IPL Chennai vs Benguluru : చెన్నై.. అదిరెన్
ABN , First Publish Date - 2023-04-18T04:12:47+05:30 IST
ఎవరి హిట్టింగ్ ఎంతో తేల్చుకుందాం.. రా అన్నట్టుగా సాగింది చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్
కాన్వే, దూబే మెరుపు ఇన్నింగ్స్
బెంగళూరుపై 8 రన్స్‌తో గెలుపు
పోరాడిన డుప్లెసి, మ్యాక్స్‌వెల్
బెంగళూరు: ఎవరి హిట్టింగ్ ఎంతో తేల్చుకుందాం.. రా అన్నట్టుగా సాగింది చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్. మొత్తంగా 444 పరుగులు.. ఇరుజట్ల నుంచి 24 ఫోర్లు, 33 సిక్సర్లు. ఇలా బౌండరీల హోరుతో దద్దరిల్లిన చిన్నస్వామి స్టేడియంలో చివరకు చెన్నై జట్టు మురిసింది. డుప్లెసి (33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 62), మ్యాక్స్‌వెల్ (36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76) దూకుడును సరైన సమయంలో చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో ధోనీసేన 8 పరుగుల తేడాతో నెగ్గింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగుల భారీస్కోరు సాధించింది. డెవాన్ కాన్వే (45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 83), శివమ్ దూబే (27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52) అదరగొట్టారు. ఆ తర్వాత ఛేదనలో బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేసి ఓడింది. కాన్వే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
డుప్లెసి, మ్యాక్స్ చెలరేగినా..: భారీ ఛేదనలో ఆర్‌సీబీ తొలి రెండు ఓవర్లలోనే కోహ్లీ (6), మహిపాల్ లొమ్రోర్ (0) వికెట్లను కోల్పోయింది. కానీ డుప్లెసి, మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిన తీరుకు ఓ దశలో చెన్నై ఓటమి ఖాయమేననిపించింది. కానీ కీలక సమయలో ఈ జోడీ వెనుదిరగడం ఆర్‌సీబీని దెబ్బతీసింది. అటు రహానె సూపర్ ఫీల్డింగ్‌తో విలువైన రన్స్‌ను అడ్డుకున్నాడు. నాలుగో ఓవర్‌లో డుప్లెసి 4,4,6.. తర్వాతి ఓవర్‌లో 6,4,4తో పవర్‌ప్లేలో జట్టు స్కోరు 75కి చేరింది. 23 బంతుల్లో డుప్లెసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. పదో ఓవర్‌లో మ్యాక్స్ 4,4,6తో 24 బంతుల్లో ఫిఫ్టీ అందుకున్నాడు. ఎడాపెడా బౌండరీలతో సజావుగా సాగుతున్న వీరి ఇన్నింగ్స్‌కు బ్రేక్ వేస్తూ 13వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ను తీక్షణ, 14వ ఓవర్‌లో డుప్లెసిని మొయిన్ అలీ అవుట్ చేశారు. మూడో వికెట్‌కు 61 బంతుల్లో 126 పరుగులు జోడించిన ఈ ఇద్దరూ ధోనీ అద్భుత క్యాచ్‌లతోనే వెనుదిరిగారు. ఆ తర్వాత ఆర్‌సీబీ ఆట గతి తప్పింది. దినేశ్ కార్తీక్ (28) రన్‌రేట్ తగ్గకుండా భారీ షాట్లతో ఆకట్టుకున్నా అతడితో పాటు షాబాజ్ (12), పార్నెల్ (2) వరుస ఓవర్లలో వెనుదిరగడంతో ఆఖరి ఓవర్‌లో గెలుపు సమీకరణం 19 రన్స్‌కు చేరింది. ఈ దశలో ఒత్తిడికి లోనుకాకుండా పేసర్ మతీశ పథిరన పది పరుగులే ఇచ్చి సుయాశ్ ప్రభుదేశాయ్ (19) వికెట్ తీయడంతో చెన్నై సంబరాల్లో మునిగింది.
