WPL MI vs RCB : ముంబై మురిసె

ABN , First Publish Date - 2023-03-07T04:32:47+05:30 IST

పటిష్టమైన బౌలింగ్‌ బలగం, బలీయమైన బ్యాటింగ్‌ విభాగం.. వెరసి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో విజయం. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ..

WPL MI vs RCB : ముంబై మురిసె

రెండో మ్యాచ్‌లోనూ గెలుపు

మాథ్యూస్‌, స్కివర్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌

9 వికెట్లతో బెంగళూరు ఓటమి

ముంబై: పటిష్టమైన బౌలింగ్‌ బలగం, బలీయమైన బ్యాటింగ్‌ విభాగం.. వెరసి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో విజయం. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై 9 వికెట్లతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేసింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్‌ (28), మంధాన (23), శ్రియాంక (23), అహూజా (22), మేగన్‌ (20) రాణించారు. హేలీ మాఽథ్యూస్‌ 3, ఇషాక్‌, కెర్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. హేలీ మాథ్యూస్‌ (38 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 77 నాటౌట్‌), నాట్‌ స్కివర్‌ బ్రంట్‌ (29 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 55 నాటౌట్‌) సూపర్‌ హాఫ్‌ సెంచరీలతో చెలరేగ డంతో లక్ష్యాన్ని ముంబై 14.2 ఓవర్లలోనే 159/1 స్కోరుతో చేరుకుంది. యాస్తికా భాటియా (19 బంతుల్లో 4 ఫోర్లతో 23) రాణించింది. మాథ్యూస్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది. కాగా, బెంగళూరుకిది వరుసగా రెండో ఓటమి.

ధనాధన్‌: ఓపెనర్లు హేలీ మాథ్యూస్‌, యాస్తికా, నాట్‌ స్కివర్‌ విజృంభించడంతో లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. భాటియా, మాథ్యూస్‌ ఎడాపెడా ఫోర్లు కొట్టడంతో స్కోరుబోర్డు రేసు గుర్రంలా దూసుకెళ్లింది. ఐదో ఓవర్లో స్పిన్నర్‌ ప్రీతి బోస్‌..భాటియాను ఎల్బీడబ్ల్యూ చేసి బెంగళూరుకు ఊరటనిచ్చింది. అయితే మాథ్యూ్‌సతో జత కలిసిన నాట్‌ స్కివర్‌ బౌండ్రీల వర్షం కురిపించడంతో బౌలర్లకు చేష్టలుడిగాయి. 10వ ఓవర్లో మాథ్యూస్‌ హాఫ్‌ సెంచరీ (26 బంతుల్లో) సాధించగా..ఫోర్‌తో స్కివర్‌ కూడా 28 బంతుల్లో ఆ మార్క్‌ చేరింది. ఆపై బౌండ్రీతో స్కివర్‌ మ్యాచ్‌ను ముగించింది. మాథ్యూస్‌, స్కివర్‌ రెండో వికెట్‌కు అభేద్యంగా 114 రన్స్‌ జోడించారు.

ఆర్‌సీబీకి స్పిన్నర్ల కళ్లెం: మంధాన, సోఫీ డివైన్‌ భారీ షాట్లతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ దూకుడుగా ప్రారంభమైంది. కానీ ఆదిలో స్పిన్నర్లుఇషాక్‌, మాథ్యూస్‌, చివర్లో కెర్‌ డబుల్‌ ఝలక్‌లు ఇవ్వడంతో బెంగళూరు ఇన్నింగ్స్‌ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. మిడిల్‌, లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాటర్లు రాణించడంతో ఆ జట్టు ఫర్వాలేదనిపించే స్కోరు సాధించగలిగింది. మాథ్యూస్‌ వేసిన తొలి ఓవర్లో మంధాన 4, సోఫీ 6 బాదడంతో..11 పరుగులతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ ధాటిగా మొదలైంది. ఆపై ఓపెనర్లిద్దరూ ఓవర్‌కో బౌండ్రీ చొప్పున సాధిస్తూ వెళ్లారు. ముఖ్యంగా వాంగ్‌ వేసిన నాలుగో ఓవర్లో 3 కళ్లు చెదిరే ఫోర్లతో మంధాన కదం తొక్కింది. కానీ ఐదో ఓవర్లో ఇషాక్‌ ఆర్‌సీబీకి డబుల్‌ షాకిచ్చింది. ఇషాక్‌ బంతిని మిడ్‌వికెట్‌ దిశగా భారీషాట్‌ కొట్టబోయిన సోఫీ (16)..అమన్‌జోత్‌ పట్టిన క్యాచ్‌తో అవుటైంది. ఆపై దిషా కసట్‌ (0)ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన ఇషాక్‌ ముంబైలో ఆనందోత్సాహాలు నింపింది.

