India second T20: అలవోకగా పట్టేశారు

ABN , First Publish Date - 2023-08-21T04:36:47+05:30 IST

భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 58) అర్ధసెంచరీతో మెరవగా.. ఆసియాకప్‌ జట్టు ఎంపికకు ముందు సంజూ శాంసన్‌ (26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 40) ఆకట్టుకున్నాడు.

India second T20: అలవోకగా పట్టేశారు

2-0తో భారత్‌దే సిరీస్‌

చెలరేగిన రుతురాజ్‌, శాంసన్‌, రింకూ

రెండో టీ20లో ఐర్లాండ్‌ ఓటమి

టీ20ల్లో అత్యంత వేగంగా (33 ఇన్నింగ్స్‌) 50 వికెట్లు తీసిన రెండో పేసర్‌గా అర్ష్‌దీప్‌. ఎన్‌గిడి (32) ముందున్నాడు.

మూడు టీ20ల సిరీస్‌ను గెలవడం భారత్‌కిది వరుసగా పదోసారి

డబ్లిన్‌: భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 58) అర్ధసెంచరీతో మెరవగా.. ఆసియాకప్‌ జట్టు ఎంపికకు ముందు సంజూ శాంసన్‌ (26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 40) ఆకట్టుకున్నాడు. ఇక తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో బ్యాట్‌ చేతపట్టిన రింకూ సింగ్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38) సూపర్‌ ఫినిషింగ్‌తో తనపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసుకున్నాడు. అటు పేసర్‌ బుమ్రా (2/15) మరింత పొదుపుగా బౌలింగ్‌ చేసి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. ఫలితంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత జట్టు 33 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్‌ దక్కించుకుంది. ఆఖరి మ్యాచ్‌ బుధవారం జరుగుతుంది. ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. మెక్‌కార్తికి రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసి ఓడింది. బల్బిర్నీ (51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72) పోరాడాడు. ప్రసిద్ధ్‌, బిష్ణోయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రింకూ సింగ్‌ నిలిచాడు.

బల్బిర్నీ ఒక్కడే..:

ఓ వైపు భారీ ఛేదన కళ్లముందుండగా.. భారత బౌలర్ల ధాటికి ఐర్లాండ్‌ ఆటతీరు అందుకు భిన్నంగా సాగింది. ఓపెనర్‌ బల్బిర్నీ మాత్రం శాయశక్తులా పోరాడినా సహకారం కరువైంది. మూడో ఓవర్‌లోనే స్టిర్లింగ్‌, టక్కర్‌లను పేసర్‌ ప్రసిద్ధ్‌ డకౌట్లుగా పెవిలియన్‌కు చేర్చాడు. టెక్టర్‌ (7)ను బిష్ణోయ్‌ బౌల్డ్‌ చేయడంతో పవర్‌ప్లేలో జట్టు 31/3తో కష్టాల్లో పడింది. ఓవైపు బల్బిర్నీ మాత్రం భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. భారీ షాట్లతో ఆకట్టుకున్న అతడి పోరాటానికి 16వ ఓవర్‌లో అర్ష్‌దీప్‌ తెర దించాడు. దీంతో ఐర్లాండ్‌ ఓటమి లాంఛనమే అయ్యింది. చివర్లో అడెయిర్‌ (16 బంతుల్లో 3 సిక్సర్లతో 23) సిక్సర్లతో చెలరేగి ఓటమి అంతరాన్ని తగ్గించాడు.

