Hockey World Cup: పతకమే లక్ష్యం

ABN , First Publish Date - 2023-01-13T02:37:07+05:30 IST

ప్రపంచ కప్‌ను మనం వరుసగా రెండోసారి నిర్వహిస్తుండడంతో ఈసారి ఎలాగైనా ట్రోఫీని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగుతోంది.

Hockey World Cup: పతకమే లక్ష్యం

హాకీ ప్రపంచ కప్‌

ఆత్మవిశ్వాసంతో టీమిండియా

నేడు స్పెయిన్‌తో తొలి పోరు

రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

హాకీ ఒకప్పుడు భారత క్రీడా రంగానికి పర్యాయపదం.. ఎనిమిదిసార్లు ఒలింపిక్‌ స్వర్ణ పతకాలు సొంతం చేసుకోవడం మన జట్టు సత్తాకు తిరుగులేని నిదర్శనం..కానీ కాలక్రమంలో యూరోపియన్‌ శైలి హాకీ ఆట మొదలయ్యాక ఈ క్రీడలో భారత్‌ వెనుకంజలో నిలిచింది..అయితే ఆ తరహా ఆటకు మనోళ్లు అలవాటుపడడంతో తిరిగి ఈ క్రీడలో టీమిండియాకు గత వైభవం దిశగా అడుగులు పడుతున్నాయి.. ఈక్రమంలోనే టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించింది.. ప్రొ.లీగ్‌ హాకీలోనూ మెరుపులు మెరిపిస్తోంది.. అదే ఊపులో నేటి నుంచి సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ పతకమే లక్ష్యంగా హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని భారత్‌ బరిలోకి దిగుతోంది.. ఒడిశా వేదికగా16 జట్లు తలపడుతున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ తన పోరును స్పెయిన్‌తో ఆరంభించనుంది. ఈనెల 29న ఫైనల్‌ జరగనుంది.

రూర్కెలా: ప్రపంచ కప్‌ను మనం వరుసగా రెండోసారి నిర్వహిస్తుండడంతో ఈసారి ఎలాగైనా ట్రోఫీని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగుతోంది. 48ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పోడియం ఫినిష్‌ చేయాలని పట్టుదలగా ఉన్న హర్మన్‌ప్రీత్‌సింగ్‌ సేన గ్రూప్‌ ‘డి’లో శుక్రవారం ఇక్కడి నూతన బిర్సా ముండా స్టేడియంలో జరిగే తొలి పోరులో పటిష్ట స్పెయిన్‌ను ఎదుర్కొంటోంది. 1971లో జరిగిన మొదటి వరల్డ్‌ కప్‌లో కాంస్యం అందుకున్న మన జట్టు..తదుపరి మరింత మెరుగైన ప్రదర్శనతో 1973 టోర్నీలో రజత పతకంతో భళా అనిపించింది. ఇక అజిత్‌పాల్‌ సింగ్‌ సారథ్యంలో మనోళ్లు 1975లో విశ్వవిజేతలుగా నిలిచి హాకీ ఫ్యాన్స్‌ గర్వపడేలా చేశారు. ఆ తర్వాత భారత జట్టు ఎప్పుడూ మెగా టోర్నీలో కనీసం సెమీ్‌స కూడా చేరకపోవడం గమనార్హం. 1978 నుంచి 2014 వరకు గ్రూప్‌ దశను కూడా దాటలేకపోయింది..

indian-team-hockey.jpg

పతక రేస్‌లో..:

ఈసారి మనోళ్లు కచ్చితంగా పతక రేస్‌లో ఉన్నారని చెప్పాలి. ఇటీవలి కాలంలో హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్సీలో అద్భుత విజయాలు సాధిస్తున్న జట్టు పునర్‌వైభవం దిశగా సాగుతోంది. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత్‌.. బలీయమైన ఆస్ట్రేలియా జట్టుపై ఇటీవల చక్కటి ప్రదర్శన చేసింది. ప్రపంచ కప్‌ ఫేవరెట్లలో ఒకటైన ఆసీ్‌సకు ఆ సిరీ్‌సలో అన్ని విభాగాల్లో దీటుగా నిలిచింది. 2021-22 ప్రొ. లీగ్‌లో మూడో స్థానం దక్కించుకుంది. 2019లో గ్రాహం రీడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక భారత్‌ ఆటతీరు గణనీయంగా మెరుగుపడింది. ప్రపంచ మేటి డ్రాగ్‌ఫ్లికర్‌లలో ఒకడైన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ జట్టుకు కీలకం. గోల్‌కీపర్‌ శ్రీజేష్‌, మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌, హార్దిక్‌ సింగ్‌, స్ట్రయికర్‌ మన్‌దీ్‌ప సింగ్‌, డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌, ఫార్వర్డ్‌ ఆకాశ్‌దీ్‌ప క్షణాల్లో ఆట గతిని మార్చివేయగల ప్లేయర్లు.

