ODI World Cup: దృష్టంతా వరల్డ్‌కప్ సన్నద్ధతపైనే..
ABN , First Publish Date - 2023-07-27T02:38:59+05:30 IST
టెస్ట్ సిరీస్(Test series)లో జోరు చూపించిన భారత జట్టు(Indian team).. మరో రెండు నెలల్లో స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్‌కప్(ODI World Cup) కోసం సన్నద్ధం కానుంది.
సూర్య, కిషన్, ఉమ్రాన్‌లకు కీలకం
విండీస్‌తో భారత్ తొలి వన్డే నేడు
రాత్రి 7 గంటల నుంచి డీడీ నెట్‌వర్క్, జియో సినిమాల్లో...
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): టెస్ట్ సిరీస్(Test series)లో జోరు చూపించిన భారత జట్టు(
Indian team).. మరో రెండు నెలల్లో స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్‌కప్(ODI World Cup) కోసం సన్నద్ధం కానుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్(West Indies)తో ఈ మూడు వన్డేల సిరీస్ నుంచి టీమిండియా సన్నాహకాలను ఆరంభించనుంది. ఇందులో భాగంగా గురువారం జరిగే తొలి వన్డేలో ఘన విజయమే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగనుంది. అంతేకాకుండా ఆసియాకప్ టీమ్‌ను ఖరారు చేసేందుకు ఒకరకంగా ఈ సిరీస్ ట్రయల్స్ లాంటిది. టీ20ల్లో చెలరేగుతున్నా.. వన్డే ఫార్మాట్‌లో ఘోరంగా విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం. విండీస్‌పై రాణిస్తే తర్వాతి టోర్నీలతోపాటు విశ్వకప్ కోర్ టీమ్‌లో సూర్యకు చోటు పదిలమవుతుంది.
కిషన్‌వైపే రోహిత్?:
ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, యజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ తమ సత్తాను నిరూపించుకోవడానికి ఈ సిరీస్‌లో రాణించడం ఎంతో ముఖ్యం. వికెట్ కీపర్ స్థానం కోసం కిషన్, శాంసన్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నా.. టెస్టు సిరీస్‌లో ఆడిన కిషన్‌వైపే రోహిత్ మొగ్గుచూపే అవకాశం ఉంది. ఓపెనర్లుగా రోహిత్, గిల్ బరిలోకి దిగనుండడంతో రుతురాజ్ గైక్వాడ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఐపీఎల్ తర్వాత హార్దిక్ పాండ్యా తొలిసారి ఆడనుండగా.. చాహల్ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? అన్నట్టుగా వేచి చూస్తున్నాడు. పేస్ విభాగానికి సిరాజ్ నేతృత్వం వహించనుండగా.. యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఇదో చక్కని చాన్స్. మరోవైపు వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించలేక పోయిన విండీస్ తన ప్రయాణాన్ని తాజాగా ఆరంభించాలనుకొంటోంది. హెట్ మయెర్, ఓషేన్ థామస్ రావడంతో జట్టు బలం పెరిగింది. యువ ఆటగాడు అలిక్ అథనజె ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. పెద్దగా ఒత్తిడేమీ లేకపోవడంతో విండీస్ స్వేచ్ఛగా ఆడనుంది. మొత్తంగా చూస్తే టెస్టుల తరహాలో వన్డే సిరీస్ ఏకపక్షంగా సాగే విధంగానైతే కనిపించడం లేదు.
జట్లు (అంచనా)
వెస్టిండీస్:
బ్రండన్ కింగ్, కైల్ మేయర్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రన్ హెట్‌మయెర్, రోవ్‌మన్ పావెల్, షెప్పర్డ్, కెవిన్ సింక్లెయిర్, అల్జరీ జోసెఫ్, గుడకేష్ మొటై/ఓషేన్ థామస్/యాసిక్ కరియాహ్, సీల్స్.
భారత్:
రోహిత్, గిల్, కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్, సంజూ/ఇషాన్, జడేజా, అక్షర్ పటేల్/శార్దూల్, కుల్దీప్ /చాహల్, సిరాజ్, ఉమ్రాన్/ఉనాద్కట్/ముకేష్ కుమార్.
పిచ్/వాతావరణం
కెన్నింగ్‌టన్ ఓవల్ పిచ్ ఎక్కువగా సీమర్లకు అనుకూలించనుంది. గతేడాది ఆగస్టులో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో 190, 212, 301 స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
ఫ్లైటు లేటు..నిద్ర లేదు..
ఇకపై రాత్రి ప్రయాణాలొద్దు
బోర్డుకు ఆటగాళ్ల లేఖ
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ సోమవారం ముగిసింది. కేవలం రెండు రోజుల విరామం తర్వాత గురువారం రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. దాంతో టీమిండియా సోమవారం రాత్రే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ నుంచి తొలి వన్డే వేదిక బార్బడోస్‌కు వెళ్లాల్సి వచ్చింది. రాత్రి 11 గంటలకు బార్బడోస్ విమానం. దాంతో 8.40కే భారత జట్టు హోటల్ నుంచి విమానాశ్రయానికి వచ్చింది. కానీ విమానం ఆలస్యం కావడంతో తెల్లవారుజామున మూడింటికి రోహిత్ సేన పోర్ట్ ఆఫ్ స్పెయిన్ నుంచి బయలుదేరి ఉదయం ఐదు గంటలకు బార్బడోస్ చేరింది. విమానం ఆలస్యం దరిమిలా పలు గంటలపాటు జట్టు మొత్తం నిద్ర లేకుండా పోర్టాఫ్ స్పెయిన్ విమానాశ్రయంలో గడపాల్సి వచ్చింది. ఫలితంగా తీవ్ర అలసటకు గురైన జట్టు.. ఇక ఈ సిరీస్‌లో రాత్రిపూట విమాన ప్రయాణాలు షెడ్యూల్ చేయొద్దని బీసీసీఐ లేఖ రాసినట్టు తెలిసింది. దీనికి సానుకూలంగా స్పందించిన బోర్డు..టీమిండియా తదుపరి ప్రయాణ షెడ్యూల్‌ను సవరించేందుకు ప్రయత్నాలు చేపట్టినట్టు సమాచారం.