IPL Gujarati Titans VS Chennai: చెన్నై ఇన్నింగ్స్‌కు బ్రేక్‌

ABN , First Publish Date - 2023-05-30T03:54:25+05:30 IST

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచను సోమవారం కూడా వరుణుడు అడ్డగించాడు. అయితే టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత టైటాన్స మాత్రం నిర్ణీత 20 ఓవర్లపాటు ఆడగలిగింది. సాయి సుదర్శన (47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 96) తృటిలో శతకం కోల్పోగా.. ఓపెనర్‌ వృద్ధిమాన సాహా (39 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 54), గిల్‌ (20 బంతుల్లో 7 ఫోర్లతో 39) రాణించారు.

  IPL  Gujarati Titans VS Chennai:  చెన్నై ఇన్నింగ్స్‌కు బ్రేక్‌

వరుణుడి ఆటంకం.. టైటాన్స జోరు

214/4తో భారీ స్కోరు.. సుదర్శన సెంచరీ మిస్‌

ఐపీఎల్‌ ఫైనల్లో ఎక్కువ పరుగులిచ్చిన (0/56) మూడో బౌలర్‌గా తుషార్‌ దేశపాండే. వాట్సన (0/61), ఫెర్గూసన (0/56) ముందున్నారు.

ఐపీఎల్‌ తుదిపోరులో అత్యధిక వ్యక్తిగత స్కోరు (96) సాధించిన మూడో బ్యాటర్‌గా సుదర్శన. వాట్సన (117 నాటౌట్‌), సాహా (115 నాటౌట్‌) టాప్‌లో ఉన్నారు.

ఐపీఎల్‌ ఫైనల్‌ పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు (62) చేసిన తొలి జట్టుగా గుజరాత

ఓ ఐపీఎల్‌ సీజనలో అత్యధిక పరుగులు (890) సాధించిన రెండో బ్యాటర్‌గా గిల్‌. విరాట్‌ (2016లో 973) టాప్‌లో ఉన్నాడు. అలాగే ఒకే వేదికపై (అహ్మదాబాద్‌) సీజనలో ఎక్కువ పరుగులు (572) చేసిన బ్యాటర్‌గా గిల్‌. బెంగళూరులో విరాట్‌ 597 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌ ఫైనల్లో50+ స్కోరు సాధించిన రెండో అతిపిన్న వయస్కుడిగా (21 ఏళ్లు) సుదర్శన. మనన వోహ్రా (20) టాప్‌లో ఉన్నాడు. అలాగే రజత పటీదార్‌ (112 నాటౌట్‌) తర్వాత రెండో అనక్యాప్‌డ్‌ ప్లేయర్‌గా నిలిచాడు.

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచను సోమవారం కూడా వరుణుడు అడ్డగించాడు. అయితే టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత టైటాన్స మాత్రం నిర్ణీత 20 ఓవర్లపాటు ఆడగలిగింది. సాయి సుదర్శన (47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 96) తృటిలో శతకం కోల్పోగా.. ఓపెనర్‌ వృద్ధిమాన సాహా (39 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 54), గిల్‌ (20 బంతుల్లో 7 ఫోర్లతో 39) రాణించారు. దీంతో టైటాన్స 4 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. పథిరనకు రెండు వికెట్లు దక్కాయి. సరిగ్గా టైటాన్స ఇన్నింగ్స్‌ ముగిశాక విరామ సమయంలో ఐదు నిమిషాలనాటు చిన్నపాటి వర్షం కురిసింది. దీంతో రాత్రి 9.45 నిమిషాలకు చెన్నై ఇన్నింగ్స్‌ ఆరంభమైంది. మూడు బంతులు ముగిశాక భారీ వర్షం ఆరంభమైంది. రాత్రి 10.15కు వర్షం తగ్గినప్పటికీ మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో రెండుసార్లు అంపైర్లు తనిఖీ చేశారు. చివరకు అర్ధరాత్రి 12.10కు 15 ఓవర్లలో 171 పరుగులకు కుదిస్తున్నట్టు ప్రకటించారు.

అందరూ బాదేశారు..