యువ స్పెయిన్‌..:

ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ స్పెయిన్‌ యువరక్తంతో ఉరకలేస్తోంది. స్పెయిన్‌ తనదైన రోజున ఎంత గట్టి ప్రత్యర్థినైనా మట్టికరిపించగలదు. 1971, 1998లో రన్నర్‌పగా నిలిచిన జట్టు 2006లో కాంస్య పతకం చేజిక్కించుకుంది. గత అక్టోబరులో భువనేశ్వర్‌లో జరిగిన ఈ సీజన్‌ ప్రొ.లీగ్‌లో తొలి మ్యాచ్‌లో 3-2తో భారత్‌ను ఓడించింది. కానీ రెండో మ్యాచ్‌లో షూటౌట్‌ ద్వారా భారత్‌ గెలుపొందింది. అంతకుముందు ఏడాది ప్రొ.లీగ్‌ రెండో పోటీల్లోనూ ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌ నెగ్గాయి.

ఇదీ టోర్నీ ఫార్మాట్‌..

మొత్తం 16 జట్లు 4 గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. ప్రతి గ్రూపులో టాపర్‌గా నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్స్‌ చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌ల్లో ఢీకొంటాయి. ఆ పోటీల ద్వారా మిగిలిన క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌లను నిర్ధారిస్తారు. ఒడిశా రాష్ట్రం, భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, రూర్కెలాలో కొత్తగా నిర్మించిన బిర్సాముండా స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి.

గ్రూపు-ఎ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌, అర్జెంటీనా,

గ్రూపు-బి బెల్జియం, జపాన్‌, కొరియా, జర్మనీ

గ్రూపు-సి నెదర్లాండ్స్‌, చిలీ, మలేసియా, న్యూజిలాండ్‌

గ్రూపు-డి భారత్‌, వేల్స్‌, స్పెయిన్‌, ఇంగ్లండ్‌

గ్రూపు దశలో భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌

జనవరి 13న స్పెయిన్‌తో

జనవరి 15న ఇంగ్లండ్‌తో

జనవరి 19న వేల్స్‌తో

భారత్‌:

హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్‌), అభిషేక్‌, సురేందర్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌, హార్దిక్‌ సింగ్‌, జర్మన్‌ప్రీత్‌, మన్‌దీ్‌ప, లలిత్‌ ఉపాధ్యాయ్‌, కృష్ణన్‌ పాఠక్‌, నీలమ్‌ సంజీప్‌, శ్రీజేష్‌, నీలకంఠ, షంషేర్‌ సింగ్‌, వరుణ్‌, ఆకాశ్‌దీ్‌ప, అమిత్‌ (వైస్‌ కెప్టెన్‌), వివేక్‌, సుఖ్‌జీత్‌ సింగ్‌.

స్పెయిన్‌:

అల్వరో ఇగ్లేసియస్‌ (కెప్టెన్‌), ఆండ్రియాస్‌, అలెజాండ్రో, సిజార్‌, గిస్పెర్ట్‌, బోర్జా, రోడ్రిగ్వెజ్‌, గొంజాలెజ్‌, గెరార్డ్‌, బాన్‌స్ట్రే, జోక్విన్‌, గారిన్‌, మార్క్‌ రెని, మిరాల్స్‌, పెపె కనిల్‌, రికాన్సెన్‌, పా కనిల్‌, మార్క్‌ విజ్కానియో.

నేటి మ్యాచ్‌లు

అర్జెంటీనా X సౌతాఫ్రికా మధ్యాహ్నం 1 నుంచి

ఆస్ట్రేలియా X ఫ్రాన్స్‌ మధ్యాహ్నం 3 నుంచి

ఇంగ్లండ్‌ X వేల్స్‌ సాయంత్రం 5 నుంచి

భారత్‌ X స్పెయిన్‌ రాత్రి 7 గం. నుంచి

Updated Date - 2023-01-13T02:37:08+05:30 IST