Share News

3rd T20 India win : సూర్య విధ్వంసం.. సిరీస్‌ సమం

ABN , Publish Date - Dec 15 , 2023 | 06:10 AM

గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్‌షోతో చెలరేగింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ (56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100) తుఫాన్‌ శతకం, యశస్వీ జైస్వాల్‌ (41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) అర్ధసెంచరీలకు

3rd T20 India win  : సూర్య విధ్వంసం..  సిరీస్‌ సమం

కుల్దీప్‌ ఐదు వికెట్లు

106 రన్స్‌తో దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం

56 బంతుల్లో కెప్టెన్‌ శతకం

జొహాన్నెస్‌బర్గ్‌: గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్‌షోతో చెలరేగింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ (56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100) తుఫాన్‌ శతకం, యశస్వీ జైస్వాల్‌ (41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) అర్ధసెంచరీలకు తోడు బర్త్‌డే బాయ్‌ కుల్దీప్‌ యాదవ్‌ (5/17) కెరీర్‌లోనే బెస్ట్‌ బౌలింగ్‌తో బెంబేలెత్తించాడు. దీంతో గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్‌ 106 రన్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీ్‌సను సైతం 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్‌ వర్షంతో రద్దయిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. కేశవ్‌, విలియమ్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో సౌతాఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. మిల్లర్‌ (35) టాప్‌ స్కోరర్‌. జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. సూర్యకుమార్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు. కాగా మూడో ఓవర్లో సూర్యకుమార్‌కు చీలమండ గాయమైంది. దీంతో బయటికి వెళ్లిన అతడు మళ్లీ ఫీల్డ్‌లోకి రాలేదు.

కుల్దీప్‌ మాయ: భారీ ఛేదనలో సఫారీల ఆటతీరు తడబడుతూనే సాగింది. స్పిన్నర్‌ కుల్దీప్‌ మధ్య ఓవర్లలోనే జట్టును కుప్పకూల్చాడు. తొలి 7 ఓవర్లలోనే బ్రీస్కీ (4), హెన్‌డ్రిక్స్‌ (8), క్లాసెన్‌ (5), మార్‌క్రమ్‌ (25) అవుట్‌ కావడంతో కోలుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన వారంతా వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యారు. మరో ఎండ్‌లో మిల్లర్‌ పోరాటానికి సహకారం కరువైంది. అటు కుల్దీప్‌ 14వ ఓవర్‌లోనే ఆఖరి మూడు వికెట్లు తీయడంతో సఫారీలకు ఘోర ఓటమి తప్పలేదు.

చెలరేగిన సూర్య, జైస్వాల్‌: ఈ మ్యాచ్‌లోనూ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఝలక్‌ తగిలినా.. ఓపెనర్‌ జైస్వాల్‌, కెప్టెన్‌ సూర్యకుమార్‌ మెరుపు ఆటతీరుతో 200 స్కోరు దాటగలిగింది. అయితే డెత్‌ ఓవర్లలో సఫారీ బౌలర్లు కాస్త పుంజుకున్నారు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లోనే స్పిన్నర్‌ కేశవ్‌ ఓపెనర్‌ గిల్‌ (8), తిలక్‌ వర్మ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. అయితే గిల్‌ తన ఎల్బీపై డీఆర్‌ఎస్‌ కోరకుండానే క్రీజు వదలగా, రీప్లేలో అంపైర్‌ నిర్ణయం తప్పని తేలింది. అనంతరం జైస్వాల్‌, సూర్య కదం తొక్కారు. వీరి ధాటికి పవర్‌ప్లేలో స్కోరు 62/2కి చేరింది. ఆ తర్వాత మరో నాలుగు ఓవర్లలో 25 పరుగులే వచ్చాయి. ఈక్రమంలో 34 బంతుల్లో జైస్వాల్‌ ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఫెలుక్వాయో వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో సూర్య 6,4,6,6తో చెలరేగి 23 రన్స్‌ రాబట్టడంతో స్కోరులో కదలిక వచ్చింది. అలాగే ఈ ఊపులో తను 32 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. అటు జైస్వాల్‌ జోరుకు షంసీ బ్రేక్‌ వేయడంతో మూడో వికెట్‌కు 70 బంతుల్లో 112 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రింకూ (14) ఓ సిక్సర్‌తో ఊపుమీద కనిపించినా ఎక్కువ సేపు నిలవలేదు. ఇక చివరి 2 ఓవర్లలో భారత్‌ 15 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. 20వ ఓవర్‌ తొలి బంతికి రెండు పరుగులు సాధించిన సూర్య కెరీర్‌లో నాలుగో శతకం పూర్తి చేయగా, తర్వాతిబంతికే బౌండరీ లైన్‌ దగ్గర బ్రీస్కీకి క్యాచ్‌ ఇచ్చాడు. తానెదుర్కొన్న చివరి 26 బంతుల్లోనే అతడు 65 పరుగులు చేశాడు. నాలుగో బాల్‌కు జడేజా (4) రనౌట్‌.. ఐదో బంతికి జితేశ్‌ (4) హిట్‌ వికెట్‌గా వెనుదిరిగారు.