ఇక ఆరో ఓవర్లో ఊరించే బంతితో కెప్టెన్‌ మంధానాను క్యాచవుట్‌ చేసిన స్పిన్నర్‌ మాథ్యూస్‌, తదుపరి బాల్‌కు స్టార్‌ బ్యాటర్‌ హీథర్‌ నైట్‌ (0)ను క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో బెంగళూరు కేవలం ఐదు పరుగుల తేడాతో నాలుగు వికెట్లు చేజార్చుకుంది. మొత్తంగా పవర్‌ ప్లేలో 47/4తో ఆ జట్టు తీవ్ర ఇబ్బందులో పడింది. అయినా ఎలీస్‌ పెర్రీ, రిచా ఘోష్‌ చెరో సిక్సర్‌ బాది స్కోరుబోర్డులో వేగం పెంచారు. కానీ తొమ్మిదో ఓవర్లో సమన్వయలోపంతో పెర్రీ (13) రనౌట్‌ కావడంతో ఆర్‌సీబీకి మరోసారి షాక్‌ తగిలింది. కనిక అహూజా భారీ షాట్లతో విరుచుకుపడడంతో 12వ ఓవర్లో బెంగళూరు స్కోరు సెంచరీ దాటింది. అహూజా, రిచా ఆరో వికెట్‌కు చకచకా 34 పరుగులు జోడించి సాగుతున్న తరుణంలో..అహూజాను వస్త్రాకర్‌ పెవిలియన్‌ చేర్చింది. రెండో విడత బౌలింగ్‌కు దిగిన మాథ్యూ్‌స..రిచా ఘోష్‌ను అవుట్‌ చేయడంతో బెంగళూరు ఇన్నింగ్స్‌ మళ్లీ మొదటికొచ్చింది. ఈ దశలో యువ బ్యాటర్‌ శ్రియాంక మెరుపులు మెరిపించినా 17వ ఓవర్లో నాట్‌ స్కివర్‌..ఆమె దూకుడుకు బ్రేక్‌ వేసింది. .ఇక 19వ కెర్‌ రెండు వికెట్లు తీయడంతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ ముగిసింది.

స్కోరుబోర్డు

బెంగళూరు: మంధాన (సి) వాంగ్‌ (బి) మాథ్యూస్‌ 23, సోఫీ డివైన్‌ (సి) అమన్‌జోత్‌ (బి) ఇషాక్‌ 16, దిషా కసట్‌ (బి) ఇషాక్‌ 0, పెర్రీ (రనౌట్‌/కజి) 13, నైట్‌ (బి) మాథ్యూస్‌ 0, రిచా (సి) నాట్‌ స్కివర్‌ (బి) మాథ్యూస్‌ 28, కనిక అహూజా (సి) యాస్తికా (బి) వస్త్రాకర్‌ 22, శ్రియాంక (ఎల్బీ) నాట్‌ స్కివర్‌ 23, మేగన్‌ (స్టంప్డ్‌) తానియా (బి) కెర్‌ 20, రేణుక (బి) కెర్‌ 2, ప్రీతి బోస్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 18.4 ఓవర్లలో 155 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1/39, 2/39, 3/43, 4/43, 5/71, 6/105, 7/112, 8/146, 9/154; బౌలింగ్‌: మాథ్యూస్‌ 4-0-28-3, నాట్‌ స్కివర్‌ 3-0-34-1, సైకా ఇషాక్‌ 4-0-26-2, ఇసీ వాంగ్‌ 2-0-18-0, కెర్‌ 3.4-0-30-2, కలిట 1-0-10-0, వస్త్రాకర్‌ 1-0-8-1.

ముంబై: హేలీ మాథ్యూస్‌ (నాటౌట్‌) 77, యాస్తిక (ఎల్బీ) ప్రీతి బోస్‌ 23, నాట్‌ స్కివర్‌ (నాటౌట్‌) 55, ఎక్స్‌ ట్రాలు: 4, మొత్తం: 14.2 ఓవర్లలో 159/1 వికెట్‌ పతనం: 1/45 బౌలింగ్‌: రేణుకా సింగ్‌ 3-0-28-0, ప్రీతి బోస్‌ 4-0-34-1, మేగన్‌ 3-0-32-0, పెర్రీ 1.2-0-18-0, శ్రియాంక పాటిల్‌ 2-0-32-0, సోఫీ డివైన్‌ 1-0-11-0.

Updated Date - 2023-03-07T08:06:36+05:30 IST