IndiaVsSrilanka: రాణించిన దీపక్ హుడా, అక్షర్ పటేల్.. శ్రీలంకకు మోస్తరు టార్గెట్!
ABN , First Publish Date - 2023-01-03T20:59:45+05:30 IST
భారత్ వర్సెస్ శ్రీలంక (India Vs Srilanka) మధ్య తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముంబై: భారత్ వర్సెస్ శ్రీలంక (India Vs Srilanka) తొలి టీ20లో టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాట్స్‌మెన్లలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో ప్రత్యర్థి శ్రీలంకకు 163 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే భారత్ నిర్దేశించగలింది. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ని దూకుడుగా ఆరంభించాడు. వ్యక్తిగత స్కోరు 37 పరుగుల వద్ద ఔటయ్యాక స్కోరు నెమ్మదించింది. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (7), డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్(7), సంజూశాంసన్(5) రాణించలేకపోయారు. వీరి తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫర్వాలేదనిపించాడు. వ్యక్తిగత స్కోరు 29 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా, అక్షర్ పటేల్ (Dipak Hooda - Axar patel) జోడీ టీమిండియాను ఆదుకుంది.
23 బంతులు ఎదుర్కొన్న దీపక్ హుడా 4 సిక్సర్లు సాయంతో మొత్తం 41 పరుగులు చేశాడు. ఇక అక్షర్ పటేల్ 20 బంతుల్లో 31 పరుగులు బాదాడు. వీరిద్దరూ చివరి వరకు క్రీజులో ఉన్నారు. ఇక శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మదుషంకా, ఎం తీక్షణ, సీ.కరుణరత్నే, ధనంజయ్ డి సిల్వా, హసరంగా తలో వికెట్లు చొప్పున తీశారు.