IPL 2023: పాపం కోల్‌కతా.. పంజాబ్‌దే గెలుపు.. ఎలాగంటే?

ABN , First Publish Date - 2023-04-01T20:06:22+05:30 IST

ఐపీఎల్ 2023లో రెండో రోజే డక్‌వర్త్ లూయిస్ అనివార్యమైంది. మొహాలీలో పంజాబ్

IPL 2023: పాపం కోల్‌కతా.. పంజాబ్‌దే గెలుపు.. ఎలాగంటే?

మొహాలీ: ఐపీఎల్ 2023లో రెండో రోజే డక్‌వర్త్ లూయిస్ అనివార్యమైంది. మొహాలీలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)-కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మధ్య జరిగిన ఐపీఎల్ రెండో మ్యాచ్‌కే వరుణుడు వచ్చేశాడు. మరో నాలుగు ఓవర్లు పడితే మ్యాచ్ ముగిస్తుందనగా వచ్చేసిన వర్షం ఆటను ఆపేసింది. అప్పటికి కోల్‌కతా విజయానికి 46 పరుగుల దూరంలో ఉంది. ఇంకా 24 బంతులు ఉండగా చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. కాబట్టి విజయంపై కోల్‌కతా నమ్మకంగా ఉంది. అలాంటి సమయంలో కురిసిన వర్షం కేకేఆర్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. చాలా సేపు ఎదురుచూసినప్పటికీ ఫలితం లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ విధానంలో పంజాబ్ జట్టును విజేతగా ప్రకటించారు. ఫలితంగా ఈ సీజన్‌లో డక్‌వర్త్ లూయిస్ విధానంలో గెలిచిన తొలి జట్టుగా పంజాబ్ రికార్డులకెక్కింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భానుక రాజపక్స అర్ధ సెంచరీ (50)తో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ శిఖర్ ధావన్ 40 పరుగులు చేశాడు. అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కేకేఆర్ ఒకానొక దశలో 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, వెంకటేశ్ అయ్యర్ (34), కెప్టెన్ నితీశ్ రాణా (24), ఆండ్రూ రసెల్ (35) కాసేపు క్రీజులో కుదురుకుని బ్యాట్లు ఝళిపించి కేకేఆర్ అభిమానుల్లో ఆశలు నింపారు. విజయానికి 24 బంతుల్లో 46 పరుగులు చేయాల్సిన తరుణంలో వర్షం పడడంతో మ్యాచ్‌ను నిలపివేశారు. క్రీజులో శార్దూల్ ఠాకూర్ (8), సునీల్ నరైన్ (7) ఉండడంతో విజయంపై కేకేఆర్ ధీమాగా ఉన్నప్పటికీ ఆ జట్టుపై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. దీంతో 7 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించినట్టు ప్రకటించారు.

Updated Date - 2023-04-01T20:28:24+05:30 IST