టాస్‌ గెలిచిన చెన్నై ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా గుజరాత బ్యాటర్లు యధేచ్ఛగా చెలరేగారు. మరో వైపు బౌలింగ్‌లో పసలేకపోవడంతో పాటు చెత్త ఫీల్డింగ్‌తో పవర్‌ప్లేలోనే చెన్నై పలు అవకాశాలను చేజార్చుకుంది. దీనికి తోడు ఎవరి అంచనాలో లేని సుదర్శన బ్యాట్‌ ఝుళిపించడంతో టైటాన్స భారీ స్కోరునందుకుంది. గిల్‌ మూడు పరుగుల వద్ద ఇచ్చిన సులువైన క్యాచను బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌లో దీపక్‌ చాహర్‌ వదిలేశాడు. గిల్‌ కోసమే ధోనీ అతడిని అక్కడ ఉంచినా వచ్చిన అవకాశాన్ని రెండో ఓవర్‌లోనే మిస్‌ చేశాడు. ఇక తన ఓవర్‌లోనే సాహా ఇచ్చిన రిటర్న్‌ క్యాచను కూడా అందుకోలేకపోయాడు. దీంతో చెలరేగిన ఈ ఓపెనింగ్‌ జోడీ చెన్నై బౌలర్లపై విరుచుకుపడి బౌండరీల వర్షం కురిపించింది. మూడో ఓవర్‌లో సాహా 6,4,4 బాదగా.. తర్వాతి ఓవర్‌లో గిల్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా తీక్షణ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లోనూ గిల్‌ మరోసారి హ్యాట్రిక్‌ ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లేలో జట్టు 62 పరుగులు సాధించింది. అయితే ఏడో ఓవర్‌లో సాహా రనౌట్‌ను మిస్‌ చేసిన జడేజా.. గిల్‌ వికెట్‌ తీసి ఊరటనిచ్చాడు. ధోనీ మెరుపు వేగంతో చేసిన స్టంపింగ్‌తో గిల్‌ వెనుదిరిగాడు.

తొలి వికెట్‌కు ఈ జోడీ 42 బంతుల్లో 67 పరుగులు అందించింది. మరోవైపు సాహాతో జత కట్టిన సుదర్శన కూడా వేగం కనబర్చడంతో గుజరాత స్కోరు 12వ ఓవర్‌లోనే వంద దాటేసింది. అలాగే 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన సాహా.. చాహర్‌ స్లోబాల్‌కు ధోనీకి క్యాచ ఇచ్చాడు. దీంతో రెండో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరో ఎండ్‌లో జోరు పెంచిన సుదర్శన అనూహ్యంగా చెలరేగాడు. 15వ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడి 33 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఆతర్వాత 16వ ఓవర్‌లో రెండు ఫోర్లత పాటు తర్వాతి ఓవర్‌లో వరుసగా 6,4,4,4తో 20 పరుగులు రాబట్టాడు. పేసర్‌ పథిరన మాత్రం 18వ ఓవర్‌లో 9 పరుగులే ఇచ్చి పరుగుల వరదను కాస్త కట్టడి చేశాడు. అటు హార్దిక్‌ రెండు సిక్సర్లతో, సుదర్శన ఓ ఫోర్‌తో 19వ ఓవర్‌లో 18 రన్స రావడంతో స్కోరు 200కి చేరింది. అయితే సెంచరీ ఖాయమనుకున్న సుదర్శన ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది మూడో బంతికి ఎల్బీ అయ్యాడు. అలాగే ఆఖరి బంతికి రషీద్‌ డకౌట్‌ కావడంతో టైటాన్స 14 రన్స చేయగలిగింది.

స్కోరుబోర్డు

గుజరాత టైటాన్స్‌:

సాహా (సి) ధోనీ (బి) చాహర్‌ 54, గిల్‌ (స్టంప్డ్‌) ధోనీ (బి) జడేజా 39, సాయు సుదర్శన్‌ (ఎల్బీ) పథిరన 96, హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 21, రషీద్‌ (సి) రుతురాజ్‌ (బి) పథిరన 0, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 214/4; వికెట్ల పతనం: 1-67, 2-131, 3-212, 4-214; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-38-1, తుషార్‌ దేశ్‌పాండే 4-0-56-0, తీక్షణ 4-0-36-0, జడేజా 4-0-38-1, పథిరన 4-0-44-2.

Updated Date - 2023-05-30T04:28:33+05:30 IST