IPL Gujarat-Chennai match: ఫైనల్‌ నేటికి వాయిదా

ABN , First Publish Date - 2023-05-29T04:13:37+05:30 IST

కోట్లాది క్రికెట్‌ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌–గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సోమవారానికి వాయిదా పడింది.

IPL Gujarat-Chennai match:  ఫైనల్‌ నేటికి వాయిదా

ఐపీఎల్‌లో గుజరాత్‌–చెన్నై పోరుకు వర్ష తాకిడి

అహ్మదాబాద్‌: కోట్లాది క్రికెట్‌ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌–గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సోమవారానికి వాయిదా పడింది. టాస్‌ వేయడానికి ముందు నుంచే ఎడతెరిపిలేకుండా భారీ వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మైదానం నీటి మడుగును తలపించింది. రాత్రి 9 గంటలకు కొద్ది సమయం పాటు వర్షం ఆగినా తిరిగి ఆరంభమైంది. అంతకంతకూ వర్షం ఉధృతి పెరిగిందే కానీ తగ్గకపోవడంతో పూర్తి ఓవర్ల ఆట కోసం పేర్కొన్న కటాఫ్‌ టైమ్‌ 9.35 కూడా దాటిపోయింది. అయినా వేలాదిమంది ప్రేక్షకులు మైదానం వీడకుండా ఓపిగ్గా అక్కడే నిరీక్షించడం కనిపించింది.

కేవలం ఐదు ఓవర్ల ఆటను ఆడించేందుకు అర్ధరాత్రి 12.06 వరకు సమయం ఉండగా.. ఎట్టకేలకు రాత్రి 11 గంటలకు వర్షం తగ్గింది. దీంతో అంపైర్లు మైదానాన్ని పరీక్షించారు. కానీ మ్యాచ్‌ను జరిపించేందుకు స్టేడియాన్ని సిద్ధం చేయాలంటే చివరి కటాఫ్‌ సమయం కూడా దాటే పరిస్థితి కనిపించింది. చేసేదేమీ లేక అంపైర్లు, మ్యాచ్‌ రెఫరీ శ్రీనాథ్‌ విషయాన్ని ఇరుజట్ల కోచ్‌లు ఫ్లెమింగ్‌, నెహ్రాలకు వివరించారు. అందరి అంగీకారంతో రిజర్వ్‌డే సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇక సోమవారం రాత్రి 7.30 నుంచి పూర్తి మ్యాచ్‌ జరుగుతుంది.

AHMEDABAD.gif

ఆట ఆగినా..:

ఫైనల్‌ మ్యాచ్‌ వర్షంతో సోమవారానికి వాయిదా పడడంతో స్టేడియానికి పోటెత్తిన ఫ్యాన్స్‌ డీలా పడినా..అంతకుముందు జరిగిన ముగింపు కార్యక్రమాలు మాత్రం వారిని ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా ర్యాపర్‌ కింగ్‌, డీజే నూక్లియా తన మ్యూజిక్‌, పాటలతో అభిమానుల్లో హుషారెత్తించాడు. చెన్నై, గుజరాత్‌ జెర్సీలు ధరించి, ఆ జట్ల జెండాలు ఊపుతూ అభిమానులు నూక్లియా సంగీతానికి అనుగుణంగా స్టెప్పులు వేశారు.

Updated Date - 2023-05-29T04:13:37+05:30 IST