Second Test Ind vs Aus : టాపార్డర్‌ మురిపించేనా?

ABN , First Publish Date - 2023-02-17T01:12:19+05:30 IST

రెండో టెస్టు కోసం బుధవారం జరిగిన నెట్‌ సెషన్‌లో విరాట్‌ కోహ్లీ, చటేశ్వర్‌ పుజార తీవ్రంగా చెమటోడ్చారు. మిగతా ఆటగాళ్లకన్నా ముందే వచ్చి వారి తర్వాతే తమ సాధనను

 Second Test Ind vs Aus : టాపార్డర్‌ మురిపించేనా?

ఉదయం 9.30 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో...

మరో విజయంపై భారత్‌ దృష్టి

ఒత్తిడిలో ఆస్ట్రేలియా

పుజార@100

నేటినుంచి రెండో టెస్టు

తొలి టెస్టు విజయంలో భారత టాపార్డర్‌ పాత్ర నామమాత్రంగానైనా లేకపోయింది. కెప్టెన్‌ రోహిత్‌ ఒక్కడే మొక్కవోని పట్టుదలతో క్రీజులో నిలిచి శతకం సాధించాడు. స్టార్‌ బ్యాటర్స్‌ రాహుల్‌, విరాట్‌, పుజార మూకుమ్మడిగా విఫలమయ్యారు. అయినా స్పిన్నర్ల ప్రతిభతో రెండున్నర రోజుల్లోనే ఆ టెస్టు ముగిసింది. అందుకే ఆసీ్‌సతో రెండో టెస్టులో అందరి దృష్టీ ఆ త్రయంపైనే ఉంది. పైగా పుజారాకిది కెరీర్‌లో వందో టెస్టు. వీరంతా తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో రాణించి జట్టు మరో విజయంలో పాలుపంచుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

న్యూఢిల్లీ: రెండో టెస్టు కోసం బుధవారం జరిగిన నెట్‌ సెషన్‌లో విరాట్‌ కోహ్లీ, చటేశ్వర్‌ పుజార తీవ్రంగా చెమటోడ్చారు. మిగతా ఆటగాళ్లకన్నా ముందే వచ్చి వారి తర్వాతే తమ సాధనను ముగించారు. ముఖ్యంగా స్పిన్నర్లతో ఎక్కువగా బంతులు వేయించుకుని తమ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తొలి టెస్టు వైఫల్యం వారిలో కసిని నింపిందనేందుకు ఈ ప్రాక్టీస్‌ ఉదాహరణగా చెప్పవచ్చు. అరుణ్‌ జైట్లీ మైదానంలో శుక్రవారం నుంచి ఆసీ్‌సతో రెండో టెస్టు జరుగనుంది. కీలక ఆటగాళ్ల వైఫల్యంతో ఓవైపు ఆందోళన నెలకొన్నా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగనుంది. ఎందుకంటే నాగ్‌పూర్‌లో కొట్టిన చావుదెబ్బ నుంచి ఇప్పట్లో ఆసీస్‌ తేరుకోవడం కష్టమే. అటు 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో పుజార అత్యంత కీలక మ్యాచ్‌ ఆడబోతున్నాడు. నయా వాల్‌గా పిలిపించుకున్న తన నుంచి ఈ వందో టెస్టులోనైనా మునుపటి ఆటతీరు కనబడాలని ఆశిద్దాం. మరోవైపు ఆసీస్‌ మాత్రం ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలనే కృత నిశ్చయంతో ఉంది. ఇందుకు తుది జట్టులోనూ మార్పులుండే అవకాశం ఉంది. అలాగే 2013 తర్వాత ఇరు జట్లు ఇక్కడ ఆడబోతున్నాయి. ఢిల్లీలో ఆసీ్‌సకిది ఎనిమిదో టెస్టు కాగా భారత్‌లో ఈ జట్టు ఎక్కువగా ఆడింది ఈ మైదానంలోనే కావడం విశేషం. ఇందులో ఒక్క టెస్టు (1959/60)లో మాత్రమే గెలిచింది.

రాహుల్‌ ఈసారైనా?

వరుసగా విఫలమవుతున్నా రాహుల్‌కు ఎలా అవకాశాలు ఇస్తున్నారంటూ ఇప్పటికే సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిభావంతులైన ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అతడినే కొనసాగించడమెందుకని ప్రశ్నిస్తున్నారు. ఓపెనింగ్‌ స్థానంలో గిల్‌ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న రాహుల్‌కు ఈ మ్యాచ్‌ లిట్మస్‌ టెస్టు లాంటిదే. మరోసారి విఫలమైతే చివరి రెండు టెస్టుల కోసం ప్రకటించే జట్టులో అతడి పేరు గల్లంతైనా ఆశ్చర్యం లేదు. ఇక శ్రేయాస్‌ ఫిట్‌గా ఉన్నట్టు ప్రకటించడంతో తుది జట్టులో ఉంటాడా? లేక సూర్యకుమార్‌కే మరో చాన్స్‌ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. నెల రోజులుగా అయ్యర్‌ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ పరిస్థితిలో నేరుగా టెస్టులో ఆడించడం రిస్క్‌ అవుతుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అలాగే సొంత గడ్డపై విరాట్‌ చెలరేగాలనే కసితో ఉన్నాడు. జడేజా, అశ్విన్‌, అక్షర్‌ బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటర్లుగానూ ఆకట్టుకోవడం జట్టుకు బలంగా మారింది.

