Sindhu: కోచ్‌ పార్క్‌తో సింధు కటీఫ్‌

ABN , First Publish Date - 2023-02-25T00:26:09+05:30 IST

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తన వ్యక్తిగత కోచ్‌, దక్షిణ కొరియాకు చెందిన పార్క్‌ టి సాంగ్‌ సేవలకు గుడ్‌బై చెప్పింది. ఈ విషయాన్ని పార్క్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు.

Sindhu: కోచ్‌ పార్క్‌తో సింధు కటీఫ్‌

ఇన్‌స్టాలో వెల్లడించిన కొరియా శిక్షకుడు

సుచిత్ర అకాడమీ కోచ్‌తో ఆల్‌ ఇంగ్లండ్‌కు పీవీ సన్నద్ధం!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తన వ్యక్తిగత కోచ్‌, దక్షిణ కొరియాకు చెందిన పార్క్‌ టి సాంగ్‌ సేవలకు గుడ్‌బై చెప్పింది. ఈ విషయాన్ని పార్క్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన అనంతరం ఎడమకాలి మడమ స్ట్రెస్‌ ఫ్రాక్చర్‌ కారణంగా దాదాపు ఐదు నెలలు సింధు విరామం తీసుకుంది. తర్వాత మలేసియా, ఇండియా ఓపెన్‌తో పాటు ఆడిన పలు టోర్నీల్లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడం వీరి ఒప్పందంపై ప్రతికూల ప్రభావం చూపిందని తెలుస్తోంది. ఇక, దుబాయ్‌లో జరిగిన ఆసియా మిక్స్‌డ్‌ చాంపియన్‌షిప్‌లో తనకంటే చాలా తక్కువ ర్యాంక్‌ ప్లేయర్ల చేతిలోనూ ఓడడం సింధును కోచ్‌ మార్పుపై ఆలోచింప చేసింది. మరోవైపు ఈ సీజన్‌లో సింధు పరాజయాలకు తానే బాధ్యత వహిస్తానని పార్క్‌ చెప్పాడు.

పార్క్‌ శిక్షణలోనే సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం, కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి పతకాలు సాధించడం తెలిసిందే. సింధు కెరీర్‌లో పార్క్‌ మూడో కోచ్‌. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ వరకు శిక్షణ ఇచ్చేందుకు పార్క్‌కు కాంట్రాక్టు ఉన్నా సింధు విజ్ఞప్తి మేరకు అతడు వైదొలిగాడు. వాస్తవానికి పురుషుల సింగిల్స్‌ ప్లేయర్లకు శిక్షణ ఇచ్చేందుకు పార్క్‌ను భారత బ్యాడ్మింటన్‌ సంఘం అప్పట్లో నియమించింది. అయితే, ఆ తర్వాత సింధుకు ప్రధాన కోచ్‌గా మారాడు. కాగా ఆల్‌ ఇంగ్లండ్‌ మాజీ చాంపియన్‌, మలేసియా మాజీ స్టార్‌ షట్లర్‌ మహ్మద్‌ హఫీజ్‌ హషీంతో సుచిత్ర అకాడమీ రెండేళ్ల పాటు ఒప్పందం చేసుకుంది. వచ్చే నెలలో జరగనున్న ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతున్న సింధుకు హషీం దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

Updated Date - 2023-02-25T00:26:10+05:30 IST