Duthy Ban: డోప్ టెస్ట్‌లో విఫలం ద్యూతీపై నాలుగేళ్ల నిషేధం
ABN , First Publish Date - 2023-08-19T03:22:39+05:30 IST
భారత స్టార్ స్ర్పింటర్ ద్యూతీచంద్ డోప్ టెస్ట్‌లో విఫలమైంది. ఫలితంగా ఆమెపై ఏకంగా నాలుగేళ్లు నిషేధం పడింది. పోటీలులేని సమయంలో నిర్వహించిన రెండు డోప్ పరీక్షల్లో ఆమె విఫలమవడంతో..జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ద్యూతీపై వేటువేస్తూ శుక్రవారం నిర్ణయం ప్రకటించింది.
న్యూఢిల్లీ: భారత స్టార్ స్ర్పింటర్ ద్యూతీచంద్ డోప్ టెస్ట్‌లో విఫలమైంది. ఫలితంగా ఆమెపై ఏకంగా నాలుగేళ్లు నిషేధం పడింది. పోటీలులేని సమయంలో నిర్వహించిన రెండు డోప్ పరీక్షల్లో ఆమె విఫలమవడంతో..జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ద్యూతీపై వేటువేస్తూ శుక్రవారం నిర్ణయం ప్రకటించింది. 100 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు (11.17 సెకన్లు) నెలకొల్పిన 27 ఏళ్ల ద్యూతీపై నిషేధం ఈ ఏడాది జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమైందని జాతీయ డోపింగ్ నిరోధక క్రమశిక్షణ ప్యానెల్ (ఎడీడీపీ) తెలిపింది. అంటే 2027 జనవరి వరకు ఆమెపై నిషేధం ఉంటుంది. నిరుడు డిసెంబరు 5, 26 తేదీల్లో భువనేశ్వర్‌లో ద్యూతీ నుంచి సేకరించిన నమూనాల్లో నిషేధిత ఉత్ర్పేరకాలు అండారిన్, ఓస్టారిన్, లిగన్‌డ్రోల్ ఉన్నట్టు తేలింది. అయితే, మొదటి నమూనాల ఫలితాలు వెలువడిన వారం రోజుల్లోపు ‘బి’ శాంపిల్ ఇవ్వాల్సి ఉన్నా ద్యూతీ ఆ పని చేయలేదు. దీంతో ఆమెపై వేటు పడింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 5, 2022 తర్వాత ద్యూతీ పాల్గొన్న టోర్నీల్లో ఆమె సాధించిన ఫలితాలను డిస్‌క్వాలిఫై చేశారు. కాగా, నిషేధంపై అప్పీలు చేసుకొనేందుకు ద్యూతీకి ఏడీడీపీ ప్యానెల్ మూడు వారాలు గడువిచ్చింది. ప్రత్యేక అనుమతితో హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతోన్న ద్యూతీ గజ్జల్లో నొప్పితో బాధపడుతోందనీ.. ఆ నొప్పి నివారణ చర్యల్లో భాగంగా సదరు మందులు వాడిందని ఆమె ఫిజియోథెరపిస్టు వివరించారని నాడా ప్యానెల్ పేర్కొంది.
అప్పీలుకు స్టార్ స్ర్పింటర్
తనపై విధించిన నిషేధాన్ని సవాలు చేయాలని ద్యూతీ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె న్యాయవాది పార్థ్ గోస్వామి వెల్లడించారు. ద్యూతీ తన కెరీర్ ఆసాంతం నిజాయతీగా ఉందని, డోప్ పరీక్షలో దొరికిన ఉత్ర్పేరకాలను ఆమె ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదన్నారు.
క్యాన్సర్ బారిన..
ఓవైపు డోప్ టెస్టులో విఫలమై నిషేధానికి గురైన ద్యూతీచంద్.. ఇదివరకే క్యాన్సర్ బారిన పడిందన్న విషయం వెలుగులోకి రావడం అథ్లెటిక్స్ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లలో క్వాలిఫికేషన్ రేస్‌ల స్థాయిలోనే నిష్క్రమించిన కొద్దిరోజులకే ద్యూతీకి క్యాన్సర్ విషయం వెల్లడైంది. తనకు క్యాన్సర్ తొలి దశలో ఉన్నట్టు 2021 నవంబరులో తేలిందని ద్యూతీ వెల్లడించింది. ‘టోక్యో ఒలింపిక్స్ ముందు జరిగిన జాతీయ అంతర్ రాష్ట్ర చాంపియన్‌షి్‌ప సందర్భంగా గజ్జల్లో నొప్పి మొదలైంది. దాంతో డాక్టర్లను సంప్రదించినా నొప్పి తగ్గలేదు. అలాగే ఒలింపిక్స్ (2021 జూలై-ఆగస్టు) వెళ్లా. ఆ పోటీల నుంచి వచ్చాక కొన్నిరోజులకు నొప్పి తీవ్రమైంది. భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా. సుదీప్ సత్పతి.. నవంబరులో ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారు. తొలి దశ క్యాన్సర్ ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. తక్షణమే క్రీడా రంగాన్ని వదలాలని లేదంటే ఆ మహమ్మారి తీవ్రమవుతుందని కూడా హెచ్చరించారు’ అని ద్యూతీ వివరించింది. గజ్జ ప్రాంతంలో తనకు క్యాన్సర్ సోకినట్టు ద్యూతీ తెలిపింది. ‘నాకు టెస్టోస్టెరోన్ హార్మోన్ల అసమతుల్యం ఉంది. అందువల్ల అక్కడే క్యాన్సర్ ప్రారంభమై ఉంటుంది. మందులు తీసుకున్నాక నొప్పి నయమై కోలుకున్నా. దాంతో ఆపై మళ్లీ ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదు. తర్వాత నాడాకు నమూనాలు ఇచ్చా. అందుకే పాజిటివ్ వచ్చిందేమో’ అని ద్యూతీచంద్ వివరించింది.