Duleep Trophy : జూన్ 28 నుంచి దులీప్ ట్రోఫీ
ABN , First Publish Date - 2023-04-11T02:54:43+05:30 IST
ఈసారి దేశవాళీ (2023-24) సీజన్ జూన్ 28 నుంచి జరిగే దులీప్ ట్రోఫీతో ప్రారంభం కానుంది. అలాగే రంజీ ట్రోఫీ వచ్చే ఏడాది జనవరి ఐదు నుంచి జరగనుంది. ఈమేరకు ఆదివారం వర్చువల్‌గా జరిగిన బీసీసీఐ ..
జనవరి 5 నుంచి రంజీ ట్రోఫీ
బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం
న్యూఢిల్లీ: ఈసారి దేశవాళీ (2023-24) సీజన్ జూన్ 28 నుంచి జరిగే దులీప్ ట్రోఫీతో ప్రారంభం కానుంది. అలాగే రంజీ ట్రోఫీ వచ్చే ఏడాది జనవరి ఐదు నుంచి జరగనుంది. ఈమేరకు ఆదివారం వర్చువల్‌గా జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకుంది. దులీప్ ట్రోఫీ అనంతరం వరుసగా దేవధర్ ట్రోఫీ (జూలై 24-ఆగస్టు 3), ఇరానీ కప్ (అక్టోబరు 1-5), సయ్యద్ ముస్తాక్ అలీ (అక్టోబరు 16-నవంబరు 6), విజయ్ హజారే (నవంబరు 23-డిసెంబరు 15) టోర్నీలు జరగనున్నాయి. జనవరి ఐదున మొదలయ్యే రంజీ ట్రోఫీ గ్రూప్ దశ ఫిబ్రవరి 19న ముగియనుంది. నాకౌట్ దశను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు నిర్వహించనున్నారు. మహిళల టోర్నీలు అక్టోబరు 19న ప్రారంభం కానున్నాయి. ఇక..స్వదేశంలో జరిగే అంతర్జాతీయ, జాతీయ మ్యాచ్‌ల మీడియా హక్కులు (2023-27)కు వేలం అంశం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రధాన ఎజెండాలో ఉన్నా..దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనట్టు తెలిసింది. స్టార్, సోనీతోపాటు ఈసారి వయాకామ్ ఈ హక్కులకోసం పోటీపడుతోంది.
ఆఫీసు బేరర్ల అలవెన్సులుగా భారీగా..: విదేశాలలో పర్యటించే బీసీసీఐ ఆఫీసు బేరర్లకు రోజుకు రూ. 82 వేలు అలవెన్సుగా చెల్లించనున్నారు. గత ఏడాది అక్టోబరు నుంచి కొత్త అలవెన్సులు అమలులోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆ పర్యటనలకు ఫస్ట్‌క్లాస్ విమానం టిక్కెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఐపీఎల్ చైర్మన్‌కు కూడా ఆఫీసు బేరర్ స్థాయి అలవెన్సులు చెల్లించనున్నారు. ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ఇద్దరు ప్రతినిధులు సహా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు..మూడు నెలలకోసారి జరిగే కౌన్సిల్ సమావేశాల సందర్భంగా రోజుకు రూ. 40 వేలు చెల్లిస్తారు. విదేశీ పర్యటనల సమయంలో రోజుకు రూ. 41 వేలు అలవెన్సుగా అందుకోనున్నారు. క్రికెట్ సలహా కమిటీ ముగ్గురు సభ్యులు ఒక్కొక్కరికీ ఒక్కో సమావేశానికి రూ.3.50 లక్షలు చెల్లించనున్నారు.