India vs Aussies ODI series : ఆఖరి సన్నాహకం
ABN , First Publish Date - 2023-09-22T03:21:47+05:30 IST
న్డే వరల్డ్‌కప్‌నకు రెండు వారాల సమయం కూడా లేదు. ఈనేపథ్యంలో ఆఖరి సన్నాహకంగా భారత క్రికెట్ జట్టు పటిష్ఠ ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. ఇరు జట్లలోనూ అద్భుత ఆటగాళ్లకు కొదువలేదు. తమ అస్త్రశస్త్రాలను
నేటి నుంచి ఆసీస్‌తో భారత్ వన్డే సిరీస్
స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి
మ. 1.30 నుంచి స్పోర్ట్స్ 18లో..
మొహాలీ: వన్డే వరల్డ్‌కప్‌నకు రెండు వారాల సమయం కూడా లేదు. ఈనేపథ్యంలో ఆఖరి సన్నాహకంగా భారత క్రికెట్ జట్టు పటిష్ఠ ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. ఇరు జట్లలోనూ అద్భుత ఆటగాళ్లకు కొదువలేదు. తమ అస్త్రశస్త్రాలను సరిచూసుకునేందుకు ఈ మూడు వన్డేల సిరీస్ చక్కటి అవకాశం కానుంది. ఎందుకంటే మెగా టోర్నీకి ముందు భారత్‌కు మిగిలిన మ్యాచ్‌లు ఇవి మాత్రమే. తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో విరాట్, రోహిత్, హార్దిక్, కుల్దీప్ లేకుండానే ఆడబోతోంది. జట్టును కేఎల్ రాహుల్ నడిపిస్తున్నాడు. జట్టు ఎదుర్కొంటున్న పలు ప్రశ్నలకు కూడా ఈ సిరీ్‌సలో సమాధానం లభించాల్సి ఉంటుంది. రాహుల్ నిలకడ కొనసాగుతుందా? సూర్యకుమార్ వన్డే ఫామ్‌ను అందుకుంటాడా? జడేజా పరుగుల కొరత తీరుతుందా? శ్రేయాస్ అయ్యర్ అంచనాలను అందుకుంటాడా? తేలాల్సిందే. రాహుల్ కెపెన్సీలో భారత జట్టు ఇప్పటిదాకా ఆడిన ఏడు వన్డేల్లో.. నాలుగు గెలిచి మూడు ఓడింది. అటు ఆసీస్ మూడు నెలల సుదీర్ఘ పర్యటనకు భారత్‌లో అడుగుపెట్టింది. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు మెగా టోర్నీకి ముందు ఈ సిరీస్ వారికి దోహదపడుతుంది. దీనికి ముందు దక్షిణాఫ్రికాతో 2-3తో సిరీస్ కోల్పోగా.. కమిన్స్, స్మిత్, స్టార్క్, మ్యాక్స్‌వెల్ జట్టులోకి రావడం బలాన్నిస్తోంది. అలాగే ఈ మైదానంలో ఆడిన ఏడు వన్డేల్లో ఆసీస్ ఆరింట్లో గెలిచింది.
కూర్పు ఎలా?: రోహిత్ లేకపోవడంతో శుభ్‌మన్ గిల్‌కు జతగా ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జట్టులో రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నాడు. తనకు ఇటీవలి కాలంలో పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండాపోయింది. ఆసియాగేమ్స్‌లో తలపడే భారత జట్టుకు అతడే కెప్టెన్. తనకు తుది జట్టులో చోటు కల్పించాలంటే గిల్, ఇషాన్‌లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. ఇక సూర్యకుమార్ వన్డేల్లో పెద్దగా రాణించలేకపోతున్నా అతడి శక్తిసామర్థ్యాలపై సెలెక్టర్లకు నమ్మకం ఉంది. ఈ సిరీ్‌సలో తను అంచనాలను అందుకుంటే వరల్డ్‌కప్ ముందు జట్టుకు అతిపెద్ద ప్రయోజనం కానుంది. గాయం కారణంగా శ్రేయాస్ ఆసియాక్‌పలో పెద్దగా ఆడలేకపోయాడు. తన మ్యాచ్ ఫిట్‌నెస్ ఏపాటిదో ఈ సిరీస్ ద్వారా తేల్చనున్నాడు. పేస్ బాధ్యతలను బుమ్రా, సిరాజ్, షమి తీసుకోనున్నారు. ఒకవేళ సిరాజ్‌కు రెస్ట్ ఇస్తే శార్దూల్ ఆడతాడు. హార్దిక్ లేకపోవడంతో ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా, సుందర్‌లకు చోటు దక్కవచ్చు. సుందర్‌ను ఆడిస్తే తిలక్ వర్మకు బెర్తు దొరకదు.
మ్యాక్స్, స్టార్క్ దూరం: భారత్‌తో జరిగే తొలి వన్డేకు ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు పేసర్ మిచెల్ స్టార్క్ దూరం కానున్నారు. గాయంతో దక్షిణాఫ్రికా సిరీ్‌సకు కూడా దూరమైన మ్యాక్స్‌కు ముందు జాగ్రత్తగా విశ్రాంతి కల్పించారు. ఇక కెప్టెన్ కమిన్స్ గతేడాది నవంబరు నుంచి వన్డే మ్యాచ్ ఆడలేదు. తను ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. అలాగే స్టీవ్ స్మిత్ కూడా ఫిట్‌గా ఉన్నట్టు చెప్పాడు. మిడిలార్డర్‌లో లబుషేన్, క్యారీ కీలకం కానున్నారు. ట్రావిస్ హెడ్ దూరం కావడంతో ఓపెనర్లుగా వార్నర్, మిచెల్ మార్ష్ రానున్నారు. పేసర్ స్టార్క్ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ అరంగేట్రం చేయవచ్చు.
జట్లు (అంచనా)
భారత్: ఇషాన్, గిల్, శ్రేయాస్, సూర్యకుమార్, రాహుల్ (కెప్టెన్), జడేజా, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, షమి, సిరాజ్/శార్దూల్, బుమ్రా.
ఆస్ర్టేలియా: వార్నర్, మార్ష్, స్మిత్, లబుషేన్, క్యారీ, గ్రీన్, స్టొయినిస్, కమిన్స్ (కెప్టెన్), జాన్సన్, జంపా, హాజెల్‌వుడ్.
పిచ్, వాతావరణం
నాలుగేళ్లుగా మొహాలీలో వన్డే మ్యాచ్ జరగలేదు. ఆ చివరి వన్డేలో ఆసీస్ జట్టు భారత్‌పై 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. నేటి మ్యాచ్‌కు కూడా ఫ్లాట్ పిచ్ ఎదురుకానుంది. ఇక్కడ చివరి ఐదు వన్డేల్లో పేసర్లు 43 వికెట్లు తీశారు. వర్షం నుంచి ముప్పు లేదు.