స్కోరుబోర్డు

భారత్‌: యశస్వీ (సి) హెన్‌డ్రిక్స్‌ (బి) షంసి 60, గిల్‌ (ఎల్బీ) మహరాజ్‌ 8, తిలక్‌ వర్మ (సి) మార్‌క్రమ్‌ (బి) మహరాజ్‌ 0, సూర్యకుమార్‌ (సి) బ్రీస్కీ (బి) లిజాడ్‌ విలియమ్స్‌ 100, రింకూ సింగ్‌ (సి-సబ్‌) స్టబ్స్‌ (బి) బర్గర్‌ 14, జితేశ్‌ (హిట్‌ వికెట్‌) (బి) లిజాడ్‌ 4, జడేజా (రనౌట్‌) 4, అర్ష్‌దీప్‌ (నాటౌట్‌) 0, సిరాజ్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు 9, మొత్తం: 20 ఓవర్లలో 201/7; వికెట్లపతనం: 1-29, 2-29, 3-141, 4-188, 5-194, 6-199, 7-199; బౌలింగ్‌: బర్గర్‌ 4-0-39-1, మార్‌క్రమ్‌ 1-0-15-1, కేశవ్‌ మహరాజ్‌ 4-0-26-2, లిజాడ్‌ 4-0-46-2, ఫెలుక్వాయో 3-0-33-0, షంసీ 4-0-38-1.

దక్షిణాఫ్రికా: హెన్‌డ్రిక్స్‌ (రనౌట్‌/సిరాజ్‌) 8, బ్రీస్కీ (బి) ముకేశ్‌ 4, మార్‌క్రమ్‌ (సి) యశస్వీ (బి) జడేజా 25, క్లాసెన్‌ (సి) రింకూ (బి) అర్ష్‌దీప్‌ 5, మిల్లర్‌ (బి) కుల్దీప్‌ 35, ఫెరీరా (బి) కుల్దీప్‌ 12, ఫెలుక్వాయో (సి) అండ్‌ (బి) జడేజా 0, కేశవ్‌ (బి) కుల్దీప్‌ 1, బర్గర్‌ (బి) కుల్దీప్‌ 1, లిజాడ్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 0, షంసీ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం: 13.5 ఓవర్లలో 95 ఆలౌట్‌; వికెట్లపతనం: 1-4, 2-23, 3-42, 4-42, 5-75, 6-82, 7-89, 8-94, 9-94; బౌలింగ్‌: సిరాజ్‌ 3-1-13-0, ముకేశ్‌ 2-0-21-1, అర్ష్‌దీప్‌ 2-0-13-1, జడేజా 3-0-25-2, తిలక్‌ వర్మ 1-0-4-0, కుల్దీప్‌ 2.5-0-17-5.

పురుషుల టీ20ల్లో ఎక్కువ సెంచరీలు (4) బాదిన బ్యాటర్‌గా రోహిత్‌, మ్యాక్స్‌వెల్‌ సరసన నిలిచిన సూర్యకుమార్‌.

భారత్‌ తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు (123) బాదిన రెండో బ్యాటర్‌గా సూర్య. రోహిత్‌ (182) టాప్‌లో ఉన్నాడు.

పురుషుల టీ20ల్లో ఎక్కువ సెంచరీలు (4) బాదిన బ్యాటర్‌గా రోహిత్‌, మ్యాక్స్‌వెల్‌ సరసన నిలిచిన సూర్యకుమార్‌.

Updated Date - Dec 15 , 2023 | 06:10 AM