WTC Final : ఆ ఇద్దరూ ఆడేసుకున్నారు!
ABN , First Publish Date - 2023-06-08T03:22:37+05:30 IST
ఆరంభంలో టీమిండియా పేసర్ల దెబ్బకు ఆస్ట్రేలియా తడబడినా.. ట్రావిస్ హెడ్ (156 బంతుల్లో 146 నాటౌట్) ధనాధన్ సెంచరీతో తొలి రోజు ఆసీస్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఒక దశలో 76/3తో ఇబ్బందుల్లో పడ్డట్టు కనిపించిన కంగారూలు.. నాలుగో వికెట్‌కు స్టీవ్ స్మిత్ (95 నాటౌట్), హెడ్ అభేద్యంగా 251 పరుగులు జోడించి జట్టును...
ఆస్ట్రేలియా 327/3
నిరాశపర్చిన భారత బౌలర్లు
ట్రావిస్ శతకం.. అదరగొట్టిన స్మిత్
లండన్: ఆరంభంలో టీమిండియా పేసర్ల దెబ్బకు ఆస్ట్రేలియా తడబడినా.. ట్రావిస్ హెడ్ (156 బంతుల్లో 146 నాటౌట్) ధనాధన్ సెంచరీతో తొలి రోజు ఆసీస్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఒక దశలో 76/3తో ఇబ్బందుల్లో పడ్డట్టు కనిపించిన కంగారూలు.. నాలుగో వికెట్‌కు స్టీవ్ స్మిత్ (95 నాటౌట్), హెడ్ అభేద్యంగా 251 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఫస్ట్ సెషన్లో సిరాజ్ ఆసీస్ బ్యాటర్లను గడగడలాడించినా.. ఉమేశ్, శార్దూల్ నిలకడలేమి దెబ్బకొట్టింది. బుధవారం ఆరంభమైన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 327/3 స్కోరు చేసింది. ఆట నిలిచే సమయానికి స్మిత్, హెడ్ క్రీజులో ఉన్నారు. ఓపెనర్ వార్నర్ (43) మోస్తరుగా ఆడాడు. సిరాజ్, శార్దూల్, షమి తలో వికెట్ దక్కించుకొన్నారు. అశ్విన్ పక్కనబెట్టి శార్దూల్‌ను తుది జట్టులోకి తీసుకొన్నారు.
కంగారూల తడబాటు: మేఘావృతమైన వాతావరణం.. పిచ్‌పై పచ్చిన ఉండడంతో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకొంది. ఈ నిర్ణయం సబబే అన్నట్టుగా పేసర్లు సిరాజ్, షమి ఆసీస్ బ్యాటర్లకు సవాల్ విసిరారు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారంతో హైదరాబాదీ నిప్పులు చెరిగాడు. బౌన్స్‌తో పాటు స్వింగ్‌ను రాబట్టిన సిరాజ్.. ఇన్ఫామ్ ఓపెనర్ ఖవాజా (0)ను డకౌట్ చేసి ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఆఫ్‌స్టంప్ బయటపడిన పడిన బంతిని ఆడే ప్రయత్నంలో ఖవాజా బ్యాట్ ఎడ్జ్ తీసుకోగా.. భరత్ చక్కని క్యాచ్ అందుకున్నాడు. అయితే, మరో ఓపెనర్ వార్నర్, లబుషేన్ (26) తడబడుతూనే భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. కానీ, గంట ఆట తర్వాత టీమిండియా పట్టుసడలించగా.. ఎండ తీవ్రత పెరగడంతో వికెట్ బ్యాటింగ్‌కు సహకరించడం ఆరంభమైంది. 15వ ఓవర్లో ఉమేశ్ బౌలింగ్‌లో వార్నర్ నాలుగు బౌండ్రీలతో బ్యాట్‌ను ఝుళిపించాడు. మరోవైపు లబుషేన్ క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బందిగా కదిలాడు. శార్దూల్ బౌలింగ్‌లో రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకొన్నాడు. తొలి సెషన్‌ను ఆసీస్ మెరుగ్గా ముగుస్తుందని భావిస్తుండగా.. అర్ధ శతకం దిశగా సాగుతున్న వార్నర్‌ను శార్దూల్ అవుట్ చేయడంతో.. రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. లెగ్‌సైడ్ వెళ్తున్న షార్ట్ బాల్.. వార్నర్ గ్లౌజులను ముద్దాడగా భరత్ డైవింగ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకొన్నాడు. దీంతో ఆసీస్ 23 ఓవర్లలో 73/2తో లంచ్‌కు వెళ్లింది.