కాన్వే, దూబే జోరు..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై మూడో ఓవర్‌లోనే ఓపెనర్ రుతురాజ్ (3) వికెట్ కోల్పోయింది. కానీ అంచనాలకు మించి ఫామ్‌లో ఉన్న రహానె (37) మరోసారి తన ప్రతాపం చూపగా, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే.. శివమ్ దూబే బౌలర్ ఎవరైనా బంతిని బాదుడే లక్ష్యంగా కదం తొక్కారు. దీంతో 7-15 ఓవర్ల మధ్యలో ఈ జోడీ ధాటికి 112 పరుగులు వ్చాయి. రన్‌రేట్ 11కి మించి దూసుకెళ్లింది. ముఖ్యంగా దూబే కొట్టిన సిక్సర్లు కొన్ని స్టేడియం రూఫ్‌ను తాకడం విశేషం. ఐదో ఓవర్‌లో 6, ఆరో ఓవర్‌లో 4,6,4తో రహానె బ్యాట్ ఝుళిపించడంతో పవర్‌ప్లేలో సీఎ్‌సకే 53/1 స్కోరు సాధించింది. అటు కాన్వే అడపాదడపా సిక్సర్లతో మురిపించాడు. ఈ దశలో రహానె వికెట్‌ను తీసిన హసరంగ కాస్త రిలీ్‌ఫనిచ్చాడు. కానీ దూబే విజృంభణతో ఆర్‌సీబీ సంతోషం ఆవిరైంది. అటు 32 బంతుల్లో వరుసగా రెండో ఫిఫ్టీ సాధించిన కాన్వే 12వ ఓవర్‌లో 4,4,6తో చెలరేగాడు. ఇక 13వ ఓవర్ దూబే బాదిన సిక్సర్ ఏకంగా 111 మీ. దూరం వెళ్లడం విశేషం. 15వ ఓవర్‌లో దూబే 6, కాన్వే 6,4తో 19 రన్స్ వచ్చాయి. అయితే ఈ పరుగుల ప్రవాహానికి 16వ ఓవర్‌లో హర్షల్ బ్రేక్ వేశాడు. సెంచరీ వైపు వేగంగా వెళుతున్న కాన్వేను సూపర్ యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ చేయడంతో మూడో వికెట్‌కు 37 బంతుల్లోనే 80 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్‌లోనే భారీ సిక్సర్‌తో 25 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన దూబే.. బౌండరీ లైన్ దగ్గర సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. 4,6తో ఆకట్టుకున్న అంబటి రాయుడు (14) కూడా త్వరగానే అవుటవగా.. 19వ ఓవర్‌లో సిరాజ్ పది పరుగులే ఇచ్చాడు. ఇక ఆఖరి ఓవర్‌లో మరో సిక్సర్ మాత్రమే నమోదై జడేజా (10) వికెట్ కోల్పోవడంతో స్కోరు 230కి లోపే ముగిసింది.
చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుపై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు (226). అలాగే ఐపీఎల్‌లో చెన్నైకిది మూడో అత్యధిక స్కోరు.
ఐపీఎల్‌లో తొలి 15 ఓవర్లలోనే 12 సిక్సర్లు బాదడం చెన్నై జట్టుకిదే తొలిసారి.
స్కోరుబోర్డు
చెన్నై: రుతురాజ్ (సి) పార్నెల్ (బి) సిరాజ్ 3, కాన్వే (బి) హర్షల్ 83, రహానె (బి) హసరంగ 37, శివమ్ దూబే (సి) సిరాజ్ (బి) పార్నెల్ 52, రాయుడు (సి) కార్తీక్ (బి) వైశాఖ్ 14, మొయిన్ అలీ (నాటౌట్) 19, జడేజా (సి/సబ్) ప్రభుదేశాయ్ (బి) మ్యాక్స్‌వెల్ 10, ధోనీ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 226/6; వికెట్ల పతనం: 1-16, 2-90, 3-170, 4-178, 5-198, 6-224; బౌలింగ్: సిరాజ్ 4-0-30-1, పార్నెల్ 4-0-48-1, విజయ్‌కుమార్ వైశాఖ్ 4-0-62-1, మ్యాక్స్‌వెల్ 2.4-0-28-1, హసరంగ 2-0-21-1, హర్షల్ పటేల్ 3.2-0-36-1.
బెంగళూరు: కోహ్లీ (బి) ఆకాశ్ 6, డుప్లెసి (సి) ధోనీ (బి) అలీ 62, మహిపాల్ (సి) రుతురాజ్ (బి) దేశ్‌పాండే 0, మ్యాక్స్‌వెల్ (సి) ధోనీ (బి) తీక్షణ 76, షాబాజ్ (సి) రుతురాజ్ (బి) పథిరన 12, దినేశ్ (సి) తీక్షణ (బి) దేశ్‌పాండే 28, ప్రభుదేశాయ్ (సి) జడేజా (బి) పథిరన 19, పార్నెల్ (సి) దూబే (బి) దేశ్‌పాండే 2, హసరంగ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 218/8; వికెట్ల పతనం: 1-6, 2-15, 3-141, 4-159, 5-191, 6-192, 7-197, 8-218; బౌలింగ్: ఆకాశ్ 3-0-35-1, తుషార్ దేశ్‌పాండే 4-0-45-3, తీక్షణ 4-0-41-1, జడేజా 4-0-37-0, మతీశ పథిరన 4-0-42-2, మొయిన్ అలీ 1-0-13-1.