. చెరో లైఫ్ దక్కించుకున్న దీప్తి, హ్యారిస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. స్పిన్నర్ శ్రియాంక వేసిన 12వ ఓవర్లో హ్యారిస్, 6,4, దీప్తి బౌండ్రీ బాదడంతో 15 పరుగులు లభించాయి. తదుపరి శోభన ఓవర్లో హ్యారిస్ 4,6,4తో 16 రన్స్ రాబట్టడంతో వారియర్స్ స్కోరుబోర్డులో కదలిక వచ్చింది. మరోవైపు దీప్తి కూడా రెండు ఫోర్లు కొట్టడంతో 14వ ఓవర్లో 10 రన్స్ వచ్చాయి. ఈ జోడీ కుదురుకుంటున్న దశలో..ఎలిస్ పెర్రీ మొదట దీప్తిని అవుట్ చేసింది. దాంతో 69 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరో బంతి తర్వాత హ్యారి్‌సను తన తర్వాతి ఓవర్లో శ్వేత షెరావత్ (6)ను కూడా పెర్రీ పెవిలియన్ చేర్చింది. ఇక చివరి ఓవర్లో మరో రెండు వికెట్లు చేజార్చుకొన్న యూపీ వారియర్స్ 140 పరుగులలోపే ఆలౌటైంది.
సంక్షిప్తస్కోర్లు
యూపీ: 19.3 ఓవర్లలో 135 (గ్రేస్ హ్యారిస్ 46, దీప్తీశర్మ 22, కిరణ్ నవగిరె 22, ఎలిస్ 3/16, సోఫీ డివైన్ 2/23, శోభనా ఆశ (2/27).
బెంగళూరు: 18 ఓవర్లలో 136/5 (కిరణ్ అహూజా 46, దేవిక 31 నాటౌట్, నైట్ 24, దీప్తీశర్మ 2/26).