ఆఖర్లో జోరు:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో రుతురాజ్‌ సంయమన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఇక తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో బ్యాట్‌ చేతపట్టిన రింకూ సింగ్‌, శివమ్‌ దూబే (22 నాటౌట్‌) బాదుడుకు చివరి రెండు ఓవర్లలో 42 పరుగులు రావడంతో జట్టు భారీ స్కోరందుకుంది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (18) వేగంగా ఆడే క్రమంలో నాలుగో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్‌లోనే తిలక్‌ వర్మ (1) కూడా అవుటై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. ఈ దశలో మరో ఓపెనర్‌ రుతురాజ్‌, శాంసన్‌ జట్టుకు అండగా నిలిచారు. ఎనిమిదో ఓవర్‌లో రుతురాజ్‌ వరుసగా రెండు ఫోర్లు బాదగా.. 11వ ఓవర్‌లో శాంసన్‌ మరింతగా చెలరేగాడు. లిటిల్‌ వేసిన ఈ ఓవర్‌లో అతను 4,4,4,6తో 18 పరుగులు రాబట్టాడు. కానీ స్పిన్నర్‌ వైట్‌ వేసిన అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ బంతిని వికెట్ల మీదికి ఆడి బౌల్డయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 15వ ఓవర్‌లో 4,6తో రుతురాజ్‌ అర్ధసెంచరీ పూర్తయ్యాక అవుటవడంతో స్కోరు నెమ్మదించింది. కానీ 19వ ఓవర్‌లో రింకూ బ్యాట్‌ ఝుళిపిస్తూ 4,6,6తో 22 రన్స్‌ రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో దూబే రెండు సిక్సర్లు, రింకూ ఓ సిక్స్‌తో 20 పరుగులు రావడంతో పటిష్ఠ స్కోరుతో సవాల్‌ విసిరింది.

స్కోరుబోర్డు

భారత్‌:

జైస్వాల్‌ (సి) కాంఫర్‌ (బి) యంగ్‌ 18, రుతురాజ్‌ (సి) టెక్టర్‌ (బి) మెక్‌కార్తి 58, తిలక్‌ (సి) డాక్‌రెల్‌ (బి) మెక్‌కార్తి 1, సంజూ శాంసన్‌ (బి) వైట్‌ 40, రింకూ సింగ్‌ (సి) యంగ్‌ (బి) అడెయిర్‌ 38, శివమ్‌ దూబే (నాటౌట్‌) 22, వాషింగ్టన్‌ సుందర్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 185/5; వికెట్ల పతనం: 1-29, 2-34, 3-105, 4-129, 5-184; బౌలింగ్‌: అడెయిర్‌ 4-0-36-1, లిటిల్‌ 4-0-48-0, మెక్‌కార్తి 4-0-36-2, క్రెగ్‌ యంగ్‌ 4-0-29-1, వైట్‌ 4-0-33-1.

ఐర్లాండ్‌:

బల్‌బిర్నీ (సి) శాంసన్‌ (బి) అర్ష్‌దీప్‌ 72, స్టిర్లింగ్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) ప్రసిద్ధ్‌ 0, టకర్‌ (సి) రుతురాజ్‌ (బి) ప్రసిద్ధ్‌ 0, టెక్టర్‌ (బి) బిష్ణోయ్‌ 7, కాంఫర్‌ (సి) దూబే (బి) బిష్ణోయ్‌ 18, డాక్‌రెల్‌ (రనౌట్‌) 13, అడెయిర్‌ (సి) తిలక్‌ (బి) బుమ్రా 23, మెక్‌కార్తి (సి) బిష్ణోయ్‌ (బి) బుమ్రా 2, యంగ్‌ (నాటౌట్‌) 1, లిటిల్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 20 ఓవర్లలో 152/8; వికెట్ల పతనం: 1-19, 2-19, 3-28, 4-63, 5-115, 6-123, 7-126, 8-148; బౌలింగ్‌: బుమ్రా 4-1-15-2, అర్ష్‌దీప్‌ 4-0-29-1, ప్రసిద్ధ్‌ క్రిష్ణ 4-0-29-2, రవి బిష్ణోయ్‌ 4-0-37-2, వాషింగ్టన్‌ 2-0-19-0, శివమ్‌ దూబే 2-0-18-0.

Updated Date - 2023-08-21T04:36:47+05:30 IST