Mirabai Chanu lifter : అరెరె..మీరా!

ABN , First Publish Date - 2023-10-01T02:53:46+05:30 IST

ఎన్నో ఆశలతో ఆసియా క్రీడల్లోకి అడుగుపెట్టిన భారత స్టార్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆసియా క్రీడల్లో తొలి పతకం లక్ష్యంగా బరిలోకి దిగిన ఆమెకు గాయం

Mirabai Chanu lifter : అరెరె..మీరా!

గాయంతో విఫలం

నాలుగో స్థానంతో సరి

హాంగ్జౌ: ఎన్నో ఆశలతో ఆసియా క్రీడల్లోకి అడుగుపెట్టిన భారత స్టార్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆసియా క్రీడల్లో తొలి పతకం లక్ష్యంగా బరిలోకి దిగిన ఆమెకు గాయం రూపంలో చుక్కెదురైంది. శనివారం జరిగిన 49 కిలోల విభాగంలో ఒలింపిక్‌ రజత పతక విజేత చాను..కండర గాయంతో బరువెత్తలేకపోయింది. దాంతో నాలుగో స్థానంలో నిలిచిన ఆమె పతకానికి దూరమైంది. వామప్‌ సమయంలోనే ఆమె కండరం నొప్పితో బాధపడడంతో..పోటీ నుంచి వైదొలగాలని కోచ్‌ విజయ్‌ శర్మ ఆమెకు సూచించాడు. కానీ దేశానికి పతకం తేవాలన్న పట్టుదలతో తలపడిన ఆమె స్నాచ్‌ తొలి యత్నంలో 83 కిలోల బరువెత్తింది. రెండు, మూడు ప్రయత్నాల్లో 86 కేజీలు ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో తొలి యత్నంలో 108 కి. బరువెత్తింది. రెండో యత్నాన్ని 117 కేజీలకు పెంచుకున్నా ఎత్తలేకపోయింది. మూడో ప్రయత్నంలో బరువెత్తలేక మ్యాట్‌పై పడిపోయింది. అనంతరం మీరా కుంటుతూ స్టేజ్‌ వీడింది. 55 కేజీల కేటగిరీలో బింద్యారాణి దేవి మొత్తం 196 కి. (83కి.+113కి.) బరువెత్తి ఐదో స్థానంలో నిలిచింది.

చెస్‌లో మహిళల జట్టు విజయం: చెస్‌ టీమ్‌ విభాగం రెండో రౌండ్లో భారత మహిళల జట్టు 2.5-1.5తో వియత్నాంపై గెలిచింది. పురుషుల జట్టు 2-2తో ఉజ్బెకిస్థాన్‌ను నిలువరించింది.

కనోయింగ్‌: కనోయింగ్‌ స్ర్పింట్‌ సింగిల్స్‌లో నీరజ్‌తోపాటు డబుల్స్‌లో భారత పురుషులు, మహిళల జోడీలు ఫైనల్‌ చేరాయి.

టీటీ సెమీస్‌లో సుతీర్థ/ఐహిక జోడీ: సుతీర్ఘ ముఖర్జీ/ఐహిక ముఖర్జీ జంట ఆసియా క్రీడల టీటీ మహిళల డబుల్స్‌లో సెమీఫైనల్‌ చేరి చరిత్ర సృష్టించింది. క్వార్టర్‌ఫైనల్లో ముఖర్జీ ద్వయం 3-1తో ప్రపంచ చాంపియన్‌ చైనా జోడీ చెన్‌ మెంగ్‌/ఇది వాంగ్‌కు షాకిచ్చింది. తద్వారా మహిళల డబుల్స్‌లో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖరారు చేసింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో మనికా బాత్ర, పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో మానవ్‌ ఠక్కర్‌/మానుష్‌ షా ద్వయం ప్రత్యర్థుల చేతిలో ఓడారు.

బాస్కెట్‌బాల్‌లో క్వార్టర్స్‌కు: బాస్కెట్‌బాల్‌ 3గీ3 విభాగంలో భారత మహిళలు 16-6తో మలేసియాను చిత్తు చేసి క్వార్టర్స్‌ చేరారు. పురుషుల జట్టు 17-19తో ఇరాన్‌ చేతిలో ఓడింది.

గోల్ఫ్‌లో చారిత్రక స్వర్ణం దిశగా అదితి: గోల్ఫ్‌ వ్యక్తిగత విభాగంలో అదితి అశోక్‌ చారిత్రక స్వర్ణం అందుకొనే దిశగా పయనిస్తోంది. మూడో రౌండ్‌లో అదితి 11 అండర్‌ 61 స్కోరుతో సమీప ప్రత్యర్థి యూబోల్‌ (థాయ్‌లాండ్‌) కంటే 7 షాట్లు ముందంజలో నిలిచింది.

బాక్సర్‌ ప్రీతికి ఒలింపిక్‌ బెర్త్‌: బాక్సర్‌ ప్రీతివర్మ (54 కి.) తన విభాగంలో సెమీస్‌ చేరి పతకం ఖరారు చేసుకోవడంతోపాటు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌నూ దక్కించుకుంది. క్వార్టర్స్‌లో ప్రీతి 4-1తో జైనా (కజకిస్థాన్‌)కు షాకిచ్చింది. ఒలింపిక్‌ కాంస్య పతక విజేత లవ్లీనా (75 కి.) 5-0తో సెంగ్‌ సియాన్‌ (సౌత్‌ కొరియా)ను చిత్తుచేసి సెమీ్‌సలో ప్రవేశించి పతకం ఖాయం చేసుకుంది.

హాకీలో పాక్‌పై గెలిచి సెమీస్‌కు: పురుషుల హాకీలో భారత్‌ 10-2తో పాకిస్థాన్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

నందిని..హీట్స్‌లో తొలిస్థానం: మహిళల హెప్టాథ్లాన్‌ 200 మీ. ఈవెంట్‌లో తెలుగు అథ్లెట్‌ అగసార నందిని తన హీట్‌లో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే 100 మీటర్ల హీట్స్‌లో నాలుగో స్థానం, హైజంప్‌లో 9, షాట్‌పుట్‌లో 8వ స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్‌లో స్వప్నా బర్మన్‌ కూడా పాల్గొంటోంది.

Updated Date - 2023-10-01T02:53:58+05:30 IST