Gujarat Titan IPL: సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లో జెర్సీ మార్చిన గుజరాత్.. 2015లో ఢిల్లీ డేర్‌డేవిల్స్ తర్వాత మళ్లీ ఇప్పుడే.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2023-05-15T22:12:21+05:30 IST

సొంత మైదానంలో ప్రేక్షకులకు కేవలం క్రికెట్ మజానే కాకుండా మంచి సందేశాన్ని కూడా ఇవ్వాలని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం నిర్ణయించింది. అందుకోసం ఏం చేసిందంటే...

Gujarat Titan IPL: సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లో జెర్సీ మార్చిన గుజరాత్.. 2015లో ఢిల్లీ డేర్‌డేవిల్స్ తర్వాత మళ్లీ ఇప్పుడే.. ఎందుకంటే..

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ ముగింపు దశకు చేరుకుంది. జట్లన్నీ తమ చివరి 2 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని జట్లు తమ సొంత మైదానాల్లో సొంత ప్రేక్షకుల ముందు చివరి ప్రదర్శన చేయబోతున్నాయి. అయితే గుజరాత్ టైటాన్స్ (Gujarat titans) మాత్రం సోమవారమే (15-5-2023) సొంత మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి మ్యాచ్‌ను ఆడింది. ఈ మ్యాచ్‌లో ప్రేక్షకులకు కేవలం క్రికెట్ మజానే కాకుండా మంచి సందేశాన్ని కూడా ఇవ్వాలని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకోసం గుజరాత్ ఆటగాళ్లు సంప్రదాయ డార్క్ బ్లూ జెర్సీకి బదులు లావెండర్ రంగు (lavender colour) జెర్సీ ధరించి మైదానంలోకి దిగారు. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం....

క్యాన్సర్‌పై (Cancer) అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా గుజరాత్ ఆటగాళ్లు లావెండర్ జెర్సీని ధరించారు. నిజానికి లావెండర్ రంగు అన్నవాహిక క్యాన్సర్‌కు (Oesophageal cancer) సంబంధించినదే అయినప్పటికీ అన్ని రకాల క్యాన్సర్లను ఈ రంగు ద్వారా సూచిస్తుంటారు. అందుకే ఆటగాళ్లు ఈ జెర్సీతో గ్రౌండ్‌లోకి దిగారు. లావెండర్ రంగు జెర్సీ ధరించడంపై గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా స్పందిస్తూ... ‘‘ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిపై ఒక జట్టుగా జనాల్లో అవగాహన కల్పించడం బాధ్యతగా భావిస్తున్నాం. లావెండర్ జెర్సీ ధరించి క్యాన్సర్ పేషెంట్లు, వ్యాధి నుంచి కోలుకున్నవారు, వారి కుటుంబ సభ్యులకు సంఘీభావంగా నిలవాలనుకున్నాం. మా చర్యలు క్యాన్సర్‌ నిరోధర చర్యలకు సంబంధించి ఇతరులకు ప్రేరణనివ్వడంతోపాటు వ్యాధిపై పోరాడుతున్నవారికి మద్ధతుగా నిలుస్తున్నట్టుగా భావిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.

కాగా ఐపీఎల్ 2015 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పుడు ఢిల్లీ డేర్‌డెవిల్స్) కూడా లావెండర్ రంగు జెర్సీ ధరించి బరిలోకి దిగింది. మే 1న క్యాన్సర్ సర్వైవర్స్ డే సందర్భంగా పంజాబ్ కింగ్స్‌పై ఈ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-15T22:14:06+05:30 IST