సమష్ఠిగా రాణిస్తేనే..: బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమై తొలి టెస్టులో ఆసీస్‌ కంగారెత్తిపోయింది. వీలైనంత త్వరగా ఆ ఇన్నింగ్స్‌ ఓటమిని మర్చిపోవాలనుకుంటోంది. ముఖ్యంగా డేవిడ్‌ వార్నర్‌ ఈ ఫార్మాట్‌లో ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. అతడి పేలవ ఫామ్‌ జట్టును ఆందోళనలో పడేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో షమి బంతికి అతడి ఆఫ్‌ స్టంప్‌ అల్లంత దూరాన పడడం గుర్తుండే ఉంటుంది. లబుషేన్‌, స్మిత్‌ నుంచి మాత్రమే పోరాటం కనిపించింది. అదనంగా లెఫ్టామ్‌ స్పిన్నర్‌ మ్యాట్‌ కునేమన్‌ను జట్టులో చేర్చారు. మర్ఫీ సూపర్‌ షో తర్వాత మ్యాట్‌ను కూడా తుది జట్టులో చేర్చే చాన్స్‌ ఉంది. పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌, ఆల్‌రౌండర్‌ గ్రీన్‌ల ఫిట్‌నె్‌సపై సందేహాలున్నాయి. స్టార్క్‌ ఫిట్‌గా ఉంటే బోలాండ్‌ స్థానంలో ఆడే అవకాశం ఉంది. ఈ పిచ్‌ కూడా స్పిన్‌కు అనుకూలించనుండడంతో భారత్‌ మాదిరే ముగ్గురు స్పిన్నర్లను ఆడించవచ్చు.

పుజారకు సత్కారం

కెరీర్‌లో వందో టెస్టు ఆడబోతున్న చటేశ్వర్‌ పుజారను ఢిల్లీ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) ఘనంగా సత్కరించనుంది. శుక్రవారం తొలి రోజు మ్యాచ్‌ ఆరంభానికి ముందు పుజారకు మెమొంటోను బహూకరించనున్నారు. ఇందులో డీడీసీఏ అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ, ఇతర ఆఫీస్‌ బేరర్లు పాల్గొననున్నారు. మరోవైపు బీసీసీఐ కూడా విడిగా అతడిని సత్కరించనుంది. 2010లో అరంగేట్రం చేసిన పుజార.. ద్రవిడ్‌ తర్వాత నెంబర్‌ 3 స్థానంలో జట్టుకు అద్భుత విజయాలనందించాడు. అలాగే భారత జట్టుకు డబ్ల్యూటీసీ టైటిల్‌ అందించడమే తన లక్ష్యంగా పుజార తెలిపాడు.

టెస్టుల్లో 250 వికెట్లు సాధించేందుకు జడేజా మరో వికెట్‌ దూరంలో ఉన్నాడు.

ఒకే ప్రత్యర్థిపై ఎక్కువ టెస్టు వికెట్లు (ఆసీ్‌సపై 97) తీసిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్‌. కుంబ్లే (111) ముందున్నాడు.

1987 నుంచి ఢిల్లీలో భారత జట్టు టెస్టు ఓడిపోలేదు.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, పుజార, కోహ్లీ, శ్రేయా్‌స/సూర్యకుమార్‌, జడేజా, భరత్‌, అశ్విన్‌, అక్షర్‌, షమి, సిరాజ్‌.

ఆస్ట్రేలియా: వార్నర్‌, ఖవాజా, లబుషేన్‌, స్మిత్‌, హెడ్‌, హ్యాండ్స్‌కోంబ్‌/గ్రీన్‌, క్యారీ, కమిన్స్‌ (కెప్టెన్‌), బోలాండ్‌/స్టార్క్‌, మర్ఫీ, లియోన్‌.

కోట్లా ట్రాక్‌ మరింత పొడిగా కనిపిస్తోంది. దీంతో తొలి రోజు నుంచే వికెట్‌ స్పిన్‌కు అనుకూలించనుంది.

Cummins.jpg

ఇక్కడి పిచ్‌లు విభిన్నం

ఆసీ్‌సలో మేం ఎక్కువగా బౌన్సీ పిచ్‌లపై ఆడుతుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. పిచ్‌పై బంతి తక్కువ బౌన్స్‌లో వస్తుంది. క్యాచ్‌ల విషయంలోనూ ఇబ్బంది ఎదురైంది. వీలైనంత త్వరగా ఈ పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంది. ఇక ఢిల్లీ పిచ్‌ నల్ల మట్టితో తయారైంది. ఇది కూడా స్పిన్‌కు అనుకూలంగా ఉండనుంది. మూడో స్పిన్నర్‌ను ఆడించాలనుకుంటే ఏగర్‌, కునేమన్‌లలో ఒకరిని ఎంచుకోవాలి.

ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌

Updated Date - 2023-02-17T06:59:30+05:30 IST