ఆదుకొన్న హెడ్, స్మిత్: రెండో సెషన్ ఆరంభంలోనే ఆసీ్‌సకు ఝలక్ తగిలినా.. స్మిత్, ట్రావిస్ ఆదుకొన్నారు. లంచ్ తర్వాత లబుషేన్‌ను బౌల్డ్ చేసిన షమి.. జట్టుకు భారీ వికెట్ అందించాడు. 76/3తో ఆసీస్ ఇబ్బందుల్లోపడ్డట్టు కనిపించినా.. స్మిత్, హెడ్ పరిస్థితులను చక్కదిద్దారు. స్మిత్ ఆచితూచి ఆడినా.. హెడ్ సునాయాసంగా బౌండ్రీలు సాధిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 30వ ఓవర్లో సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్‌తో టీమ్ స్కోరును సెంచరీ దాటించిన హెడ్.. ఆ తర్వాత శార్దూల్ బౌలింగ్‌లో మరో మూడు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో మరో బౌండ్రీతో హెడ్ అర్ధ శతకం పూర్తి చేసుకొన్నాడు. స్పిన్నర్ జడేజా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. ఆసీస్ 170/3తో టీ విరామానికి వెళ్లింది.
పరుగుల జోరు: ఆఖరి సెషన్ మొత్తం కంగారూలు ఆధిపత్యం ప్రదర్శించగా.. టీమిండియా బౌలర్లు తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. షార్ట్ బాల్స్‌తో హెడ్, స్మిత్‌ల ఏకాగ్రతను దెబ్బతీయాలనే వ్యూహం కూడా పని చేయలేదు. టీ తర్వాత హెడ్, స్మిత్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును నడిపించారు. 60వ ఓవర్లో షమి బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ బాదిన హెడ్.. ఆ తర్వాత మరో బౌండ్రీ రాబట్టాడు. స్మిత్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. సింగిల్‌తో హెడ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత వీరిద్దరూ మరింత ధాటిగా ఆడడంతో టీమ్ స్కోరు 300 పరుగుల మార్క్ దాటింది. 80వ ఓవర్లో టీమిండియా కొత్త బంతిని తీసుకొన్నా.. వికెట్ రాబట్టలేక పోయింది. ఈ సెషన్లో 34 ఓవర్ల ఆటలో ఆసీస్ వికెట్ కోల్పోకుండా 157 పరుగులు జోడించింది.
స్కోరు బోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) భరత్ (బి) శార్దూల్ 43, ఖవాజా (సి) భరత్ (బి) సిరాజ్ 0, లబుషేన్ (బి) షమి 26, స్మిత్ (నాటౌట్) 95, హెడ్ (నాటౌట్) 146; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 85 ఓవర్లలో 327/3; వికెట్ల పతనం: 1-2, 2-71, 3-76; బౌలింగ్: షమి 20-3-77-1, సిరాజ్ 19-4-67-1, ఉమేశ్ 14-4-54-0, శార్దూల్ 18-2-75-1, జడేజా 14-0-48-0.
డబ్ల్యూటీసీ ఫైనల్
1 టెస్ట్ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో శతకం నమోదు చేసిన తొలి ఆటగాడు హెడ్. కెరీర్లో అతడికి ఇది ఆరో సెంచరీ కాగా.. విదేశాల్లో మొదటిది.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సంతాపంగా ఇరుజట్లూ నల్ల రిబ్బర్లు ధరించి బరిలోకి దిగాయి.