Attack on Prithvi Shah's car : సెల్ఫీ వివాదం.. పృథ్వీ షా కారుపై దాడి

ABN , First Publish Date - 2023-02-17T01:08:42+05:30 IST

సెల్ఫీ విషయంలో నెలకొన్న గొడవ కారణంగా.. టీమిండియా ఆటగాడు పృథ్వీ షా కారుపై కొందరు వ్యక్తులు దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయిన సప్నాగిల్‌తోపాటు

Attack on Prithvi Shah's car : సెల్ఫీ వివాదం.. పృథ్వీ షా కారుపై దాడి

సోషల్‌ మీడియా సెలబ్రిటీ సప్నా గిల్‌ అరెస్టు

మరో ఏడుగురిపై కేసు నమోదు

ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్‌

హోటల్‌ వెలుపల ఘటన

మహిళ సహా 8 మంది అరెస్టు

ముంబై: సెల్ఫీ విషయంలో నెలకొన్న గొడవ కారణంగా.. టీమిండియా ఆటగాడు పృథ్వీ షా కారుపై కొందరు వ్యక్తులు దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయిన సప్నాగిల్‌తోపాటు మరో ఏడుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బేస్‌ బాల్‌ బ్యాట్‌తో షా కారుపై దాడి చేస్తున్న దృశ్యాలు నెట్‌లో వైరల్‌గా మారాయి. ఆయుధాలతో దాడి చేయడంతోపాటు బలవంతపు వసూళ్లకు యత్నించినట్టు నిందితులపై కేసులు నమోదు చేశారు. ఎయిర్‌పోర్టు దగ్గరున్న ఓ స్టార్‌ హోటల్‌లో బుధవారం తెల్లవారు జామున షా, అతడి స్నేహితుడు ఆశిష్‌ యాదవ్‌ కలిసి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హోటల్‌లో ఓ వ్యక్తి సెల్ఫీ అడగ్గా పృథ్వీ అంగీకరించాడు. కానీ, అదే పనిగా ఫొటోలు తీస్తుండడంతో షా వారించాడు. దీంతో అతడు వాదనకు దిగగా.. హోటల్‌ సిబ్బంది బయటకు పంపారు. అయితే, పృధ్వీషా భోజనం ముగించుకొని బయటకు వస్తుండగా... సెల్ఫీ అడిగిన వ్యక్తి కారుపై దాడి చేయడంతో ముందు అద్దం పగిలింది. ప్రమాదాన్ని గుర్తించి షాను ఇంకో కారులో తరలించిన యాదవ్‌.. మరో వ్యక్తితో కలసి ఒసివారవైపు వెళ్లాడు. కానీ, మూడు బైక్‌లపై నిందితులతోపాటు ఓ కారు కూడా వారిని వెంబడించింది. ఉన్నట్టుండి ఒకరు బ్యాట్‌తో కారు వెనుక అద్దంపై దాడి చేయడంతో.. ఒసివార పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తనకు రూ. 50 వేలు చెల్లించాలని లేకపోతే తప్పుడు కేసు పెడతానని కారులోని మహిళ బెదిరించిందని యాదవ్‌ పేర్కొన్నట్టు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి శోభిత్‌ ఠాకూర్‌, సప్నాతోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొన్నట్టు పోలీసులు చెప్పారు.

Updated Date - 2023-02-17T01:08:42+05:30 IST