IPL 2023: హైదరాబాద్ ముందు ఓ మోస్తరు లక్ష్యం.. మూడో విజయం ఖాయమేనా?
ABN , First Publish Date - 2023-04-24T21:32:13+05:30 IST
వరుస పరాజయాలతో కునారిల్లిన ఢిల్లీ కేపిటల్స్ (DC) జట్టు మరోమారు తేలిపోయింది.
హైదరాబాద్: వరుస పరాజయాలతో కునారిల్లిన ఢిల్లీ కేపిటల్స్ (DC) జట్టు మరోమారు తేలిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో ఇక్కడి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన ఆ జట్టు ఏదో దశలోనూ కోలుకోలేకపోయింది.
62 పరుగులకే ఫిలిఫ్ సాల్ట్ (0), మిచెల్ మార్ష్ (25), డేవిడ్ వార్నర్ (21), సర్ఫరాజ్ ఖాన్ (10), అమన్ హకీంఖాన్ (4) వికెట్లు కోల్పోయిన జట్టుకు మనీష్ పాండే (Manish Pandey), అక్షర్ పటేల్ (Axar Patel) ఆపద్బాంధవుల్లా మారారు. ఇద్దరూ నిలకడగా ఆడుతూ నిదానంగా స్కోరును ముందుకు కదిలించారు. చెరో 34 పరుగులు చేసి జట్టు గౌరవ ప్రదమైన స్కోరు సాధించడంలో సాయపడ్డారు. లేదంటే ఢిల్లీ 100 పరుగుల లోపే కుప్పకూలేది.
జట్టులో ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. హైదరాబాద్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ తన పదునైన బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తించి మూడు వికెట్లు తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. 145 పరుగుల ఓ మాదిరి లక్ష్యాన్ని ఢిల్లీ ఎలా కాపాడుకుంటుంటో చూడాలి. ఈ మ్యాచ్‌లో కనుక హైదరాబాద్ విజయం సాధిస్తే మూడో విజయం సొంతమవుతుంది. సొంత మైదానం, సొంత ప్రేక్షకుల మధ్య బౌలింగులో చెలరేగిన హైదరాబాద్.. బ్యాటింగులోనూ సత్తా చాటితే విజయం నల్లేరు మీద నడకే అవుతుంది.